Share News

Krishna Basin: కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:58 AM

కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా, తుంగభద్ర నదులకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది.

Krishna Basin: కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

  • శ్రీశైలానికి 79 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

  • నాగార్జున సాగర్‌కు 67 వేల క్యూసెక్కులు

గద్వాల/నాగార్జున సాగర్‌/మెండోర, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా, తుంగభద్ర నదులకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు గురువారం 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 42 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్‌ జలాశయానికి 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 34,420 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 51 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. గేట్ల ద్వారా 21,528 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 38,408 క్యూసెక్కులను వదులుతున్నారు.


తుంగభద్ర ప్రాజెక్టుకు 28 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా గేట్ల ద్వారా 14 వేల క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 5 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 79,536 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 67,776 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 212.91 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్‌కు 67,637 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో (312 టీఎంసీలు) నాలుగు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 78,997 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో గోదావరి నదిపై ఉన్న శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి 18,826 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మూడు గేట్లు ఎత్తి.. 9,372 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి(80 టీఎంసీలు)లో నిండి ఉంది.

Updated Date - Oct 18 , 2024 | 03:58 AM