Hyderabad: నగరంలో తెరుచుకున్న పెట్రోల్ బంకులు...
ABN , Publish Date - Jan 03 , 2024 | 07:49 AM
హైదరాబాద్: నగరంలో పెట్రోల్ బంకులు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మందకొడిగా.. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ ఉంది. ఇంధనం దొరుకుతుందా? లేదా అన్న అనుమానంతో వాహనదారులు బాటిల్స్‌తో బారులు తీరారు.
హైదరాబాద్: నగరంలో పెట్రోల్ బంకులు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మందకొడిగా.. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ ఉంది. ఇంధనం దొరుకుతుందా? లేదా అన్న అనుమానంతో వాహనదారులు బాటిల్స్‌తో బారులు తీరారు.
కాగా కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తున్నారన్న వార్తలతో.. మంగళవారం ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని నగరం మధ్యాహ్నానికి ట్రాఫిక్‌జామ్‌తో స్తంభించిపోయింది! వేలాది మంది తమ వాహనాలతో పెట్రోల్ బంకుల వద్దకు క్యూకట్టి.. ట్యాంకులు ఫుల్ చేయించుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆ క్యూలు బంకుల బయట కిలోమీటరు దూరానికిపైగా వ్యాపించి జంక్షన్లు జామైపోయాయి! నగరానికి ఆ మూలన ఉన్న ఆటోనగర్ నుంచి.. వనస్థలిపురం, చింతలకుంట, బీఎన్‌రెడ్డినగర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, సోమాజీగూడ, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ-హైటెక్‌సిటీ రోడ్డు, మాధాపూర్, కొండాపూర్, యూస్‌ఫగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, పద్మారావునగర్, తిరుమలగిరి, బోయిన్పల్లి, సీతాఫల్మండి.. ఆ పేట, ఈ బస్తీ అనే తేడా లేదు! ప్రతి రోడ్డు.. ప్రతి చౌరస్తా.. వాహనాలతో కిటకిటలాడిపోయాయి. ట్రక్కు డ్రైవర్ల సమ్మె గురించిగానీ.. పెట్రోల్ బంకుల వద్ద రద్దీతో జంక్షన్లు జామైపోయిన విషయంగానీ తెలియక బయటకు వచ్చిన సామాన్యులు చాలా మంది.. ఈ ట్రాఫిక్ దెబ్బకు అల్లాడిపోయారు. సాధారణంగా అరగంట పట్టే దూరానికి రెండు గంటలకు పైగా సమయం పట్టడంతో.. అడుగుతీసి అడుగు వేసినట్టుగా మంద్రంగా కదులుతున్న ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించలేక.. విలవిలలాడిపోయారు. ‘అనవసరంగా బయటికొచ్చాంరా భగవంతుడా’ అని వాపోయారు. అసలు పెట్రోల్ బంకుల వద్ద బారులుతీరినవారిలో కూడా చాలా మందికి అసలు ఈ సమ్మె ఏమిటి? ఎన్నిరోజులు? అనే విషయాలే తెలీవంటే అతిశయోక్తి కాదు. సమ్మె మూడురోజులని కొందరు.. కాదు వారమని మరికొందరు.. నెలరోజులని ఇంకొందరు.. ఇలా సోషల్‌మీడియాలో ఇష్టారీతిన ప్రచారం చేయడంతో వాటిని నమ్మి వచ్చినవారే చాలా మంది. కారణమేదైనాగానీ.. నగరంలోని వాహనదారులకు, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్, ఆటో డ్రైవర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన ఈ ట్రాఫిక్ రాత్రి దాకా కొనసాగింది.
ఇదీ నేపథ్యం
హిట్ అండ్ రన్ కేసుల్లో.. రూ.7 లక్షల జరిమానా, పదేళ్ల దాకా జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్తచట్టాన్ని తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ట్రక్కుడ్రైవర్లు సోమవారం సమ్మెకు దిగారు. మంగళవారం ఆ సమ్మె రెండోరోజుకు చేరింది. సమ్మె ఇలాగే కొనసాగితే ఇంధన కొరత ఏర్పడుతుందన్న ఆందోళన సహజమే. కానీ.. సోషల్ మీడియాలో చాలా మంది ఈ విషయాన్ని విస్తృతంగా వైరల్ చేయడంతో అందరిలో ఆందోళన పెరిగిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆ భయంతోనే చాలా మంది పెట్రోల్ బంక్‌ల వద్దకు వాహనాలతో, పెట్రోల్ క్యాన్లు, బాటిళ్లతో చేరుకున్నారు. అవకాశం దొరికినవారంతా ట్యాంకులు ఫుల్ చేయించుకున్నారు. దీంతో మధ్యాహ్నానికే చాలా బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. ఆ బోర్డులను మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మరింత మంది తమకు దగ్గర్లో ఉన్న బంకుల వద్దకు చేరుకుని ఆయిల్ పోయించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. చాలాచోట్ల.. నోస్టాక్ బోర్డులు పెట్టినా కదలడానికి వాహనదారులు ససేమిరా అనడంతో పోలీసులు జోక్యం చేసుకుని, వారిని అక్కణ్నుంచీ బలవంతంగా పంపించాల్సి వచ్చింది. మరికొన్నిచోట్ల వాహనదారుల మధ్య.. ప్రజలకు, బంకు సిబ్బందికి నడుమ ఘర్షణలు జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఆయిల్ పోయడం ఆపేశారు. పోలీసు బందోబస్తు నడుమ ఒక్కొక్కరికీ రెండు లీటర్ల పెట్రోల్/డీజిల్ మాత్రమే పోసి పంపించారు.
చర్లపల్లి నుండి చెంగిచెర్ల వరకు ఉన్న ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి గ్యాస్, ఆయిల్ కంపెనీల వద్ద వాహనాలను నిలిపివేసి నిరసన ప్రదర్శన చేపట్టిన డ్రైవర్లు.. మధ్యాహ్నానికి తాత్కాలికంగా సమ్మెను విరమించి తమ ట్యాంకర్లను కంపెనీలలోకి తీసుకు వెళ్లి ఇంధనాన్ని నింపుకొని బయటకు వచ్చారు. ట్రాన్స్పోర్టర్ ఒత్తిడి మేరకే సమ్మెను తాత్కాలికంగా విరమించామని, కేంద్ర కమిటీ పిలుపు మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వారు స్పష్టం చేశారు. తాత్కాలికంగానైనా సమ్మె విరమిస్తున్నట్టు ట్రక్కు డ్రైవర్లు, యజమానులు మంగళవారం రాత్రి ప్రకటించడం, బంకులకు పెట్రోల్ యథావిధిగా సరఫరా అవుతుందన్న సమాచారం వాహనదారులకు ఊరట కలిగించింది. అయితే.. సమ్మె విరమణ ప్రకటన వచ్చినప్పటికీ చాలా మంది బంకుల నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. పెట్రోల్ పోయించుకునేదాకా.. అర్ధరాత్రి అయినా సరే వారు క్యూలైన్లలోనే వేచి ఉన్నారు.