Share News

భయంభయంగా ప్రయాణం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:13 PM

మండలంలోని గుర్రంగడ్డ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పాత పవర్‌ బోటులోనే ప్రయాణం చేస్తున్నారు.

భయంభయంగా ప్రయాణం
పాత పవర్‌బోట్‌లో ఎక్కిన గ్రామస్థులు, (అంతరచిత్రంలో) బోటులో చేరిన నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యం

- పాత పవర్‌ బోటుతో గుర్రంగడ్డవాసుల అవస్థలు

- కొత్త బోటు కోసం ఎదురుచూపులు

గద్వాల, జూలై 26 : మండలంలోని గుర్రంగడ్డ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పాత పవర్‌ బోటులోనే ప్రయాణం చేస్తున్నారు. రాళ్లకు తగిలి బోటుకు చిన్నచిన్న రంధ్రాలు పడటంతో, మరమ్మతులు చేయడానికి వీలు లేక పక్కన పట్టేశారు. కొత్త పవర్‌ బోటు కొనాలనే నిర్ణయం తీసుకునేలోపే కృష్ణానదికి వరదలు వచ్చాయి. దీంతో నదిలోనుంచి గ్రామానికి వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ప్రస్తుతం కృష్ణానదికి 2.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో బీరోలి గ్రామం వైపు నీరు సుడులు తిరుగుతూ పరవళ్లు తొక్కుతోంది. దీంతో పుట్టీలో ప్రయాణం సాధ్యం కావడం లేదు. పాత పవర్‌బోటుకే చిన్న చిన్న మరమ్మతులు చేసి, వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ గుర్రంగడ్డ నుంచి బీరోలి వైపునకు వచ్చే లోపు బోటులోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎప్పటికప్పుడు నీటిని తోడి వేస్తూ ప్రయాణం కొనసాగించాల్సి వస్తోంది. దీంతో బోటు ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు. కానీ అత్యవసర పనులు ఉన్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో బోటు ప్రయాణం చేయాల్సి వస్తోంది. పాఠశాల ఉపాధ్యాయుడు, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎంలు గ్రామానికి వెళ్లి విధులు నిర్వహించాలంటే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌ కొత్త పవర్‌ బోటు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెప్పించేందుకు ఆర్డర్‌ ఇచ్చారు. అది ఎప్పుడు వస్తుందా అని గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. ఫిషరీస్‌ అధికారులు చొరవ తీసుకొని కొత్త పవర్‌ బోటు త్వరగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:13 PM