Hyderabad: ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సైబరాబాద్ పోలీసుల ఆదేశాలు
ABN , Publish Date - Sep 02 , 2024 | 11:50 AM
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నగరంలోని అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. ఇంటి నుంచి పని చేయడం ద్వారా అత్యవసరాల్లో రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తదని వారు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీలకు లేఖ రాశారు. వర్క్ ఫ్రం హోం చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయోల్ డేవిస్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి, సహాయక శిబిరాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్..
హైదరాబాద్‌లో చినుకుపడితే భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఐటీ కారిడార్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఐటీ ఉద్యోగులంతా దాదాపు అందరూ సొంత వాహనాల్లో ఆఫీసులకు వస్తుంటారు. పని వేళలు ముగిసే సమయానికి ట్రాఫిక్ రద్దీ ఎక్కువైపోతోంది. అందుకే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తే ట్రాఫిక్ తగ్గుతుందని..సహాయక చర్యలు తొందరగా చేపట్టేందుకు వీలు కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు.
ఆదివారం కుండపోతే..
హైదరాబాద్‌లో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్, ఉప్పల్, చాంద్రయణగుట్ట, మియాపూర్, అల్విన్, హఫీజ్‌పేట, కొండాపూర్, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రహ్మత్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ , దిల్‌సుక్ నగర్, మలక్ పేట సహా చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకి వదిలేస్తున్నారు. హైదరాబాద్ మీదుగా వెళ్లే మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తోంది. హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
For Latest News click here