Share News

అభయ హస్తం లబ్ధిదారుల్లో నిరాశ

ABN , Publish Date - Oct 24 , 2024 | 01:17 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి తాజా కాంగ్రెస్‌ ప్రభుత్వం వరకు అభయహస్తం లబ్ధిదారులకు నిరాశ ఎదురవుతోంది. అభయహస్తం లబ్ధిదారుల ఆందోళనల నేపథ్యంలో గత ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్‌, మెప్మా, అధికారులు సిబ్బందితో అభయ హస్తం సభ్యులకు సంబంధించిన వివరాలను సేకరించింది. అధికారులు బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఎన్నికలు రావడంతో వస్తాయనుకున్న డబ్బులు నిరాశ పర్చాయి. ప్రభుత్వం మారిపోయింది.

అభయ హస్తం లబ్ధిదారుల్లో నిరాశ

- జిల్లాలో 60,881 మంది

- వాటాధనం రూ.4.82 కోట్లు

- రూ.8 కోట్లపైగా పింఛన్‌ బకాయిలు

- ఉద్యమానికి ప్రజా సంఘాల కార్యాచరణ

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి తాజా కాంగ్రెస్‌ ప్రభుత్వం వరకు అభయహస్తం లబ్ధిదారులకు నిరాశ ఎదురవుతోంది. అభయహస్తం లబ్ధిదారుల ఆందోళనల నేపథ్యంలో గత ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్‌, మెప్మా, అధికారులు సిబ్బందితో అభయ హస్తం సభ్యులకు సంబంధించిన వివరాలను సేకరించింది. అధికారులు బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఎన్నికలు రావడంతో వస్తాయనుకున్న డబ్బులు నిరాశ పర్చాయి. ప్రభుత్వం మారిపోయింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. కొత్త ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారులకు చేయూతను ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. పది నెలలు గడిచినా నిర్ణయం రాకపోవడంతో జిల్లాలో అభయ హస్తం లబ్ధిదారుల తరఫున ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. మహిళా పొదుపు సంఘాల్లో ఉన్న సభ్యులకు చేయూతను ఇచ్చే దిశగా 2009లో అప్పటి ప్రభుత్వం ఎల్‌ఐసీ అనుసంధానంతో అభయహస్తం పథకాన్ని అందించింది. పథకంలో చేరిన మహిళలకు ఎంతో ఉపయోగకరంగా కనిపించింది. ఆ తరువాత స్వరాష్ట్రంలోనే ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది. కనీసం ప్రీమియం చెల్లించిన లబ్ధిదారులకు డబ్బులు తిరిగి ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే చూపింది. పథకం లేకపోయినా జిల్లాలోని లబ్ధిదారులకు కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. అభయ హస్తంపై 2022 మార్చిలో లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అభయ హస్తం వివరాలు ఇవ్వాలని కోరడంతో లబ్ధిదారుల సేకరించిన సెర్ప్‌ ప్రభుత్వానికి పంపించింది. అభయ హస్తం డబ్బులు వస్తాయని భావించినా దాదాపు రేండేళ్లు గడుస్తున్నాయి. ఇంతవరకు లబ్ధిదారులకు ప్రీమియం డబ్బులుగానీ, బకాయిలుగానీ అందించలేదు.

నిలిచిన పింఛన్‌

ఎనిమిదేళ్లుగా అభయహస్తం ద్వారా అందాల్సిన పింఛన్‌, బీమా, ఉపకారవేతనాలు నిలిచిపోయాయి. ఒక వ్యక్తికి ఒకే పింఛన్‌ నిబంధనతో అభయ హస్తం లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొంద లేకపోయారు. 2017లో అభయ హస్తంలో మార్పులు తీసుకొచ్చి కొత్త పథకాన్ని అందిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. వాటాధనం తిరిగి చెల్లిస్తామని చెప్పినా మళ్లీ పట్టించుకునే వారు కరువయ్యారు. 2009లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభయ హస్తం పథకానికి మంచి స్పందన లభించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పింఛన్లు కూడా వచ్చాయి. జిల్లాలో 60881 మంది అభయ హస్తం లబ్ధిదారులు పథకంలో చేరి వాటాధనాన్ని చెల్లించారు. ఐదేళ్లుగా పింఛన్‌కు కూడా నోచుకోవడం లేదు. జిల్లాలో అభయ హస్తం సభ్యులు బోయిన్‌పల్లి మండలంలో 4909 మంది, చందుర్తి 3176, ఇల్లంతకుంట 5497, గంభీరావుపేట 6067, కోనరావుపేట 5860, ముస్తాబాద్‌ 6439, రుద్రంగి 2104, సిరిసిల్ల మున్సిపల్‌ 7268 మంది, తంగళ్లపల్లి 3780, వీర్నపల్లి 1520, వేములవాడ మున్సిపల్‌ 83, వేములవాడ 5532, వేములవాడ రూరల్‌ 3321, ఎల్లారెడ్డిపేటలో 5325 మంది ఉన్నారు. వీరందరూ రోజుకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి రూ.365 జమ చేయించారు. జమ చేసిన సభ్యుల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి రూ.500 చొప్పున పింఛన్‌ అందించే వారు. సభ్యురాలికి బీమా సౌకర్యం కల్పించారు. సహజంగా మరణిస్తే రూ.30 వేలు, ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం పొందిన రూ.75 వేలు, పాక్షికంగా దివ్యాంగులైతే రూ.37,500 చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పింఛన్‌ రావాల్సిన వారికి బకాయిలు రూ.8 కోట్ల వరకు ఉన్నాయి. పింఛన్‌ బకాయిలతోపాటు ఇన్సూరెన్స్‌ అందడం లేదు. అభయ హస్తం లబ్ధిదారులు పథకాన్ని పునరుద్ధరించడమో, లేదా వాటధనాన్ని వడ్దీతో సహా చెల్లించడమో చేయాలని కోరుతున్నారు.

జిల్లాలో లబ్ధిదారుల వాటాధనం రూ.4.82 కోట్లు

జిల్లాలో అభయ హస్తం పథకంలో 60,881 మంది సభ్యులు చేరారు. ప్రతీ సంవత్సరం రూ.365 చప్పున రూ .4.82 కోట్లు వాటాధనం కింద జమ చేశారు. సభ్యుల్లో 60 సంవత్సరాలు దాటిన వారు పింఛన్‌కు అర్హత పొందారు. 2015-2016 వరకు పింఛన్‌ అర్హత పొందినవారు 3969 మంది ఉన్నారు. పథకంలోని 60 సంవత్సరాల లబ్ధిదారులకు 2015 డిసెంబరు వరకు పింఛన్‌, సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు సక్రమంగానే అందాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2017 జనవరిలో మాత్రమే పింఛన్‌ వచ్చింది. ఇప్పటికి దాదాపు అరేళ్లుగా పింఛన్‌ రావడంలేదు. ప్రభుత్వం ఈ పథకాన్ని తొలగించినట్లు చెప్పకుండానే వెబ్‌సైట్‌ను మూసివేసింది.

Updated Date - Oct 24 , 2024 | 01:17 AM