Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి
ABN , Publish Date - Oct 11 , 2024 | 04:18 AM
మాదిగలను నమ్మించటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా మాదిగ జాతి నమ్మే పరిస్థితి లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.
సీఎంను మాదిగ జాతి నమ్మే పరిస్థితి లేదు
16న వరంగల్‌లో భవిష్యత్ కార్యాచరణ: మందకృష్ణ మాదిగ
బౌద్ధనగర్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మాదిగలను నమ్మించటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా మాదిగ జాతి నమ్మే పరిస్థితి లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు సీఎం వ్యతిరేకమని, ఎప్పటికీ ఆయన్ను మాదిగల ద్రోహిగానే పరిగణిస్తామని ధ్వజమెత్తారు. వర్గీకరణ ప్రక్రియ జరగకుండా 11వేల టీచర్ పోస్టుల భర్తీ చేసి మాదిగ జాతికి ద్రోహం చేశారని విమర్శించారు. వర్గీకరణ ప్రక్రియ జరిగే వరకు కొత్త నోటిఫికేషన్లు పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం శాసనసభలో చేసిన ప్రకటనకు విలువలేదని విమర్శించారు. అక్టోబరు, నవంబరులో నిర్వహించే గ్రూప్ 1, 2 పరీక్షలకు వర్గీకరణ వర్తింపజేయాలని గ్రూప్ 3ని రద్దు చేయాలని కోరారు. వర్గీకరణ అంశం తేలకుండా పరీక్షలు నిర్వహిస్తే మాదిగ కులాలు నష్టపోతాయని పేర్కొన్నారు. అలాగే గ్రూప్ 4 ఫలితాలను నిలిపివేయాలని కోరారు. వర్గీకరణ చట్టం చేతికి వచ్చే వరకు సీఎంను నమ్మేదిలేదని పేర్కొన్నారు. ఈ నెల 16న వరంగల్‌లో జిల్లా, మండల, జాతీయ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ తెలిపారు.