Share News

తోపుడు బండి సాదిక్‌ అలీ కన్నుమూత

ABN , Publish Date - Nov 08 , 2024 | 03:30 AM

తోపుడు బండి ద్వారా ఇంటింటికి సాహిత్యాన్ని పరిచయం చేసిన గ్రంథాలయ ఉద్యమకర్త, సీనియర్‌ జర్నలిస్టు షేక్‌ సాదిక్‌ ఆలీ (61) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు.

తోపుడు బండి సాదిక్‌ అలీ కన్నుమూత

  • 150కుపైగా గ్రంథాలయాలు నెలకొల్పడంలో ప్రధాన పాత్ర

కల్లూరు, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): తోపుడు బండి ద్వారా ఇంటింటికి సాహిత్యాన్ని పరిచయం చేసిన గ్రంథాలయ ఉద్యమకర్త, సీనియర్‌ జర్నలిస్టు షేక్‌ సాదిక్‌ ఆలీ (61) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన మొదట ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. బుధవారం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాదిక్‌ స్వస్థలం ఖమ్మం జిల్లా కల్లూరు. ఉస్మానియా వర్సిటీలో ఎం.ఏ తెలుగు చదువుతున్న రోజుల్లో పీడీఎ్‌సయూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో ‘ఉదయం దినపత్రిక’లో పాత్రికేయ జీవితం ప్రారంభించారు. సాదిక్‌ జీవిత సహచరి ఉష ప్రస్తుతం తెలంగాణ వ్యవసాయశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. తోపుడు బండి ద్వారా తెలుగు సాహిత్యాన్ని ఇంటింటికి పరిచయం చేసే వినూత్న ఉద్యమాన్ని 2014లో ప్రారంభించారు.

ఆనాటి నుంచి తోపుడు బండి సాదిక్‌గా సాహిత్యాభిమానుల అభిమానాన్ని పొందారు. పుస్తకాలతో నిండిన తోపుడు బండి నెట్టుకొంటూ ‘పల్లెకు ప్రేమతో’ నినాదంతో వంద రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. తోపుడు బండి ఫౌండేషన్‌ ద్వారా ఖమ్మం, వరంగల్‌ జిల్లాలలోని మారుమూల పల్లెల్లో 150కుపైగా గ్రంథాలయాలు నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. మరికొన్ని గ్రంథాలయాలకు పుస్తకాలు అందించడంలో సహకరించారు. తన సొంతపట్టణం కల్లూరులో కరోనా సమయంలో అనారోగ్యానికి గురైన వందల మందికి అన్నదానం, వైద్య సహాయం అందించారు. సాదిక్‌ మృతిపట్ల పలువురు కవులు, రచయితలు సంతాపం ప్రకటించారు. సత్తుపల్లిలో ఇస్లాం ఆచారాల ప్రకారం సాదిక్‌ ఆలీ భౌతికకాయాన్ని ఖననం చేశారు.

Updated Date - Nov 08 , 2024 | 03:30 AM