Share News

రైస్‌మిల్లర్ల బాటలోనే కాంట్రాక్టర్లు..

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:00 AM

రైస్‌మిల్లర్ల బాటలోనే ధాన్యం కాంట్రాక్టర్లు నడుస్తున్నట్లు కనబడుతున్నది. ప్రభుత్వం సీఎంఆర్‌ కింద రైస్‌మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్‌ చేసి బియ్యం ఇవ్వకపోవడంతో, నష్టం వస్తుందని తెలిసినా కూడా ఆ ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించేందుకు టెండర్లు పిలిచింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రెండు మాసాల్లో ధాన్యాన్ని మిల్లుల నుంచి తీసుకవెళ్లి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఆరు మాసాలైనా కూడా జిల్లాలోగల రైస్‌ మిల్లుల నుంచి ధాన్యాన్ని తీసుకవెళ్లడం లేదు.

రైస్‌మిల్లర్ల బాటలోనే కాంట్రాక్టర్లు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రైస్‌మిల్లర్ల బాటలోనే ధాన్యం కాంట్రాక్టర్లు నడుస్తున్నట్లు కనబడుతున్నది. ప్రభుత్వం సీఎంఆర్‌ కింద రైస్‌మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్‌ చేసి బియ్యం ఇవ్వకపోవడంతో, నష్టం వస్తుందని తెలిసినా కూడా ఆ ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించేందుకు టెండర్లు పిలిచింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రెండు మాసాల్లో ధాన్యాన్ని మిల్లుల నుంచి తీసుకవెళ్లి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఆరు మాసాలైనా కూడా జిల్లాలోగల రైస్‌ మిల్లుల నుంచి ధాన్యాన్ని తీసుకవెళ్లడం లేదు. గడిచిన ఆరు మాసాల్లో 2,03,402 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి, 93,286 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నే తరలించారు. సగం ధాన్యాన్ని కూడా తరలించకపోవడం విచారకరం. దీంతో ప్రభుత్వం మరింత ఆర్థిక భారం పడుతున్నది. తెచ్చిన అప్పులపై వడ్డీలు చెల్లించలేక సతమతం అవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి యాసంగిలో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైస్‌ మిల్లులకు అందజేసింది. ఆ ధాన్యాన్ని 2023 అక్టోబర్‌ నాటికే ఎఫ్‌సీఐకి, పౌరసరఫరాల శాఖకు బియ్యం ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. అదే ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాసంగిలో సీఎంఆర్‌ కింద మిల్లర్లు పొందిన ధాన్యంలో సగానికి పైగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారు. పట్టించిన బియ్యాన్ని తమిళనాడు రాష్ట్రానికి క్వింటాలుకు 3120 రూపాయలకు తరలించారు. సీఎంఆర్‌ కింద బియ్యం ఇచ్చేందుకు బయట మార్కెట్‌లో కొందరు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి నిల్వచేశారు. మిల్లింగ్‌ చేయడంలో జాప్యం చేస్తుండడంతో నష్టం వచ్చినా మంచిదేనని భావించిన ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించేందుకు జనవరి మాసంలో టెండర్లు పిలించింది. అందులో భాగంగా జిల్లాలోని 133 రైస్‌మిల్లుల నుంచి 2,03,402 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తరలించుకవెళ్లేందుకు పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారు. మార్చిలో ఒప్పందాలు పూర్తి కాగా, మే నెలాఖరు వరకు మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్‌ చేయాలని షరతులు విధించారు. క్వింటాలు ధాన్యాన్ని ప్రభుత్వం 2007 రూపాయలకు కట్టబెట్టింది. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ధాన్యాన్ని తరలించేందుకు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ కొన్ని మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేవు.

ఫ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తే..

పెద్దపల్లి, సుల్తానాబాద్‌,, మంథని ప్రాంతానికి కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని బియ్యంగా మర ఆడించి 15 నుంచి 17 రేకుల వరకు రైల్వే వ్యాగన్ల ద్వారా డిసెంబర్‌, జనవరి మాసాల్లో తమిళనాడు రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం. ధాన్యానికి బదులు క్వింటాలుకు 2,223 రూపాయల డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్లు నిర్ణయించారు. కొందరు మిల్లర్లు ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వగా, మరికొందరు గడిచిన యాసంగి సీజన్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ చేశారు. ఆ మేరకు కొందరు మిల్లర్లు ధాన్యంకు బదులు డబ్బులు చెల్లించి ప్రభుత్వ బాకీ తీర్చుకున్నారు. కానీ అలాంటి వారిపై ఎలాంటి చర్యలు లేవు. టెండర్‌ ధాన్యంలో ఇప్పటివరకు 93,286 మెట్రిక్‌ టన్నులు మాత్రమే తరలించుకు పోయినట్లు అధికారులు చెబుతున్నారు. టెండర్‌ ఒప్పందం ప్రకారం మే నెలాఖరు లోపు ధాన్యాన్ని తరలించాలి. జాప్యం జరగడంతో మరో రెండు మాసాల గడువు ఇచ్చింది. అప్పటివరకు కూడా ధాన్యం కదల లేదు. మళ్లీ మూడు మాసాల పాటు అక్టోబర్‌ నెలాఖరు వరకు గడువు పెంచింది. అసలు మిల్లుల్లో ధాన్యం ఉందా, లేదా, కాంట్రాక్టర్లు కావాలనే మిల్లుల నుంచి ధాన్యాన్ని తరలించడం లేదా అని ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. కానీ ఆ పని జరుగుతున్నట్లు కనబడడం లేదు. ఆ సీజన్‌ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి బియ్యం ఇచ్చేందుకు, ఎఫ్‌సీఐ డబ్బులను విడుదల చేసేందుకు ఆలస్యం అవుతుందని, అప్పటి వరకు తెచ్చిన అప్పులపై వడ్డీల భారం పడుతుందని భావించిన ప్రభుత్వం ధాన్యాన్ని టెండర్‌ వేసింది. రెండు మాసాల్లోనే డబ్బులు వస్తాయని అంచనా వేసినప్పటికీ, రైస్‌మిల్లర్ల బాటలోనే ధాన్యం కాంట్రాక్టర్లు నడుస్తుండడంతో ప్రభుత్వంపై మరింత నష్టం పడే అవకాశాలు లేకపోలేదు. ఈ ధాన్యం గురించి ఏఏ రైస్‌ మిల్లు నుంచి ఎంత ధాన్యాన్ని తరలించారు, ఆ మిల్లులో ఇంకా ఎంత ధాన్యం ఉండాలి, అసలు ఆ ధాన్యం ఉందా లేదా అని పౌరసరఫరాల శాఖాధికారులు మిల్లులను తనిఖీ చేస్తేనే గానీ బండారం బయటపడే అవకాశాలు లేవు.

Updated Date - Oct 02 , 2024 | 01:01 AM