Share News

నీటి తరలింపు ఆపండి!

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:21 AM

పోతిరెడ్డిపాడు ద్వారా జరుపుతున్న నీటి తరలింపును తక్షణం నిలిపివేయాలని, శ్రీశైలం కుడి, ఎడమ వైపుల నిర్వహిస్తున్న జలవిద్యుత్‌ ఉత్పత్తిని ఆపివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది.

నీటి తరలింపు ఆపండి!

  • శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో విద్యుదుత్పత్తి నిలిపివేయండి

  • తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు ద్వారా జరుపుతున్న నీటి తరలింపును తక్షణం నిలిపివేయాలని, శ్రీశైలం కుడి, ఎడమ వైపుల నిర్వహిస్తున్న జలవిద్యుత్‌ ఉత్పత్తిని ఆపివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. జల విద్యుదుత్పత్తి కోసం నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల నుంచి జరుపుతున్న నీటి తరలింపును ఆపాలని పేర్కొంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఆగిపోయినా.. నీటి తరలింపు, జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుండటంతో జలాశయాల్లో నీటి నిల్వలు శరవేగంగా అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి కేఆర్‌ఎంబీ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.శంఖువ మంగళవారం లేఖ రాశారు. ఈ విషయంపై ఇది వరకే ఆయన ఒక లేఖ రాయగా.. ఇది రెండోది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌-11 ప్రకారం ఉమ్మడి జలాశయాల్లో జలవిద్యుత్‌కు అత్యల్ప ప్రాధాన్యం ఇచ్చారని తాజా లేఖలో ఆయన గుర్తు చేశారు. రానున్న వర్షాకాలం దాకా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లోని నీటి నిల్వలను సాగు, తాగు అవసరాల కోసం సంరక్షించాలని సూచించారు.


  • 46 టీఎంసీల తరలింపు

శ్రీశైలం రిజర్వాయరు పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 169.87 టీఎంసీలు మాత్ర మే ఉన్నాయి. 46 టీఎంసీల నీటిని తెలుగు రాష్ట్రాలు పోటీ పడి తరలించడంతో జలాశయంలో నిల్వలు శరవేగంగా తగ్గుతున్నాయి. ఇక పోతిరెడ్డిపాడు నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని తరలించగా... రెండు జల విద్యుత్‌ కేంద్రాలతో 25,940 క్యూసెక్కులను దిగువకు తరలించారు. నాగార్జునసాగర్‌కు 17,593 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... కుడి, ఎడమ కాల్వల ద్వారా తరలిస్తున్నారు. శ్రీశైలంలో వదిలే నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి సాగర్‌లో లేదు. దాంతో ఆనివార్యంగా బయటికి తరలించాల్సిన పరిస్థితి.

  • 6 నెలల పాటు కనీస నిల్వలు తప్పనిసరి

వచ్చే ఏడాది జూలై లేదా ఆగస్టులో కృష్ణా బేసిన్‌కు వరదలు వస్తాయి. అప్పటి వరకూ కనీసం 6 నెలలపాటు శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలను కాపాడుకోవాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల తాగునీటి అవ సరాలకు శ్రీశైలం ప్రాజెక్టే పెద్ద దిక్కు. రాయలసీమతో పాటు చెన్నయ్‌ తాగునీటి అవసరాలకూ ఈ ప్రాజెక్టు కీలకం. ఈసారి వానాకాలం సీజన్‌ ఇప్పటికే పూర్తయింది. కొత్తగా వరదలు వచ్చే అవకాశమే లేదు. అయినప్పటికీ తెలంగాణ, ఏపీ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 04:21 AM