Share News

తొమ్మిది కాలేజీల్లో ఈవెనింగ్‌ బీటెక్‌

ABN , Publish Date - Oct 23 , 2024 | 03:54 AM

ఉద్యోగాలు చేసేవారి(వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌) కోసం సాయంత్రం వేళ బీటెక్‌ కోర్సులు నిర్వహించేందుకు తొమ్మిది ఇంజనీరింగ్‌ కళాశాలలకు జేఎన్‌టీయూ అనుమతినిచ్చింది.

తొమ్మిది కాలేజీల్లో ఈవెనింగ్‌ బీటెక్‌

  • పలు కోర్సులకు జేఎన్‌టీయూ అనుమతి

  • 660 సీట్ల భర్తీకి సెంట్రలైజ్డ్‌ స్పాట్‌ అడ్మిషన్లు

  • త్వరగా చేపట్టాలని రిజిస్ట్రార్‌ ఆదేశాలు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు చేసేవారి(వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌) కోసం సాయంత్రం వేళ బీటెక్‌ కోర్సులు నిర్వహించేందుకు తొమ్మిది ఇంజనీరింగ్‌ కళాశాలలకు జేఎన్‌టీయూ అనుమతినిచ్చింది. ఆ కోర్సులకు సంబంధించి త్వరితగతిన ప్రవేశాల ప్రక్రియలను చేపట్టాలని అడ్మిషన్ల విభాగం డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ కె.వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీచేశారు. ఈవెనింగ్‌ బీటెక్‌కు ఆయా కళాశాలల్లో పలు కోర్సుల్లో మొత్తం 660 సీట్ల భర్తీకై జేఎన్‌టీయూ అడ్మిషన్ల విభాగంలో సెంట్రలైజ్డ్‌ స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆయా కళాశాలలకు ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్‌ ఫీజులనే ఈవెనింగ్‌ బీటెక్‌ కోర్సులకు కూడా వర్తింపజేశారు. ఈ కోర్సులో ప్రవేశాలకు ఈసెట్‌ ద్వారా లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు వర్తించే అర్హతా నిబంధనలే వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు.

  • ఒక సెమిస్టర్‌ అదనం:

ఈవెనింగ్‌ బీటెక్‌లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు కనీసం ఏడాది పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన పరిశ్రమలు లేదా విద్యా సంస్థల్లో పనిచేసి ఉండాలి. అలాగే తాము పనిచేస్తున్న సంస్థ నుంచి 75 కిలోమీటర్ల పరిఽధిలోనే కళాశాలను ఎంచుకోవాలి. లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు బీటెక్‌ కోర్సు మూడేళ్లు కాగా, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఒక సెమిస్టర్‌ అదనంగా కోర్సు మూడున్నరేళ్లు పడుతుంది. రెగ్యులర్‌ విద్యార్థులకు మాదిరిగానే వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కూడా అన్ని తరగతులు, ప్రయోగాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయా కళాశాలల్లో ఏదైనా కోర్సుకు కేటాయించిన సీట్లలో మూడోవంతు సీట్లు భర్తీ అయితేనే కోర్సును ప్రారంభించాలని అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - Oct 23 , 2024 | 03:54 AM