Jagga Reddy: దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు
ABN , Publish Date - Nov 15 , 2024 | 04:22 AM
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అధికారులపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.
అప్పట్లో నేను, రేవంత్ కలిసి నీ ప్రగతిభవన్ గేట్‌నే తన్నినం.. మేం ఇప్పుడు అధికారపక్షం.. కేటీఆర్, హరీశ్ ఆలోచించుకోండి
మీ హయాంలో భూసేకరణకు ఒక్క గ్రామసభ నిర్వహించారా?
వందల గ్రామాల్లో రైతులపై దాడులు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సది
కాంగ్రెస్ ప్రభుత్వంపై వారి కుట్రలు, కుతంత్రాలను తిప్పికొడతాం
మా పాలన ఎలా ఉందో మహిళలను అడుగుదాం.. సిద్ధమేనా?
ప్రజలకిచ్చిన హామీలను సీఎం, మంత్రులు అమలు చేస్తున్నారు
మా సోషల్ మీడియా స్లో.. చేసినవీ చెప్పుకోలేకపోతున్నాం
కేటీఆర్ నాజూకు లీడర్.. రేవంత్‌ను తట్టుకోలేకపోతున్నారు
డిప్రెషన్‌లో ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు: జగ్గారెడ్డి
హైదరాబాద్, నవంబర్ 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అధికారులపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులను సోషల్ మీడియా ద్వారా వక్రీకరించి చూపిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులను పోలీసులతో కొట్టించి మల్లన్నసాగర్ కోసం భూములను గుంజుకోలేదా? అప్పుడే మరిచిపోయారా? అని ప్రశ్నించారు. వేములఘాట్ దగ్గర రైతులను కొట్టించింది మీరు కాదా? భూములు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తానని ఎర్రబెల్లి బెదించలేదా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏనాడైనా గ్రామసభ పెట్టారా? ప్రగతి భవన్, ఇందిరా పార్కుకు వచ్చిన రైతులతోపాటు వందలాది గ్రామాల్లో అన్నదాతల నడ్డి విరగొట్టిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదని మండిపడ్డారు. అధికారం పోయేసరికి బీఆర్‌ఎస్ నేతలు రాబందుల్లా ప్రజలపై పడ్డారని అన్నారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో ఒక్క రైతునైనా కొట్టామా? లగచర్లలో రైతులపై ఎక్కడ దాడి జరిగిందో చెప్పాలని, ఫొటోలుంటే చూపించాలని సవాల్ విసిరారు.
కొందరు బీఆర్‌ఎస్ నేతలే ఉద్దేశపూర్వకంగా కలెక్టర్‌పై దాడి చేశారని, ఘటనకు బాధ్యుడిగా కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. భూములను గుంజుకోవడం కాంగ్రెస్ సర్కారు పాలసీ కాదని, గ్రామ సభల ద్వారా అందరి ఆమోదం తీసుకోవాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న తమపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని, గతంలో బీజేపీతో కలిసి రేవంత్‌ను దించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇలాంటి కుట్రలను ఎలా ఎదుర్కోవాలో తమకూ తెలుసన్నారు. బీఆర్‌ఎస్ దొంగల ముఠా సోషల్ మీడియా ద్వారా తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందని ధ్వజమెత్తారు. తమ సోషల్ మీడియా కొంచెం నెమ్మదిగా ఉందని, చేసిన పనులను సైతం చెప్పుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ‘‘ఒక్క ఫ్యాక్టరీ కోసం ఇంత చేస్తామా? సీఎం రేవంత్‌రెడ్డికి 20ఎకరాలు దొరకడం పెద్ద కష్టమా? ఎవరికి చెప్పినా 50ఎకరాలు ఇస్తారు. కేసీఆర్ చేసిన అప్పులు చూేస్త మాకు నిద్ర పట్టడం లేదు. కేటీఆర్ నాజూకు లీడర్...రేవంత్ రెడ్డి అటాకింగ్‌కు తట్టుకోలేక పోతున్నారు.
డిప్రెషన్‌లో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు’’ అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తీరు చూస్తుంటే.. రుణమాఫీ చేయడం, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం ఇష్టం లేనట్టుందని అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్, హరీశ్.. అందరం కలిసి బస్సు ఎక్కి మహిళలతో మాట్లాడుదాం. లక్ష రుణ మాఫీ అయిన రైతుల ఇంటికి వెళ్దాం. సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలుద్దాం.. మా పాలన ఎలా ఉందని అడుగుదాం. వారు చెప్పే సమాధానాలు వినేందుకు సిద్ధమేనా? లేదంటే మహిళా ప్రయాణికులనే మీ ఇంటికి తీసుకొస్తాం..మీరు రెడీనా?’’ అని సవాల్ విసిరారు. తమ కార్యకర్తలతోపాటు తామంతా సీఎం రేవంత్‌రెడ్డికి అండగా ఉంటామన్నారు. తాను, విపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్... గతంలో పోలీస్ నిర్బంధంలో ఉన్న ప్రగతి భవన్ గేట్‌నే తన్నామని గుర్తుచేశారు. ఇప్పుడు తాము అధికారపక్షంలో ఉన్నామన్న విషయాన్ని కేటీఆర్, హరీశ్ గుర్తుంచుకోవాలన్నారు.