Share News

తగ్గిన ఆదాయం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:07 PM

ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వనరుల్లో రిజిస్ట్రేషన్‌ల రూపంలో వచ్చే ఆదాయం ఒకటి..

తగ్గిన ఆదాయం
క్రయ విక్రయదారులు లేక బోసిపోయిన మహబూబ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

- పడిపోయిన రిజిస్ట్రేషన్లు

- కుదేలైన రియల్‌ వ్యాపారం

- ఉమ్మడి జిల్లాలో గతంలో నెలకు సగటున రూ.20 కోట్ల నుంచి 22 కోట్ల ఆదాయం

- ఏప్రిల్‌లో వచ్చింది రూ.14.71 కోట్లు

- భూముల మార్కెట్‌ విలువలు పెంచుతారన్న ప్రచారంతో మే, జూన్‌ లలో కొంత ఊరట

- మూడు నెలల్లో వచ్చింది రూ.54 కోట్లు

మహబూబ్‌నగర్‌, జూలై 26: ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వనరుల్లో రిజిస్ట్రేషన్‌ల రూపంలో వచ్చే ఆదాయం ఒకటి.. కొన్ని నెలలుగా రియల్‌ వ్యాపారం కుదేలైంది. క్రయవిక్రయాలలో జోరుతగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన మూడు నెలలు గతంతో పోలిస్తే ఆదాయం తగ్గిపోయింది. ఉమ్మడి పాలమూరులో ఈ శాఖ ద్వారా సగటున నెలకు రూ. 20 కోట్ల నుంచి 22 కోట్ల ఆదాయం సమకూరేది. ఈ ఆర్థిక సంవత్సరం మూడునెలల్లో సగటున రూ.18 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఏప్రిల్‌లో పూర్తిగా పడిపోయిది. భూముల మార్కెట్‌ విలువ పెంచనున్నట్లు ప్రచారం జరగడంతో మే, జూన్‌ నెలల్లో కొంత జోరందుకున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా అందులో జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలలోనే సగం వరకు ఆదాయం రావడం గమనార్హం. అయితే తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రిజిస్ట్రేషన్‌ ఆదాయం గతంలోకంటే పెంచుకోవాలని నిర్ణయించడంతో భూముల మార్కెట్‌ విలువలను తొందరలోనే పెంచనున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే కొన్నినెలలుగా రియల్‌ వ్యాపారం మందకోడిగా సాగుతోంది. ఇలానే కొనసాగితే గతంలో వచ్చిన ఆదాయం కన్నా తగ్గే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం బడ్జెట్‌లో ఆదాయం ఎక్కువగా చూయించడంతో రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ ఫీజులు పెరగనున్నాయని అర్థమవుతోంది. ముందుగా ఆగష్టు 1 నుంచే పెంచుతా మని భావించినా ఇప్పటివరకు పెంపుపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో 1వ తేదీ నుంచి పెంపు సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.

ఏప్రిల్‌లో ఢమాల్‌

ఆర్థిక సంవత్సరం మొద లైన ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కె ట్‌ ఢల్‌గా సాగింది. దీంతో రూ.6-7 కోట్ల ఆదాయం ఒక్క నెలలో తగ్గిపోయింది. ఈ నెలలో కేవలం రూ.14.71 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అందులో జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలో రూ.3.50 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.2.91 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ రెండింటిలో దాదాపు 43 శాతం ఆదాయం ఈ రెండు ప్రాంతాలలో రాగా, మిగతా చోట వ్యా పారం అంతంత మాత్రంగానే ఉన్నదన్న విషయం తెలుస్తోంది. గద్వాల లో 1.84 కోట్లు, వనపర్తిలో 1.80 కోట్ల ఆదాయం వచ్చింది. మే, జూన్‌లో మార్కెట్‌ విలువ పెంచుతున్నారన్న ప్రచారంతో కాస్త రిజిస్ట్రేషన్‌లు జోరందుకున్నాయి. మే నెలలో రూ.19 కోట్ల ఆదాయం రాగా, జూన్‌లో రూ.21 కోట్ల ఆదాయం సమకూరింది. 2022-23 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా ప్రభుత్వానికి రూ.244.49 కోట్ల ఆదాయం రాగా, 2023-24 సంవత్సరంలో రూ.250.05 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం చూస్తున్నా లక్ష్యాన్ని అందుకునే పరిస్థితులు లేవని తెలుస్తోంది.

మార్కెట్‌ విలువ పెంచితే

ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రియల్‌ వ్యాపారం మార్కెట్‌ విలువ పెంచితే మరింత ఆదా యం తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రియల్‌ వ్యా పారం బాగా సాగితే భూముల క్రయవిక్రయాలు పెరు గుతాయి. భూములు, ప్లాట్లు కొనుగోలు చేసేవాళ్ల ఒకచోట భూమి, ప్లాటు కొనుగోలు చేసి కాస్త రేటు వస్తే వెంటనే మళ్లీ అమ్ముకుంటారు. ఇలా వ్యాపారం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. దీంతో క్రయవిక్రయా లు ఎక్కువగా జరగడం వల్ల రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా జరిగి ఆదాయం పెరుగుతుంది. అదే భూములు, ప్లాట్లకు డిమాండ్‌ తగ్గి రియల్‌ వ్యాపారం పడిపోతే క్రయవిక్రయాలు తగ్గిపోయి తద్వారా రిజిస్ట్రేషన్‌లు చేసుకునే వారి సంఖ్య తగ్గుతుంది. ఇక మార్కెట్‌ విలువలు పెరిగితే రిజిస్ట్రేషన్‌ చేసుకునే దాన్ని కన్నా అగ్రిమెంట్‌లు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో రిజిస్ట్రేషన్‌ ఆదాయం తగ్గిపోతుంది. మరోవైపు రియల్‌ వ్యాపారులు చాలా రోజులనుంచి గ్రామపంచా యతీ లే అవుట్లపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని కోరు తున్నారు. గత ప్రభుత్వం నాలుగేళ్లక్రితం గ్రామపంచా యతీ లే అవుట్ల రిజిస్ట్రేషన్‌లపై నిషేధం విధించింది. దీంతో అప్పటివరకు గ్రామపంచాయతీ లేఅవుట్లపై పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి లేఅవుట్‌ చేసిన వాళ్లంతా పరేషాన్‌లో పడ్డారు. ఈ ప్రభావం కూడా రిజిస్ట్రేషన్‌ ఆదాయంపై పడుతోంది. ప్రభుత్వం జీపీ లే అవుట్లకు అనుమతిస్తే పెద్దఎత్తున రిజిస్ట్రేషన్‌లు జరిగి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

Updated Date - Jul 26 , 2024 | 11:07 PM