మోదీ గ్యారెంటీ బ్రహ్మాస్త్రం
ABN , Publish Date - Apr 24 , 2024 | 05:21 AM
తెలంగాణలో మెజారిటీ లోక్‌సభ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ‘‘ఎన్డీయే కూటమి గెలవనున్న 400 పైగా
రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు వ్యూహాత్మక అడ్డుకట్ట
21 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కమల దళ ప్రచారం..
మెజారిటీ సీట్లే లక్ష్యం
ప్రత్యామ్నాయం దిశగా అడుగు..
అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో ఆశావహం
చేరికలతో ఈసారి లోక్‌సభ బరిలో బలమైన అభ్యర్థులు..సర్వేలతో శ్రేణుల్లో ఉత్సాహం
గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది. ఇతర పార్టీల నుంచి చేరికలతో ఊపు వచ్చింది. సర్వేలు కూడా సానుకూలంగా ఉన్నాయి. వీటికితోడు తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలిచేందుకు మోదీ గ్యారెంటీ నినాదాన్ని బ్రహ్మాస్తంగా ప్రయోగించాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. ‘మోదీ కోసం.. మోదీ గ్యారెంటీ కోసం ఓటేయండి’ అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్న ఆ పార్టీ.. తద్వారా ఒకటి రెండుచోట్ల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించవచ్చని యోచిస్తోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మెజారిటీ లోక్‌సభ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ‘‘ఎన్డీయే కూటమి గెలవనున్న 400 పైగా స్థానాల్లో అభ్యర్థి ముఖ్యం కాదు.. మోదీని చూసి ఓటెయ్యండి’’ అని కోరుతోంది. దేశ భద్రత, సమగ్రతతో పాటు సంక్షేమం, అభివృద్ధి కోసం మరోసారి ఆయనను ప్రధాని చేయాలని ఓటర్లను స్థానిక నాయత్వం అభ్యర్థిస్తోంది. ‘‘మోదీ పథకాలే నన్ను గెలిపిస్తాయి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొనడం కూడా దీనినే సూచిస్తోంది. కాగా, రాష్ట్రంలో ఐదుచోట్ల మోదీ బహిరంగ సభలకు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రణాళికలు వేసింది. నాలుగు సభలు, ఒక రోడ్ షోనా? ఐదూ సభలా? అన్నది రాష్ట్ర పార్టీ నాయకత్వం సమీక్షిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వంటి అగ్ర నేతలు 21 సభల్లో పాల్గొననున్నారు. వీటిని ఎక్కడెక్కడ నిర్వహించాలన్నదానిపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు దక్షిణాదిన కర్ణాటకలో ఇప్పటికే బలంగా ఉన్నందున, తెలంగాణలోనూ ఆ స్థాయికి చేరుకోవడానికి లోక్‌సభ ఎన్నికలను కీలక మలుపు అని బీజేపీ అంచనా వేస్తోంది. ఈసారి వచ్చే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో మెట్టు ఎక్కేందుకు దోహదపడతాయని భావిస్తోంది. మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదుగుదామన్న యోచనలో ఉన్న కమలం పార్టీ.., ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారే అవకాశం ఉందని ఊహిస్తోంది.
బలం పెరగడంతో.. బలమైన అభ్యర్ధులతో
తెలంగాణ ఖాయమైన 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 7.1 శాతం ఓట్లే వచ్చాయి. అయితే, ఇటీవలి ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. పది పైగా సీట్లలో ద్వితీయ స్థానంలో నిలిచింది. దాదాపు 14 శాతం ఓట్లు వచ్చాయి. 2018తో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. దీంతో ప్రతి లోక్‌సభ స్థానంపైనా ప్రత్యేక దృష్టితో.. అభ్యర్థుల పరంగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వ్యతిరేకత వచ్చినా మల్కాజిగిరిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు టికెట్ ఇచ్చి ఉద్దేశాన్ని చాటింది. మెదక్ వంటిచోట మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును దింపింది. శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ), పోతుగంటి భరత్ (నాగర్‌కర్నూల్), ఆరూరి రమేశ్ (వరంగల్), సీతారాం నాయక్ (మహబూబాబాద్)లను బీఆర్ఎస్ నుంచి చేర్చుకుని టికెట్లిచ్చింది. వీరిలో భరత్ తండ్రి రాములు నాగర్‌కర్నూల్ సిటింగ్ ఎంపీ. మిగతావారు ప్రజాప్రతినిధులుగా అనుభవం ఉన్నవారే కావడం గమనార్హం. అన్నిటికిమించి ఎంఐఎం అధినేత ఒవైసీకి అడ్డుకట్ట వేసేలా హైదరాబాద్‌లో మాధవీలతను నిలపడం.. ఆమె ప్రచార తీరు సోషల్ మీడియాలో చర్చనీయం కావడం బీజేపీకి మేలు చేకూర్చే అంశమని విశ్లేషకులు చెబుతున్నారు.
కార్యాచరణపై ఎప్పటికప్పుడు సమీక్ష
కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరాలన్న పట్టుదలతో, తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతోందని.. బీఆర్ఎస్ ప్రజల నమ్మకం కోల్పోయిందని పేర్కొంటోంది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాలు (కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్) గెలుచుకున్న ఆ పార్టీ, ఈసారి మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్, భువనగిరి, వరంగల్, మెదక్‌లోనూ విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత కష్టపడితే ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, హైదరాబాద్, పెద్దపల్లిలోనూ గెలుస్తామన్న ఆశాభావంతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేసిన అగ్ర నేతలు.. కార్యాచరణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరీ మరీ విమర్శిస్తే సానుభూతి పెరిగే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వాని కంటే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంది.
మూడు దశల్లో ఇంటింటి ప్రచారం
జాతీయ అగ్ర నేతలు, రాష్ట్ర పార్టీ నాయకులతో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, మేధావులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు, మరోవైపు స్థానిక కేడర్‌తో కలిసి ఇంటింటి ప్రచారం.. ఇలా మూడు దశల్లో బీజేపీ వూహ్యాన్ని రచించింది. నామినేషన్ల దాఖలు పూర్తయ్యే వరకు తొలి విడత ప్రచారం పూర్తిచేయనుంది. ఆ తర్వాత వారం పాటు రెండో దశలో కార్నర్ మీటింగ్‌లు, సభలు, పాదయాత్రలు నిర్వహిస్తారు. మూడో దశలో భారీ బహిరంగ సభలు ఉంటాయి. ఈ సభలను పోలింగ్‌కు ముందు రెండు, మూడు రోజులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా, యువ మోర్చా వంటి అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. 21 రోజుల కార్యాచరణలో మూడు రోజుల చొప్పున రెండుసార్లు ఇంటింటికీ వెళ్లాలి. నాలుగు రోజుల పాటు కార్నర్ మీటింగ్‌లు నిర్వహించాలి. మిగతా రోజుల్లో చిన్న సభల నుంచి భారీ సభలు, రోడ్ షోలు చేపడతారు.