Share News

బసంత్‌నగర్‌ విమానాశ్రయంపై ఆశలు పదిలం

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:34 AM

జిల్లాలోని బసంత్‌నగర్‌లో ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయం నిర్మాణంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు పదిలంగా ఉన్నాయి. మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రాష్ట్రంలో వరంగల్‌తో పాటు కొత్తగూడెం, రామగుండం బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

బసంత్‌నగర్‌ విమానాశ్రయంపై   ఆశలు పదిలం
బసంత్‌నగర్‌ మినీ ఎయిర్‌ పోర్టు విమానాశ్రయం రన్‌వే

- మామునూర్‌ ఎయిర్‌ పోర్టు భూసేకరణకు రూ.205 కోట్లు

- సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో విమానాశ్రయంపై చర్చ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని బసంత్‌నగర్‌లో ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయం నిర్మాణంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు పదిలంగా ఉన్నాయి. మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రాష్ట్రంలో వరంగల్‌తో పాటు కొత్తగూడెం, రామగుండం బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా 152 విమనాశ్రయాలను ప్రకటించగా, ఆ జాబితాలో బసంత్‌నగర్‌ విమానాశ్రయం ఊసు లేకపోవడం గమనార్హం. ఇక్కడ సాంకేతికంగా సాధ్యపడదని అప్పటి విమానయాన మంత్రి వీకే సింగ్‌ తేల్చి చెప్పారు. దీంతో ఆరేళ్ల నుంచి ఇక్కడ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలు కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటనతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలోని పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో కేశోరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉన్న విషయం తెలిసిందే. బసంత్‌నగర్‌కు బిర్లా వచ్చిపోయేందుకు ముప్పయేళ్ల క్రితం 90 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకుని మినీ ఎయిర్‌పోర్టును నిర్మించారు. ఈ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్‌గా వినియోగంలో లేకపోయినప్పటికీ, కేవలం బిర్లా యాజమాన్యం మాత్రమే దీనిని సద్వినియోగం చేసుకున్నారు.

ఫ ‘ఉడాన్‌’ పథకంలో..

2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి విమానాశ్రయాలకు తోడు మరిన్ని కొత్తవి ఏర్పాటు చేసేందుకు గాను ‘ఉడాన్‌’ పథకాన్ని తీసుకవచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అన్‌ సర్వీస్డ్‌ విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గత ప్రభుత్వం ఆరింటిని ప్రతిపాదించింది. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌, వరంగల్‌ జిల్లా మాములూరు, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టులను నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులను నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సర్వే నిర్వహించారు. ఇందుకోసం బసంత్‌నగర్‌లో సర్వే నంబర్‌ 363లో 287 ఎకరాలు, 413లో 205 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామ శివారులోని కుర్మపల్లిలో సర్వే నంబర్‌ 301లో 265 ఎకరాల భూమి ఉందని గుర్తించారు. ఇందులో 363లో 152.12 ఎకరాలు, 413లో 59.18 ఎకరాలు, 301లో 119.11 ఎకరాలు, మొత్తం 331.01 ఎకరాల భూమిని విమానాశ్రయ నిర్మాణానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సమ్మతి తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. దీంతో స్థల పరిశీలనకు ఏవియేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన అధికారులు 2020 ఆగస్టు 10న బసంత్‌నగర్‌ వచ్చి స్థల పరిశీలన చేశారు.

ఫ అవరోధాలు అధిగమిస్తేనే..

అయితే ఇక్కడ కన్నాల బోడగుట్ట, కొత్తపల్లి గుట్టతో పాటు విద్యుత్‌ టవర్లు ఉన్నాయని, విమానశ్రయానికి అవి సాంకేతికంగా ఆటంకం కలిగించనున్నాయని అధికారుల ముందు చెప్పారు. దీంతో అప్పటి ప్రభుత్వ అధికారులు టవర్లను తొలగించేందుకు, గుట్టలకు దూరంగా అవసరమైతే కొంత భూమిని భూసేకరణ ద్వారానైనా తీసుకుంటామని ఏవియేషన్‌ అథారిటీ అధికారులకు వివరించారు. అలాగే మొదటి దశలో 408 ఎకరాల్లో నిర్మాణానికి 248 కోట్లు, రెండవ దశలో మరో 566 ఎకరాలకు విస్తరించినట్లయితే 341 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనాలను కూడా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అడుగులు చకచకా పడుతూ ఉండడంతో బసంత్‌నగర్‌లో ఎయిర్‌ పోర్టు వస్తుందనే ఆశల్లో ప్రజలు జీవిస్తున్నారు. ప్రతిపాదిత ఎయిర్‌ పోర్టు పరిసరాల భూముల ధరలకు రెక్కలు కూడా వచ్చాయి. కేంద్ర సహాయ మంత్రి సాంకేతికంగా బసంత్‌నగర్‌ ఎయిర్‌ పోర్టు సాధ్యం కాదని తేల్చిచెప్పడంతో ఈ ప్రాంత వాసుల ఆశలు ఒక్కసారిగా అడియాసలయ్యాయి. మామునూర్‌ ఎయిర్‌ పోర్టు అవరోధాలు తొలగడంతో ప్రభుత్వం అక్కడ 280 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మామునూర్‌, కొత్తగూడెం, ఆదిలాబాద్‌ ఎయిర్‌ పోర్టులతో పాటు బసంత్‌నగర్‌ కూడా చేపడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సాంకేతిక అవరోధాలను అధిగమించేందుకు తాము చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించగలిగితేనే విమానయానానికి కదలిక వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - Nov 21 , 2024 | 01:34 AM