Share News

Revanth Reddy: ఢిల్లీ ఫర్యటనలో రేవంత్.. టీపీసీసీ చీఫ్ ఆయనకేనా?

ABN , Publish Date - Aug 23 , 2024 | 09:19 AM

తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)’ నియామకం నేడు, రేపు అంటూ చాలా కాలంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసిందని.. ఇక ప్రకటనే తరువాయి అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది

Revanth Reddy: ఢిల్లీ ఫర్యటనలో రేవంత్.. టీపీసీసీ చీఫ్ ఆయనకేనా?

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)’ నియామకం నేడు, రేపు అంటూ చాలా కాలంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసిందని.. ఇక ప్రకటనే తరువాయి అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది ఎందుకో ఆ వ్యవహారమే ఓ కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో అయినా పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందో లేదో చూడాలి. నేడు కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్‌ భేటీ కానున్నారు. ముఖ్యంగా ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో నేడు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్, మంత్రి వర్గ విస్తరణ, ఏఐసీసీలో తెలంగాణ నేతల ప్రాతినిధ్యం తదితర అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్టు సమాచారం.


మరోవైపు.. శుక్రవారం తెల్లవారుజామునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు. ఇక అధిష్టానంతో భేటీలో రేవంత్, భట్టిలతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపా దాస్ మున్సీ సైతం పాల్గొనే అవకాశం ఉంది. ఉత్తమ్, మున్సీలు గురువారం రేవంత్‌తో పాటే ఢిల్లీకి వెళ్లారు. సోనియా, రాహుల్ తెలంగాణ టూర్ పై సైతం ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. తాజాగా మంత్రి మండలిలోకి మరో నలుగురిని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్‌, సుదర్శన్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్‌, రామచంద్రనాయక్‌ తదితరులున్నారు.


పీసీసీ చీఫ్ రేసులోకి కొత్త పేర్లు

సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్.. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కీ పీసీసీ చీఫ్ రేసులోకి వచ్చారు. మరి వీరిలో ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి. దాదాపుగా నేడు అధిష్టానం ఖరారు చేస్తుందని అంతా భావిస్తున్నారు.

Updated Date - Aug 23 , 2024 | 09:19 AM