Kaleshwaram Project: ఆ ఇద్దరి విచారణ డిసెంబరులో!
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:19 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గత ప్రభుత్వంలోని ఇద్దరు ప్రజాప్రతినిధులను విచారణకు పిలవాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తోంది.
గత ప్రభుత్వంలో కీలక ప్రజాప్రతినిధులను విచారించనున్న కాళేశ్వరం కమిషన్
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గత ప్రభుత్వంలోని ఇద్దరు ప్రజాప్రతినిధులను విచారణకు పిలవాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తోంది. అక్టోబరు 31తో కమిషన్ గడువు ముగిసింది. కమిషన్ గడువును రెండు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం గడువు పొడిగిస్తే.. కమిషన్ ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ పునఃప్రారంభించనుంది. ఇప్పటికే కమిషన్ నీటిపారుదల శాఖలోని కీలక అధికారుల విచారణను పూర్తిచేసింది. ఈ నెల 12 నుంచి తాజా, మాజీ ఐఏఎ్‌సలను విచారణకు పిలవనుంది. సీఎం కేసీఆర్ మాజీ కార్యదర్శి స్మితాసభర్వాల్, మాజీ సీఎ్‌సలు సోమేశ్‌కుమార్, ఎస్‌కే జోషిలతో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక సీఎస్ రజత్‌కుమార్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాలున్నాయి.
ఇప్పటికే విచారణలో పలు సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్లు బయటికి వచ్చాయి. దీంతో నవంబరులో ఐఏఎ్‌సలను, డిసెంబరులో గత ప్రభుత్వంలోని ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. విద్యుత్తుపై జస్టిస్ మదన్ లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో.. ఆ ప్రభావం పరోక్షంగా కాళేశ్వరం కమిషన్‌పైనా పడింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సాక్షులు, అధికారులను విచారిస్తూ ఆధారాలు రాబట్టే పనిలో ఉంది. ఓ వైపు విచారణ చేస్తూనే.. మరోవైపు నివేదికను రూపొందిస్తోంది. త్వరలోనే కమిషన్ గడువు పొడిగింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి.