Share News

Transfers: హైకోర్టులో ఊరట లభించకపోతే నేడు ఏపీకి ఆ ఐదుగురు!?

ABN , Publish Date - Oct 16 , 2024 | 04:04 AM

రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు తప్పవా? అంటే.. తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి.

Transfers: హైకోర్టులో ఊరట లభించకపోతే నేడు ఏపీకి ఆ ఐదుగురు!?

  • ఖాళీ కానున్న కీలక స్థానాలు

  • మరోసారి ఐఏఎ్‌సల బదిలీలు!

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు తప్పవా? అంటే.. తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. క్యాడర్‌ వివాదంలో ఐదుగురు ఐఏఎ్‌సలు గురువారం ఏపీలో రిపోర్ట్‌ చేయాల్సిందేనని క్యాట్‌ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పుపై బుధవారం అధికారులు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్లు వేయాలని నిర్ణయించారు. హైకోర్టులో వారికి ఊరట లభించకపోతే తప్పనిసరిగా ఏపీకి వెళ్లిపోవాల్సిందే. అప్పుడు రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది.


కొన్ని కీలకమైన పోస్టులను తప్పకుండా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఐఏఎ్‌సలు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్‌, రోనాల్డ్‌ రోస్‌ సోమవారం క్యాట్‌ను ఆశ్రయించారు. ఏ రాష్ట్ర క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారులు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనంటూ మంగళవారం క్యాట్‌ తేల్చి చెప్పింది. ముందు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని, తర్వాత తుది విచారణ చేపడతామని తెలిపింది. ఈ క్రమంలో హైకోర్టులో బుధవారం అనుకూలంగా తీర్పు వస్తే వారంతా ఇక్కడే ఉంటారు. లేకపోతే తెలంగాణను వీడాల్సిందే. మంగళవారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రిలీవింగ్‌ ఉత్తర్వులూ జారీ చేయలేదు. ఈ ఐఏఎ్‌సలు ఏపీకి వెళ్లిపోతే.. కీలక పోస్టులు ఖాళీ కానున్నాయి.


ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి కాట వెళ్లిపోతే.. ఆ పోస్టులో సీనియర్‌ ఐఏఎ్‌సను నియమించాల్సి ఉంటుంది. విద్యుత్తు శాఖ కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్‌ రోస్‌ పోస్టు కూడా ఖాళీ కానుంది. ఇందులో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని నియమించే అవకాశాలున్నాయని సమాచారం. ఇలాంటి కీలక పోస్టులను భర్తీ చేయాలంటే ప్రభుత్వం మరోసారి బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది.

Updated Date - Oct 16 , 2024 | 04:04 AM