కోట బురుజులు.. చరిత్రకు ఆనవాళ్లు
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:12 PM
చరిత్రకు ఆనవాళ్లయిన కోట బురుజులు క్రమంగా శిథిలం అవుతున్నాయి.
- సంస్థానాధీశుల కాలంలో నిర్మాణం
- వాటిపై నుంచి సైనికుల నిఘా
- శిథిలం అవుతున్న అలనాటి కట్టడాలు
- కాపాడాలని కోరుతున్న ప్రజలు
నవాబ్‌పేట, పెద్దకొత్తపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : చరిత్రకు ఆనవాళ్లయిన కోట బురుజులు క్రమంగా శిథిలం అవుతున్నాయి. నిజాం నవాబులు, సంస్థానాధీశుల కాలంలో శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడుకునేందుకు పలు రక్షణ చర్యలు తీసుకున్నారు. రాజ్యంలోని ప్రధాన పట్టణాలు, పెద్ద కొండలపై కోటలు నిర్మించుకొని, అక్కడి నుంచే పాలన సాగించారు. అలాగే గ్రామాల సంరక్షణ కోసం ఊరి చుట్టూ రాతి గోడ నిర్మించి, నాలుగు వైపులా బురుజులు ఏర్పాటు చేశారు. వాటిపై సైనికులు ఉండి నిరంతరం కాపలా కాసేవారు. శత్రువుల ఉనికిని దూరం నుంచే పసిగట్టి, పాలకులను అప్రమత్తం చేసేవారు. కాలక్రమంలో రాజులు పోయారు, రాజ్యాలు కూలిపోయాయి. అలాగే ఆనాటి కట్టడాల సంరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో శిథి లావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల పూర్తి గా కనుమరుగవగా, మరికొన్ని చోట్ల కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని ఊర్లలో స్థానికులే రాళ్ల కోసం వాటిని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని గ్రామాల్లో నేటికీ చెక్కు చెదరకుండా ఉండి అలనాటి చరిత్ర ను చాటి చెప్తున్నాయి. నవాబ్‌పేట మండలంలోని యన్మనగండ్ల, కారుకొండ, తీగలపల్లి, కాకర్లపాడ్, చౌడూర్, హన్మసానిపల్లి, రుక్కంపల్లి, ఇప్పటూర్, కూచూర్ తదితర గ్రామాల్లో ఇప్పటికీ బురుజులు ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి.
ఇప్పటూర్ గ్రామంలో మట్టి, రాయితో నిర్మించిన కోట గోడలు నేటికి స్థిరంగా ఉన్నాయి. యన్మనగండ్ల గ్రామ పంచాయతీ పక్క నున్న బురుజుకు నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి సర్పంచ్ జరీనారశూఫ్ షరీఫ్ మరమ్మతు చేయించారు. చౌడూర్ గ్రామం లో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం కోట బురుజులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చరిత్రకు ఆనవాళ్లయిన బురుజు లకు మరమ్మతులు చేసి, వినియోగంలోకి తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతు న్నారు. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, రాష్ట్ర అవతరణ దినోత్సవం తదితర వేడుకల సందర్భంగా బురుజులపై జాతీయ పతకా లు ఎగురవేస్తే బాటుంటుందని ఆయా గ్రామాల ప్రజలు సూచిస్తున్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలోని ఆదిరాల, యాపట్ల, మరికల్, గంట్రావుపల్లి, చంద్రకల్, ముష్టిపల్లి గ్రామాల్లో చోళులు, కాకతీయ రాజులు నిర్మించిన కోట బురుజులు నేటికీ చెక్కు చెదరలేదు. అలాగే కాకతీయుల కా లంలో నిర్మించిన దేవుని తిర్మలాపూర్ వేంక టేశ్వరస్వామి ఆలయం, కల్వకోల్‌లో నంది కోటేశ్వరాలయాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. నేటికీ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.