Share News

Fraud: హైదరాబాద్‌లో భారీ స్కాం.. రూ.7 వేల కోట్లతో పరారైన డీబీ బ్రోకింగ్ కంపెనీ చైర్మన్

ABN , Publish Date - Oct 08 , 2024 | 09:56 AM

అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేసి రూ.7 వేల కోట్ల స్కాంకు పాల్పడిన డీబీ బ్రోకింగ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది.

Fraud: హైదరాబాద్‌లో భారీ స్కాం.. రూ.7 వేల కోట్లతో పరారైన డీబీ బ్రోకింగ్ కంపెనీ చైర్మన్

హైదరాబాద్: అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేసి రూ.7 వేల కోట్ల స్కాంకు పాల్పడిన డీబీ బ్రోకింగ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ బాధితులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధిక లాభాలు ఆశ చూపి తమను మోసం చేశారని బాధితులు వాపోతున్నారు. వారి ఫిర్యాదు మేరకు డీబీ స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌తోపాటు ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గౌహతి, ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. భారీగా పెట్టుబడులు పెట్టించి స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు బాధితులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. హైదరాబాదులోనే 20 వేల మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

స్కామ్ బయటపడిందిలా..

హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ సెప్టెంబర్ 23న పోలీసులను ఆశ్రయించాడు. అసోం రాష్ట్రం గౌహతికి చెందిన దీపాంకర్ బర్మన్‌కు చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. లాభాలు తెస్తామని లాభాలు చూపించి అధిక మొత్తంలో డబ్బు తీసుకుని డీబీ బ్రోకింగ్ కంపెనీ తనను మోసం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ప్రధాన నిందితుడు దీపాంకర్ బర్మన్

2018లో కార్యకలాపాలు ప్రారంభించిన DB స్టాక్ బ్రోకింగ్, అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది క్లయింట్‌లను ఆకర్షించింది. 120 % వడ్డీతో వార్షిక పథకం, 54%తో అర్ధ వార్షిక పథకం, 7% అందించే నెలవారీ పథకాలు వీరి సంస్థలో ఉన్నాయి. అయితే, జులై 2024 నుంచి తమకు చెల్లింపులు ఆగిపోయాయని పెట్టుబడిదారులు తెలిపారు. DB స్టాక్ బ్రోకింగ్ హైదరాబాద్‌లోని KPHB కాలనీలో ఒక శాఖను కలిగి ఉంది. ఇక్కడ చాలా మంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న మరో వ్యక్తి జగదీష్‌పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకు, విశ్వజీత్ సింగ్.. డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో రూ. 36.8 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వడ్డీ చెల్లింపుల్లో రూ.16.2 లక్షలు మాత్రమే ఇచ్చారు. అసలు చెల్లించలేదు. అదేవిధంగా, డిసెంబర్ 2022లో రూ. 88.5 లక్షలు పెట్టుబడి పెట్టిన గంటాడి హరీష్ పాక్షిక వడ్డీ చెల్లింపులను అందుకున్నాడు. అతని అసలు కూడా బాకీ ఉంది.


పరారీలో..

మోసానికి పాల్పడిన దీపాంకర్ బర్మాన్ తన కార్యాలయానికి తాళం వేసి 21 ఆగస్టు 2024న గౌహతి నుంచి పారిపోయాడు. అతను ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో దీపాంకర్‌ను పట్టుకోవడం కష్టంగా మారింది. సైబరాబాద్ పోలీసులు బర్మాన్‌తో పాటు అతని సహచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Bathukamma: ఏడో రోజు వేపకాయ బతుకమ్మ.. ఈరోజు ఏం చేస్తారంటే


For Latest News and National News click here..

Updated Date - Oct 08 , 2024 | 09:56 AM