Share News

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో కీలక అడుగు..

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:26 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు పడింది. ఈ రహదారి నిర్మితమయ్యే మార్గంలో అవసరమవుతున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం 73.04హెక్టార్ల (160.68 ఎకరాలు) అటవీయేతర భూములను మహబూబాబాద్‌ జిల్లాలో కేటాయించింది.

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో కీలక అడుగు..

  • అటవీ భూములకు బదులు అటవీయేతర భూములు

  • మహబూబాబాద్‌లో 160 ఎకరాలు కేటాయింపు

  • ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం నిర్మాణానికి మార్గం సుగమం

  • త్వరలో కేంద్ర అటవీశాఖ అనుమతులకు అవకాశం

  • ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీ భూములు

  • వాటికి బదులు అటవీయేతర భూములిచ్చిన రాష్ట్ర సర్కారు

  • మహబూబాబాద్‌ జిల్లాలో 73.04 హెక్టార్ల కేటాయింపు

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు పడింది. ఈ రహదారి నిర్మితమయ్యే మార్గంలో అవసరమవుతున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం 73.04హెక్టార్ల (160.68 ఎకరాలు) అటవీయేతర భూములను మహబూబాబాద్‌ జిల్లాలో కేటాయించింది. ఈ వివరాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ విభాగానికి అందించింది. వాటిని ఎన్‌హెచ్‌ఏఐ.. కేంద్ర ప్రభుత్వంతో పాటు, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు నివేదించింది.


దీంతో ఉత్తర భాగం నిర్మాణానికి అటవీ అనుమతులు త్వరితగతిన మంజూరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ అనుమతుల కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసింది. ఈ రహదారి నిర్మాణ మార్గంలో 48,765 చెట్లపై ప్రభావం పడుతోందని ఆ దరఖాస్తులో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఏఐకు పూర్తి సహకారం అందిస్తోంది. యుటిలిటీస్‌ చార్జీల చెల్లింపు విషయంపైనా చర్చలు జరపడంతో రూ.363 కోట్లను తామే భరిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.


ఇలా ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సమస్యను అధిగమిస్తూ వస్తోంది. ఇప్పుడు అటవీయేతర భూముల కేటాయింపులోనూ వేగంగా చర్యలు తీసుకుంది. సిద్ధిపేట జిల్లా మైలారం, మెదక్‌ జిల్లా అల్లీపూర్‌, నారాయణపూర్‌, పెద్దచింతకుంట, తిర్మలాపూర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా ఇబ్రహీంపురంలో మొత్తం 71.87 హెక్టార్ల (158.11 ఎకరాలు) అటవీ భూములు అవసరమవుతున్నాయి. ఈ భూముల్లో వృక్షాలను తొలగించాల్సి వస్తుంది కాబట్టి కేంద్రం నిబంధనల ప్రకారం వేరేచోట అడవులు పెంచాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అటవీయేతర భూములు కేటాయించింది.


ఈ భూముల్లో చెట్ల పెంపకం చేపట్టాల్సి ఉంది. మహబూబాబాద్‌ జిల్లా అనంతారం, పొగళ్లపల్లి, చింతగూడంలో కలిపి మొత్తం 73.04 హెక్టార్లు (160.68 ఎకరాలు) ఇచ్చింది. వీటి సరిహద్దులు, ఇతర అన్ని అంశాలతో పక్కాగా నివేదిక సమర్పించారు. కాగా, రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ను ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించనున్నారు. ఉత్తర భాగం సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్‌, తూఫ్రాన్‌, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, యాదాద్రి భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వరకు 161 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుంది. దీనికి 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా.. దాదాపు 90ు భూ సేకరణ పూర్తయింది. దీని నిర్మాణానికి రూ.15 వేల కోట్లకు పైగా అవసరం కాగా.. ఇందులో దాదాపు రూ.5,200 కోట్లు భూములకు పరిహారం కింద చెల్లించాల్సి ఉంది.

Updated Date - Aug 16 , 2024 | 03:26 AM