Karimnagar: కరీంనగర్ సిటిజన్ కాలనీలో మౌలిక వసతుల లేమి.. స్థానికులకు నరకయాతన
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:29 PM
కరీంనగర్ నగరంలో ఉన్న సిటిజన్ కాలనీ వాసులు తాము రోడ్లు, మురుగు దొడ్లు, త్రాగు నీటి వసతి మొదలగు కనీస మౌలిక సదుపాయాలు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎటుర్కొంటున్నామని, నాయకుల ముందు వాపోయారు. వర్షకాలంలో తమ ఊరు దుబాయితో సమాన దూరం ఉందని వ్యాఖ్య
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: బొగ్గుబాయి, దుబాయి, బొంబాయి తెలంగాణ బ్రతుకులకు ప్రతీక! దీనికి తగినట్లుగా ఆయా ప్రాంతాలలో జీవితాంతం పని చేసి సంపాదించిన డబ్బుతో ఇళ్ళు నిర్మించుకొని ఉండాలనుకొని ఆశపడి వచ్చిన తాము కనీస మౌలిక వసతులు లేక నరకయాతన ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు ఆ కాలనీల వాసులు (NRI).
Kamala Harris: నేను ఈ స్థితిలో ఉన్నానంటే అమ్మే కారణం: కమలా హ్యారిస్
కరీంనగర్ నగరంలో ఉన్న సిటిజన్ కాలనీ వాసులు తాము రోడ్లు, మురుగు దొడ్లు, త్రాగు నీటి వసతి మొదలగు కనీస మౌలిక సదుపాయాలు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎటుర్కొంటున్నామని నాయకుల ముందు వాపోయారు. సింగరేణి ఉద్యోగులు, గల్ఫ్ ప్రవాసీయులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా ఈ కాలనీలో నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి సిటిజన్ కాలనీ రోడ్డు నెంబర్ రెండు పై సిటిజన్ కాలనీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కాలనీ వాసులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దుబాయి నుండి హైదరాబాద్‌కు మూడున్నర గంటలలో వచ్చే తమకు,
తమ ఇళ్ళలో అత్యవసర స్థితులలో వర్షకాలంలో అంబులెన్సు రావాడానికి గంటన్నరకు పైగా సమయం పడుతుందని కాలనీ వాసులు వాపోయారు. ఇటీవల ఒక భవన నిర్మాణం సందర్భంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఒకరు గాయపడితే అంబులెన్స్ రావడానికి రోడ్లు లేని కారణంగా వర్షపు నీరు ఆగడంతో గంటన్నరకు పైగా సమయం పట్టిందని సిటిజన్ కాలనీ వెల్ఫేర్ కమీటి అధ్యక్షుడు మొహమ్మద్ ఫేరోజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా, ప్రధాన రహదారికి చేరుకునే వరకు కాలనీకి చెందిన ఒక మహిళకు గర్భస్రావం జరిగిన విషయాన్ని కూడా కమిటీ నాయకుడు మొహమ్మద్ అతీఫ్ ప్రస్తావించారు.
Diwali: అమెరికాలోని నెబ్రాస్కా గవర్నర్ నివాసంలో దీపావళి సంబరాలు
భౌతికంగా కరీంనగర్ నగరంలో ఉన్నప్పటికీ సాంకేతికంగా తమను బొమ్మకల్ గ్రామ పంచాయితీ పరిధి వాసులుగా పేర్కొంటూ కనీస సదుపాయాలను సైతం దూరం చేస్తున్నారని కాలనీ వాసులు కార్యక్రమంలో ఫిర్యాదు చేసారు.
సిటిజన్ కాలనీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, తమ పరధిలో వీలయినంత వరకు అన్ని రకాల సదుపాయాలను సమకూర్చామని కరీంనగర్ శాసన సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, బొమ్మకల్ మాజీ సర్పంచి అయిన పురుమల్ల శ్రీనివాస్ పేర్కొంటూ వీలయినంత త్వరగా కాలనీలో రోడ్ల నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.
కాలనీలో కీలకమైన రోడ్డు నెంబర్ 2 రోడ్డు నిర్మాణానికి, కూడలిలో ప్రత్యేక లైట్ల ఏర్పాటుకు తాను కృషి చేస్తానని నరేందర్ రెడ్డి హామినిచ్చారు.
యువకులు, విద్యాధికులు అధిక్యతగా ఉన్న సిటిజన్ కాలనీ వెల్ఫేర్ కమిటీ ఈ ప్రాంతాభివృద్ధి కోసం కులమత, రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తుందని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన విందు కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు పలువురు ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మజ్లీస్ పార్టీ నగర అధ్యక్షుడు అహ్మద్ తదితరులు పాల్గొన్నట్లుగా నిర్వహకులు తెలిపారు.