Share News

Rain Alert: ఈ ప్రాంతాలకు రెండు రోజులు వానలే వానలు..

ABN , Publish Date - Sep 25 , 2024 | 07:23 PM

తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.

Rain Alert: ఈ ప్రాంతాలకు రెండు రోజులు వానలే వానలు..
Weather Report

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.

హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భాగ్యనగరంలో సెప్టెంబర్ 28 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. మంగళవారం అత్యధికంగా నల్గొండ జిల్లాలో 129.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా ముషీరాబాద్‌లో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ వెల్లడించింది. నిన్న.. వరంగల్‌ జిల్లా ఖిల్లా వరంగల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 9.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.95, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 8.53, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో 8.35, నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరులో 7.8, రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలం తాటివనంలో 7.78, మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేటలో 7.2 నిర్మల్‌ జిల్లా భైంసాలో 7.4 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి.


వరద నీరు ముంచెత్తడంతో మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ పట్టణంలోని జాతీయ రహదారిపై, ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో మంఖాల్‌, హర్షగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కేశంపేట మండలం సంగెంలో పెంకుటిల్లు కూలిపోయింది. కొందుర్గు మండలంలోని ఎంకిర్యాల- తంగళ్లపల్లి మధ్య మట్టి రోడ్డు మళ్లీ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నవాబుపేట్‌-కొందర్గు మధ్య ఎంకిర్యాల వాగు తెగిపోవడంతో ఆగిర్యాల, ఎంకిర్యాల, కాస్లాబాద్‌, కాస్లాబాద్‌తండా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో పంట పొలాలు నీట మునిగాయి.

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

For Latest News and National News Click here

Updated Date - Sep 25 , 2024 | 07:35 PM