Telangana Elections 2024: మెతుకు సీమ మద్దతెవరికో!
ABN , Publish Date - May 11 , 2024 | 08:00 AM
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డి బరిలోకి దిగారు.
ఇరవై ఏళ్లుగా గులాబీ కంచుకోటగా మెదక్
సిటింగ్‌ను నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నం
పాగా వేయడానికి కాంగ్రెస్, బీజేపీ పోరాటం
ప్రధాన పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం
(ఆంధ్రజ్యోతి, సిద్దిపేట)
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డి బరిలోకి దిగారు. కాంగ్రెస్.. తాజా మాజీ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌ను తెరపైకి తెచ్చింది. దుబ్బాక ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసిన రఘునందన్‌రావును ఈసారి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దించింది. ఇప్పటికే ఈ ముగ్గురు అభ్యర్థుల తరపున అగ్రనేతలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
కంచుకోటను కాపాడుకోవాలని..
తాజా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలిచే స్థానాల ప్రస్తావన వస్తే.. ముందుగా మెదక్ గురించే చర్చ జరుగుతోంది. ఈ స్థానాన్ని తాము తప్పక గెలుస్తామని గులాబీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయిు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండడమే ఇందుకు కారణం. వీరిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు మరో కీలక నేత హరీశ్‌రావు కూడా ఉన్నారు.
2004 నుంచి బీఆర్‌ఎస్ తరపున వరుసగా ఆలె నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. ప్రస్తుత అభ్యర్థి వెంకట్రామారెడ్డి ఈ ప్రాంతంలో డ్వామా పీడీగా, అడిషనల్ కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం తమకు లాభిస్తుందని భావిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నీతానై విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్ శిబిరం సర్వశక్తులూ ఒడ్డుతోంది.
విజయంపై కాంగ్రెస్ ఫోకస్..
మెదక్ పార్లమెంటు స్థానానికి 18 సార్లు ఎన్నికలు జరిగితే.. 9సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. దేశ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే 1984 సంవత్సరంలో కన్నుమూశారు. ఆమె ప్రాతినిథ్యం వహించిన సందర్భంలో ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఇందిర నియోజకవర్గంగా పేరొందిన ఈ స్థానంలో 1998 తర్వాత కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కలేదు.
పాతికేళ్లుగా విజయం కోసం ఆ పార్టీ ఆరాటపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మెదక్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి స్వయంగా రేవంత్ హాజరయ్యారు. కాగా, మోదీ కరిష్మాయే తనను గెలిపిస్తుందని బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అంటున్నారు.
1999లో బీజేపీ తరపున ఆలె నరేంద్ర ఎంపీగా విజయం సాధించిన నేపథ్యంలో మరోసారి గెలుపు కోసం కమలదళం శ్రమిస్తోంది. పదేళ్ల బీజేపీ పాలనలో చేపట్టిన పథకాలు, పరిష్కరించిన సమస్యలు, తమ హిందూత్వ సిద్ధాంతాలపై ప్రజల్లో చర్చ పెడుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీచేసి ఓటమిపాలైన తర్వాత రఘునందన్‌రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా.. బీజేపీ ఆయన్నే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇటీవలే పార్టీ అగ్రనేత అమిత్‌షా సిద్దిపేటలో బహిరంగ సభకు హాజరై కాషాయ శిబిరంలో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
హామీలతో హోరాహోరీ..
ఎన్నికల ప్రచారంలో సమస్యల పరిష్కారం కంటే హామీల ప్రచారమే ఎక్కువగా వినిపిస్తోంది. తనను గెలిపిస్తే కేంద్ర నిధులతో మెదక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు చెబుతున్నారు.
ఇక తనను పార్లమెంటుకు పంపిస్తే ప్రశ్నించే గొంతుకగా మారుతానని, ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవంతో శ్రమిస్తానని అంటున్నారు. అంతేగాకుండా విద్యానిధి కింద తన సొంత నిధులు రూ.100 కోట్లతో పీవీఆర్(పరిపాటి వెంకట్రామారెడ్డి) ట్రస్టు, ప్రతీ నియోజకవర్గంలో పేదవాళ్లకు ఒక ఫంక్షన్‌హాల్, నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు కూడా తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు లక్షన్నర మంది బీడీ కార్మికులు ఉన్నారు. దుబ్బాక, సిద్దిపేట, మెదక్, గజ్వేల్ నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుంది.