Share News

రైతులకు భరోసా కల్పించండి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:29 AM

మేడిగడ్డ బ్యారేజీ నుంచి ప్రతి రోజు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నీటిని పంపింగ్‌ చేసి రిజర్వాయర్లను నింపి రైతులకు భరోసా కల్పించాలి’ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ కె తారక రామారావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఆయన కరీంనగర్‌ సమీపంలోని దిగువ మానేరు జలాశయాన్ని (ఎల్‌ఎండీ)ని గురువారం సాయంత్రం సందర్శించారు.

రైతులకు భరోసా కల్పించండి

తిమ్మాపూర్‌, జూలై 25: ‘మేడిగడ్డ బ్యారేజీ నుంచి ప్రతి రోజు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నీటిని పంపింగ్‌ చేసి రిజర్వాయర్లను నింపి రైతులకు భరోసా కల్పించాలి’ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ కె తారక రామారావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఆయన కరీంనగర్‌ సమీపంలోని దిగువ మానేరు జలాశయాన్ని (ఎల్‌ఎండీ)ని గురువారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్బంగా ఎల్‌ఎండీలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, గతంలో ఈ సమయానికి ఉన్న నీటి నిల్వలు, ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లో గురించి ఇరిగేషన్‌ శాఖ ఈఈ శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటన ను పట్టుకుని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్‌ నాయకత్వంలో తాము సాగునీటి రంగంలో విప్లవం తీసుకువచ్చామన్నారు. దీంతో నీటి లభ్యత పెరిగి వ్యవసాయ విస్తారణ బాగా జరిగిందన్నారు. గత సంవత్సరం ఇదే రోజు లోయర్‌ మానేరు డ్యాంలో 12 టీఎంసీల నీరు ఉందని, ఐదు రోజుల అనంతరం నీటి పంపింగ్‌ చేయడంతో రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యానికి చేరుకుందన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికి 45 శాతం తక్కువ వర్ష పాతం నమోదైందని అధికారులు చెప్పారని, సెప్టెంబరు మాసం వరకు వర్షం పాడే అవకాశం ఉన్నా దానికి గ్యాంటరీ లేదు. ఈ పరిస్థితుల్లో పంపింగ్‌ చేస్తే కాని రిజర్వాయర్లు నిండి వ్యవసాయం ముందుకు సాగదన్నారు. రైతులు సాగునీరు లేక ఆందోళన చెందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ పరమైనా కక్ష పెట్టుకొని పంపింగ్‌ ప్రారంభిచకుండా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. కన్నెపల్లి వద్ద పంపులు ఆన్‌చేస్తే అన్ని రిజర్వాయర్లు నిండుతాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమాలకర్‌ సూచన మేరకు ఎల్‌ఎండీకి తమ బృందం వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. 10 లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకుని మేడిగడ్డ నిలబడిందన్నారు. ఎన్నికలు ముగిశాయని, ఇకనైనా రాజకీయలు వదిలి పెట్టాలి రైతులకు మేలు చేయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. శుక్రవారం మధ్యాహ్నంలోపు కన్నెపల్లి పంప్‌ హౌస్‌, మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి శాసనసభ సమావేశాలకు హాజరవుతామని కేటీఆర్‌ తెలిపారు. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లన్నింటిని నింపుకుంటే 240టీఎంసీల పైచిలుకు నీటిని నిల్వ చేసుకొవచ్చని, 24 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని కేటీఆర్‌ తెలిపారు. అనంతరం దిగువ మానేరు జలాశయం గేట్ల సమీపంలో ఉన్న ఫ్లడ్‌ కంట్రోల్‌ రూంలో కొద్ది సేపు కేటీఆర్‌ బృదం కూర్చుని కరీంనగర్‌కు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, సునీత లక్ష్మా రెడ్డి, సబిత ఇంద్రరెడ్డి, కోవ లక్ష్మి, జగదీశ్వర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, సత్యవతి రాథోడ్‌, శంభీర్‌పూర్‌ రాజు, మేయర్‌ సునీల్‌రావు, సర్దార్‌ రవీందర్‌ సింగ్‌,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, బాల్క సుమన్‌,మాజీ ఎమ్మెల్సీలు నారాదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:29 AM