Share News

Hyderabad: బంరుకున్‌దౌల చెరువులోని కట్టడాల కూల్చివేత

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:07 AM

హైదరాబాద్‌లోని పురాతనమైన బంరుకున్‌దౌల చెరువులోని ఆక్రమణలపై హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) ఉక్కుపాదం మోపింది.

Hyderabad: బంరుకున్‌దౌల చెరువులోని కట్టడాల కూల్చివేత

  • 5 భవనాలు, 30 ప్రహారీగోడలు కూల్చేసిన హైడ్రా

  • అడ్డుకోబోయిన ఎమ్మెల్యే, ఇద్దరు కార్పొరేటర్ల అరెస్టు

రాజేంద్రనగర్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పురాతనమైన బంరుకున్‌దౌల చెరువులోని ఆక్రమణలపై హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) ఉక్కుపాదం మోపింది. జాతీయ పోలీసు అకాడమీ సమీపంలోని ఈ బంరుకున్‌దౌల చెరువును ఆక్రమించి నిర్మిస్తున్న ఐదు బహుళ అంతస్తుల భవనాలను శనివారం నేలమట్టం చేసింది. 30 వరకు ప్రహరీ గోడలను కూల్చేసింది. అలాగే, ప్లాట్లుగా భూమిని విక్రయించేందుకు ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను తొలగించింది. బంరుకున్‌దౌల చెరువు ముందు భాగంలో ఉన్న ఓ బావి నిజాం నవాబులకు తాగునీరు అందించేదని ప్రచారంలో ఉంది.


కానీ, ఈ చెరువు మొత్తం ఆక్రమణకు గురైందని జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతలు చేపట్టడమే కాకుండా చెరువు, ఎఫ్‌టీల్‌కు సంబంధించి సుమారు 10 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంది. కాగా, బంరుకున్‌దౌల చెరువులోని అక్రమ నిర్మాణల కూల్చివేతను అడ్డుకునేందుకు యత్నించిన ఎంఐఎం నేత, బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌తో పాటు రామ్నా్‌సపుర, దూద్‌బౌళి కార్పొరేటర్లు అబ్దుల్‌ ఖాదర్‌, సలీం తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కూల్చివేత ప్రక్రియ అనంతరం వారిని విడుదల చేశారు.


  • బఫర్‌ జోన్లు, ఎఫ్‌టీఎల్‌ లోని నిర్మాణాలు కూల్చేస్తాం

చెరువుల బఫర్‌ జోన్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కట్టిన నిర్మాణాలను చట్టపరంగా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను చేపట్టేందుకు బిల్డర్లకు సహకరించే అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెరువు పరిసరాల్లో ఇంటి స్థలాలు, అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇళ్ల కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తక్కువ ధరకు ఆస్తి లభిస్తుందని నిబంధనలు తెలుసుకోకుండా ముందడుగు వేస్తే నష్టపోతారని తెలిపారు. చెరువుల బఫర్‌జోన్‌ అంశంలో అనుమానాల నివృత్తికి ప్రజలు హైడ్రా కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు. 90001 13667 నెంబరు వాట్సాప్‌ చేసి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేయవచ్చని ఏవీ రంగనాథ్‌ సూచన చేశారు.

Updated Date - Aug 11 , 2024 | 04:07 AM