Share News

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:00 AM

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

- అద్భుతంగా ఉందన్న కాంగ్రెస్‌

- ప్రజావ్యతిరేక బడ్జెట్‌ అంటున్న ప్రతిపక్షాలు

- వ్యవసాయానికి అత్యధిక కేటాయింపులతో రైతుల్లో సంతోషం

- పంటల బీమా, వరి బోనస్‌, రైతు కూలీలకు రూ.12వేలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంక్షేమం, వ్యవసాయరంగంతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి బాటలు వేసేదిగా ఈ బడ్జెట్‌ను అభివర్ణిఇంచింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్షాలు ముందు చూపులేని ప్రజావ్యతిరేక బడ్జెట్‌గా పేర్కొన్నాయి. 2,91,159 కోట్లతో కూడిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను గురువారం ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి డి శ్రీధర్‌బాబు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించి పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. రైతు రుణమాఫీకి మరో 31వేల కోట్లను కేటాయించడంతో త్వరలోనే రెండు లక్షల రూపాయల వరకు తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 32 రకాల సన్నవరి రకాలను సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ను ఇచ్చేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. జిల్లాలో సన్నవరి రకాల సాగు పెరుగనున్నదని అంచనా వేస్తున్నారు. రైతు కూలీలకు యేటా 12వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఈ పథకంతో జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న రైతుకూలీలకు ఆర్థిక సహాయం అందనున్నది. రైతులకు పంటల బీమా అమలు చేయడానికి ప్రధానమంత్రి ఫసల్‌ బీయా యోజనలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వివిధ పంటలకు బీమా లభించనున్నది. ననియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున జిల్లాకు 15,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేసి స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల రూపాయల బీమాను అందించడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. దీంతో జిల్లాలోని 13,712 స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,48,973 మంది మహిళలకు ప్రయోజనం చేకూరనున్నది. 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందించే పథకానికి బడ్జెట్‌లో 723 కోట్లు కేటాయించారు. జిల్లాలో 3,12,206 గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా వీరిలో 60 శాతం మందికి ఈ ప్రయోజనం చేకూరనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత విద్యుత్‌ పథకం కింద 200 యూనిట్ల వరకు జీరో బిల్లు అమలు చేసేందుకు 2,418 కోట్లు కేటాయించడాన్ని అల్పాదాయవర్గాలు అభినందిస్తున్నాయి. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీని ఆ పార్టీ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆసరా పింఛన్లను నాలుగు వేల రూపాయలకు, దివ్యాంగుల పింఛన్లనునుంచి 6వేలకు పెంచే ప్రతిపాదన ప్రస్తావనే లేకపోవడంపై విపక్షాలు తప్పుబడుతున్నాయి. అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్‌ జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించక పోవడాన్ని, ఆరు గ్యారెంటీల పథకాన్ని అమలు చేయక పోవడాన్ని కూడా బీఆర్‌ఎస్‌, బీజేపీ విమర్శిస్తున్నాయి.

ఫ కేంద్రం వంచించినా.. రాష్ట్ర ప్రభుత్వం కరుణించింది

- డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరుగగా, రాష్ట్ర బడ్జెట్‌ వల్ల తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూరింది. కేంద్ర బడ్జెట్‌ నిరాశపర్చగా, రాష్ట్ర బడ్జెట్‌ సంతోషం కలిగించింది. అన్నివర్గాల ప్రజల ప్రజలను సంతృప్తి కలిగించేలా ఉంది. వ్యవసాయం, విద్య, మహిళా, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయడం రేవంత్‌రెడ్డి సర్కార్‌ చిత్తశుద్ధికి నిదర్శనం. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఉంది. హార్టికల్చర్‌ కోసం ఈ బడ్జెట్‌లో 737 కోట్లు కేటాయించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడమే కాకుండా నాణ్యమైన విత్తనాలను అందించేందుకు అవసరమైన చర్యలకు పూనుకోవడం ద్వారా తమ ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చనున్నది. గూడులేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసేలా ఈ బడ్జెట్‌ రూపకల్పన చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలో 4 లక్షల 50 వేల గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం నిరుపేదలకు వరం.

దేశానికే దిక్సూచి తెలంగాణ బడ్జెట్‌ :

- వెలిచాల రాజేందర్‌రావు, కాంగ్రెస్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి

2,91,159 కోట్లతో డిప్యూటీ సీఎం, రెవెన్యూమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ దేశానికే దిక్సూచి. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జనరంజక బడ్జెట్‌ రూపొందించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్‌లో సింహభాగం నిధులు కేటాయించడం అభినందనీయం. అప్పులకుప్పుగా మార్చిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఖరి వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం 42,892 కోట్ల అప్పులకు వడ్డీ చెల్లించింది. గ్రామీణాభివృద్ధిశాఖకు 29,816 కోట్లు, హైదరాబాద్‌ సిటి అభివృద్ధికి పది వేల కోట్లు, బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3003 కోట్లు, గ్యాస్‌ సబ్సిడీ స్కీంకు 723 కోట్లు కేటాయించడం అభినందనీయం.

