Share News

Patancheru: వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి..

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:49 AM

రాష్ట్రంలో వీధి కుక్కలు చిన్న పిల్లలను కరిచి చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.

Patancheru: వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి..

  • మరో ఘటనలో 7 నెలల పాపకు తీవ్ర గాయాలు.. పటాన్‌చెరు మండలంలోనే ఈ రెండు ఘటనలు

  • చనిపోయిన బాలుడు బిహార్‌ వలస కూలీల కొడుకు

పటాన్‌చెరు, జూన్‌ 28: రాష్ట్రంలో వీధి కుక్కలు చిన్న పిల్లలను కరిచి చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. పటాన్‌చెరు మండలంలో ఇస్నాపూర్‌ నుంచి నందిగామ గ్రామానికి వెళ్లే దారిలో మహీధర వెంచర్స్‌లో కూలీలుగా పనిచేస్తున్న బిహార్‌ దంపతులకు విశాల్‌(8) అనే కుమారుడు ఉన్నాడు. విశాల్‌ శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో వారి గుడిసె నుంచి కొద్ది దూరంలో బహిర్భూమికి వెళ్లాడు. అక్కడికి గుంపుగా వచ్చిన వీధి కుక్కలు విశాల్‌పై దాడి చేశాయి. బాలుడిని పీక్కు తినడానికి ప్రయత్నించాయి.


దీంతో, విశాల్‌కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత కొంత సేపటికి అటుగా వెళ్తున్న వారు కుక్కలను, బాలుడిని గమనించి వాటిని వెళ్లగొట్టారు. విషయం తెలుసుకున్న పటాన్‌చెరు పోలీసులు, పంచాయతీ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, పటాన్‌చెరు మండలంలోనే మత్తంగి గ్రామంలో గుడిసె ముందు నిద్రిస్తున్న ఏడు నెలల చిన్నారి స్వాతిపై వీధి కుక్కలు దాడి చేశాయి. మత్తంగిలో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్న స్వాతి తల్లిదండ్రులు ఆమెను గుడిసె ముందు పడుకోబెట్టి పక్కనే పని చేసుకుంటున్నారు.


ఇంతలో అక్కడికి వచ్చిన వీధి కుక్కలు స్వాతిని లాక్కెళ్లేందుకు ప్రయత్నించాయి. చిన్నారి ఏడుపులు విని తల్లిదండ్రులు పరుగెత్తుకురావడంతో పారిపోయాయి. కుక్కల దాడిలో తీవ్రగాయాల పాలైన స్వాతిని హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. వీధి కుక్కల బెడదఎక్కువగా ఉన్న చోట్ల చిన్నారులను ఒంటరిగా వదిలేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నిర్మాణ సంస్థల వద్ద పనిచేసే కూలీలు చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 03:49 AM