Share News

Forgery: సంగారెడ్డి కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:22 AM

స్వాతంత్య్ర సమరయోధుల వారసులు కొందరు అక్రమానికి పాల్పడ్డారు. తమది కాని ఆ భూమిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అడ్డదారి తొక్కారు. ఏకంగా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిరంభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సృష్టించి దొరికిపోయి కటకటాలపాలయ్యారు.

Forgery: సంగారెడ్డి కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ

  • 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను

  • అమ్మేందుకు ఎన్‌వోసీ కూడా తయారీ

  • స్వాతంత్య్ర సమరయోధుల వారసుల కుట్ర

  • ఐదుగురి అరెస్టు, పరారీలో నలుగురు

రామచంద్రాపురం, నవంబరు 17, (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుల వారసులు కొందరు అక్రమానికి పాల్పడ్డారు. తమది కాని ఆ భూమిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అడ్డదారి తొక్కారు. ఏకంగా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిరంభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సృష్టించి దొరికిపోయి కటకటాలపాలయ్యారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులోని సర్వే నం191లోని భూమిని ఒక్కొక్కరికి రెండెకరాల చొప్పున 74 మంది స్వాతంత్య్ర సమరయోధులకు 1984లో ప్రభుత్వం కేటాయించింది. ఇందులో అల్లాదుర్గం, టేక్మాల్‌కు చెందిన ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులున్నారు. అయితే, వీళ్ల వారసులు వీరేశం, రాములు, సుధాకర్‌, సంతోష్‌, నాగరాజు బృందంగా ఏర్పడి సర్వే నం.191లోని ఓ రెండు ఎకరాలను విక్రయానికి పెట్టారు. రూ.40 కోట్లు పలికే ఆ భూమిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన ఓ వ్యక్తి రూ.2.5 లక్షలు వారికి బయానాగా ఇచ్చాడు. అయితే, సదరు భూమి క్రయవిక్రయాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఎన్‌వోసీ తనకు కావాలని షరతు పెట్టాడు.


దీంతో కలెక్టర్‌ కార్యాలయం దగ్గర దళారీగా పని చేసే శ్రీనివాసచారి అనే వ్యక్తిని వారసుల బృందం కలిసింది. శ్రీనివాసచారి మరికొందరితో కలిసి సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరి క్రాంతి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్‌వోసీ సృష్టించాడు. ఈ విషయం నెమ్మదిగా బయటపడగా స్థానిక తహసీల్దార్‌ సంగ్రారెడ్డి ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి శనివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితులు విక్రయించడానికి యత్నించింది ప్రభుత్వ భూమి అని తహసీల్దార్‌ సంగ్రారెడ్డి స్పష్టం చేశారు. సదరు భూమి స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించినప్పటికీ ప్రభుత్వం ఇదివరకే వెనక్కి తీసుకుందని తెలిపారు. తాను ఇటీవలే విధుల్లో చేరానని, భూమిని ఎందుకు వెనక్కి తీసుకున్నారనే అంశం తెలుసుకునేందుకు రికార్డులు పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

Updated Date - Nov 18 , 2024 | 04:22 AM