ఫ విద్యారంగానికి నామమాత్రంగా కేటాయింపులు

- ఎం రఘుశంకర్‌రెడ్డి, డీటీఎఫ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యారంగానికి నామమాత్రంగా కేటాయింపులు చేసింది. విద్యారంగానికి 7.31శాతం నిధులు కేటాయించారు. పాలకులు విద్యారంగాన్ని ప్రాధాన్యంగా గుర్తించడం లేదు. పాఠశాలలు, మౌలిక వసతులు, స్కావెంజర్లు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీని ప్రస్తావించక పోవడం శోచనీయం.

అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం

- కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సుడా చైర్మన్‌

రాష్ట్ర బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించింది. స్త్రీ శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. వ్యవసాయరంగంతోపాటు గ్రామీణాభవృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించారు. గృహజ్యోతి, గ్యాస్‌ సబ్సిడీకి నిధులు కేటాయించారు. అన్ని వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా బడ్జెట్‌ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలనకు ఈ బడ్జెట్‌ నిదర్శనం.

ప్రగతి నిరోధక బడ్జెట్‌

- పి సుగుణాకర్‌రావు, బీజేపీ నాయకుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాబడి, ఖర్చుల లెక్క పత్రంలా ఉంది. కేటాయింపులు చెప్పడం మినహా లక్ష్యంలేని బడ్జెట్‌. భవిష్యత్‌లో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అనే దానిపై దృష్టిపెట్టని విజన్‌ లేని బడ్జెట్‌. ఎన్నికల హామీలను కూడా తీర్చలేని బడ్జెట్‌. ఎలాంటి విజన్‌ లేని ప్రగతి నిరోధక బడ్జెట్‌ ఇది.

అప్పుల, అబద్ధాల, ప్రజావ్యతిరేక బడ్జెట్‌

- కొట్టె మురళికృష్ణ, బీజేపీ నాయకుడు

బడాయి, అప్పుల, అబద్ధాల, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ ఇది. 62 వేల కోట్ల అప్పులు ఎలా తెస్తారో సమాధానం చెప్పాలి. రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగా తీసుకెళ్తున్నారు. హామీల మేరకు బడ్జెట్‌ ఇవ్వకుండా మోసం చేశారు.అరకొర నిధులతో ప్రాజెక్టులు ఎలా ముందుకు తీసుకెళ్తారు.

ఫ బీసీలను నిరాశపరిచిన బడ్జెట్‌

-నర్సింగోజు శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు, బీసీ యువజన సంఘం

జనాభాలో 56శాతం ఉన్న బీసీలకు 2,92,150 కోట్ల బడ్జెట్‌లో కేవలం 9,200 కోట్లు కేటాయించి బీసీలను నిరాశకు గురి చేశారు. అరకొర నిధులతో బీసీలకు మొండి చేయి చూపించారు. ప్రతిసారి చిన్నచూపు బీసీలను అణచివేసే దోరణిలో ప్రభుత్వాలతీరు ఉంటుంది.

ఫ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన బడ్జెట్‌

- దామెర సత్యం, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి

రాష్ట్ర బడ్జెట్‌ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లింది. ఈ బడ్జెట్‌ ఏ వర్గానికి న్యాయం జరిగేలా లేదు. ఐటీ రంగానికి, పారిశ్రామిక రంగాల మీద పాలసీలు లేవు. రైతు భరోసా మీద అనేక ఆంక్షలు పెట్టింది. రైతులను, కులవృత్తిదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఫ క్రీడారంగానికి పెద్దపీట

- గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో క్రీడారంగానికి పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 325 కోట్లు కేటాయించడం క్రీడారంగ పురోగాభివృద్ధికి తోడ్పడుతుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలో ముందంజలో నిలిచే అవకాశాలున్నాయి.

ఫ విద్యారంగానికి అరకొర నిధులు

- వి రాజిరెడ్డి, డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

బడ్జెట్‌లోఓ విద్యారంగానికి ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడం విచారకరం. బడ్జెట్‌లో విద్యకు 7.31శాతం నిధులు కేటాయించడం తీవ్రనిరాశను కలిగించింది. విద్యకు 20శాతం నిధులు కేటాయించాలని కోరినప్పటికి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు.

ఫ బడ్జెట్‌ను హర్షిస్తున్నాం

- మర్రి వెంకటస్వామి, సీపీఐ జిల్లాకార్యదర్శి

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రైతు రంగానికి పెద్ద పీట వేసి పేదలకు 12 వేలు ఇవ్వడాన్ని హర్షిస్తున్నాం. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరిచే బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది.

ఫ ప్రాధాన్య రంగాలకు అన్యాయం

- మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి

రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధాన్య రంగాలకు అన్యాయం జరిగింది. విద్య, వైద్యం, ఉత్పాదక రంగాలకు బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించారు. 2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించినప్పటికీ జిల్లాకు మొండి చేయి చూపారు. జిల్లాలోని పెండింగ్‌పనులకు నిదులు కేటాయించలేదు.

ఫ విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్‌

- కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. 2.91 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి 7.3 శాతం నిధులు కేటాయించారు. ఎన్నికల ముందు విద్యకు బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామి ఇచ్చారు.శాతావాహనయూనవర్సిటీకి 200 కోట్లు ఇస్తారనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు కలిపి 500 కోట్లు ఇవ్వడం సరికాదు.

- భగత్‌నగర్‌

Updated Date - Jul 26 , 2024 | 01:00 AM