Share News

Special Buses: దసరాకు ప్రత్యేక బస్సులు.. ఎన్నంటే..

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:13 AM

బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తో పాటు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల నుంచి కూడా నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.

Special Buses: దసరాకు ప్రత్యేక బస్సులు.. ఎన్నంటే..
RTC Buses

  • హైదరాబాద్‌ శివార్ల నుంచి కూడా..

  • నేటి నుంచే ప్రత్యేక బస్సుల సర్వీసులు

  • 9, 10, 11న రద్దీని బట్టి..: సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తోపాటు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల నుంచి కూడా నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. గ్రేటర్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఎల్బీనగర్‌, ఉప్పల్‌, ఆరాంఘర్‌, సంతోష్ నగర్‌, కేపీహెచ్‌బీ, ఇతర ప్రాంతాల నుంచి స్పెషల్‌ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్‌ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా విజయవాడ, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపనున్నారు. పండుగల వేళ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.


RTC BUS.jpg


వర్చువల్ మీట్

దసరాకు ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సోమవారం క్షేత్రస్థాయి అధికారులతో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వర్చ్‌వల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ నేపథ్యంలో 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు చెప్పారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. 9,10,11 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు.


కరీంనగర్‌, నిజామాబాద్‌కు ఎలక్ట్రిక్‌ సూపర్‌ లగ్జరీ బస్సులు

కరీంనగర్‌, నిజామాబాద్‌ మార్గాల్లో కొత్త ఎలక్ట్రిక్‌ సూపర్‌ లగ్జరీ బస్సులను నడుపాలని ఆర్టీసీ నిర్ణయించింది. గత దసరాతో పోల్చితే ఈసారి మహాలక్ష్మి పథకం అమలుతో పాటు అక్టోబర్‌ నెలలో 11 శుభముహుర్తాలు కూడా ఉన్నాయని, ఆ రద్దీకి తగ్గట్లు బస్సులు నడపాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రద్దీని బట్టి ప్రత్యేకబస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో రిజర్వేషన్‌ చేసుకోవాలని సూచించారు. దసరా స్పెషల్‌ బస్సులకు సంబంధించి ఇతర సమాచారం కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 01 , 2024 | 08:59 AM