Share News

Hydra: ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే.. ఆక్రమణలు నేలమట్టం

ABN , Publish Date - Aug 31 , 2024 | 03:44 AM

‘‘సర్‌.. మా ప్రాంతంలో రోడ్డు, నాలాను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారు. వర్షం నీరు బయటకు వె ళ్లడం లేదు.

Hydra: ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే.. ఆక్రమణలు నేలమట్టం

  • హైదరాబాద్‌ రాంనగర్‌ మణెమ్మ గల్లీ రోడ్డు, నాలాపై చర్యలు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించిన రెండు రోజుల్లోనే..

  • మూడంతస్తుల భవనం సహా రోడ్డుపై ఉన్న కట్టడాల తొలగింపు

హైదరాబాద్‌ సిటీ, ఓల్డ్‌బోయినపల్లి, రాంనగర్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ‘‘సర్‌.. మా ప్రాంతంలో రోడ్డు, నాలాను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారు. వర్షం నీరు బయటకు వె ళ్లడం లేదు. కొత్త డ్రైనేజీ లైన్‌ ఏర్పాటుకు వీలు లేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాం..’’ ఇదీ మంగళవారం హైదరాబాద్‌ అడిక్‌మెట్‌ డివిజన్‌ ముషీరాబాద్‌ సర్కిల్‌-15 పరిధి రాంనగర్‌ చౌరస్తాలోని మణెమ్మ గల్లీ వాసులు హైడ్రాకు చేసిన ఫిర్యాదు. దీనిపై 48 గంటల్లోనే అధికారులు స్పందించారు. శుక్రవారం ఉదయమే రంగంలోకి దిగారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి కూల్చివేతలు చేపట్టారు.


కాగా, మణెమ్మ గల్లీ స్థానికుల ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ బుధవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఆక్రమణలను పరిశీలించారు. రికార్డులు, ఇళ్ల డాక్యుమెంట్లను గమనించి నివేదిక ఇవ్వాలని టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ దేవేందర్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏసీపీ గురువారం సమగ్ర నివేదికను హైడ్రా కమిషనర్‌, జిల్లా కల్లెక్టర్‌కు సమర్పించారు. పరిశీలించిన రంగనాఽథ్‌.. రోడ్డు, నాలాను ఆక్రమించి చేపట్టిన కట్టడాలను తొలగొంచాలని ఆదేశించారు.


ఈ మేరకు శుక్రవారం హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌ సిబ్బంది మూడు ఎక్స్‌కవేటర్‌లతో మణెమ్మ గల్లీకి వెళ్లారు. రోడ్డుపై నిర్మించిన బాబుయాదవ్‌కు సంబందించిన యాబై గజాల ఇంటిని, యాబై గజాల స్థలంలో విక్రమ్‌యాదవ్‌కు చెందిన కల్లు కాంపౌండ్‌ షెడ్డు, దానిపక్కనే ఉన్న స్థలం గోడలు, ఆ పక్కనే ఉన్న వైష్ణవి బార్‌-రెస్టారెంట్‌ యజమాని బాల్‌రాజ్‌గౌడ్‌ నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు ఏమిటని అధికారులతో వారు వాగ్వాదానికి దిగగా ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణదారులను పోలీసులు దూరంగా తీసుకెళ్లారు.


  • ఎంపీకి ఫోన్‌ చేసినా..

మణెమ్మ గల్లీలో 40 ఏళ్లుగా ఉంటున్నవారి నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారంటూ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకుడు విజయ్‌ యాదవ్‌.. టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ దేవేందర్‌తో వాదనకు దిగినా పట్టించుకోలేదు. ఆయన ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అయినా.. అధికారులు కూల్చివేతలు కొనసాగించారు. రెవెన్యూ రికార్డులో మణెమ్మ గల్లీ నుంచి ప్రధాన రోడ్డుకు ఎల్‌ ఆకారంలో 24 అడుగుల రోడ్డు ఉందని తేలిందని అందుకు అనుగుణంగా కూల్చివేతలు చేపట్టామని ఏసీపీ దేవేందర్‌ తెలిపారు.


కాగా, మణెమ్మ గల్లీలో మురుగునీటి పారుదలకు అడ్డుపడుతూ నిర్మాణాలు చేపట్టారని, వాటిని తొలగించామని రంగనాథ్‌ వెల్లడించారు. 21వ వార్డు సర్వే నం.20లోని 155 బ్లాక్‌ ఎ జమిస్తాపూర్‌లో ఆక్రమణలను గుర్తించామని చెప్పారు. కొందరు వ్యక్తులు కల్లు కాంపౌండ్‌, తాత్కాలిక షెడ్‌తో పాటు జీ ప్లస్‌ 2 భవనాన్ని నిర్మించారని, వీటికి అనుమతులు లేవని తెలిపారు. మురుగు పారేందుకు ఇబ్బందితో మణెమ్మ గల్లీ, రాంనగర్‌వాసులు రోజూ అవస్థ పడుతున్నారని చెప్పారు.


  • రెవెన్యూ నోటీసులతో టెన్షన్‌.. టెన్షన్‌

వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ సికింద్రాబాద్‌ ఓల్డ్‌బోయినపల్లి హస్మత్‌పేట హరిజన బస్తీ వాసులు 125 మందికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులు దడ పుట్టిస్తున్నాయి. ఈ బస్తీ బోయిన్‌చెరువుకు పక్కన ఉంది. దశాబ్దాల క్రితం ఇక్కడ గడిసెలు వేసుకున్నామని, 1987లో ప్రభుత్వం పట్టాలిచ్చిందని చెబుతున్నారు. తమకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. బహుమతి వచ్చిందని నమ్మించి సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కమ్యూనిటీ హాలు, నల్లపోచమ్మ ఆలయానికి కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు.


అధికారులపై క్రిమినల్‌ కేసు

  • జీహెచ్‌ఎంసీలోని ఆరుగురిపై నమోదు

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులిచ్చినందుకే

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో నిర్మాణాలకు అనుమతులు జారీచేసిన జీహెచ్‌ఎంసీ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీరిపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతికి లేఖ రాశారు. దీంతో.. ఈర్ల చెరువు బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు ఆమోదం తెలిపిన జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ (ఏసీపీ) సర్కిల్‌-21 ఎం.రాజ్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ సుధాంశ్‌లపై కేసులు నమోదయ్యాయి. నిజాంపేట ఎర్రకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన మున్సిపల్‌ కమిషనర్‌ పి.రామకృష్ణ, తహసీల్దార్‌ పూల్‌సింగ్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శ్రీనివాసులు, డిప్యూటీ కమిషనర్‌ సుధీర్‌కుమార్‌పైనా కేసులు నమోదు చేశారు.

Updated Date - Aug 31 , 2024 | 03:44 AM