Share News

రైతులు ఆందోళన చెందవద్దు

ABN , Publish Date - May 09 , 2024 | 12:30 AM

అకాల వర్షాల వలన జిల్లా లోని ఆయా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం కొనుగోలు గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెంద వద్దని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు.

రైతులు ఆందోళన చెందవద్దు

సుల్తానాబాద్‌, మే 8: అకాల వర్షాల వలన జిల్లా లోని ఆయా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం కొనుగోలు గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెంద వద్దని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. సుల్తానాబాద్‌ సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన సుల్తానాబాద్‌, సుగ్లాంపల్లి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. మంగళవారం అకాల వర్షాల వలన ఆయా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఆర బెట్టించాలని, వాటిని ఎలాంటి కొర్రీలు లేకుండా కొను గోలు చేస్తామన్నారు. ఈ మేరకు తాము రైస్‌ మిల్లర్లతో మాట్లాడుతామని, రైతులను ఎవరూ ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. తడిసిన ధాన్యంను ఈ ఎండలకు ఆరబెట్టి వాటిని మిల్లర్లకు పంపించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.

కొనుగోళ్లను వేగవంతం చేయాలి..

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ ఆదేశించారు. వాతావరణంలో ఆకస్మికంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్నందున వెంటవెంటనే కొనుగోళ్లు చేయాలని, వాటిని కూడా వెంటవెంటనే సమీప మిల్లర్లకు పంపించాలని అన్నారు. వర్షాల మూలంగా కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం కుప్పలు తడవకుండా అందుబాటులో కవర్లను సిద్ధంగా ఉంచాలని సూచిం చారు. ఆయన వెంట పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ శ్రీకాం త్‌రెడ్డి, ఆర్‌ఐ శంకర్‌, సొసైటీ సీఈవో బూరుగు సంతోష్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:31 AM