Share News

Hyderabad: 16 మందికి ఒక డబుల్‌ ఇల్లా?

ABN , Publish Date - Oct 03 , 2024 | 04:04 AM

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తున్నా.. ఇన్నాళ్లూ ఉన్న ఇంటిని కోల్పోయిన ఉమ్మడి కుటుంబాల వారి పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.

Hyderabad: 16 మందికి ఒక డబుల్‌ ఇల్లా?

  • మూసీ నిర్వాసితుల్లోని ఓ ఉమ్మడి కుటుంబం వ్యథ

ఓల్డ్‌మలక్‌పేట అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తున్నా.. ఇన్నాళ్లూ ఉన్న ఇంటిని కోల్పోయిన ఉమ్మడి కుటుంబాల వారి పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఇన్నాళ్లూ ఒక్కటిగా ఉన్నవారంతా కలిసి ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటిలో ఉండలేక, వేరు కాపురం పెట్టలేక అవస్థలు పడుతున్నారు. ఓల్డ్‌మలక్‌పేట్‌ శంకర్‌నగర్‌లో ఇంటిని కోల్పోయిన ముజాహిద్‌ కుటుంబం ఎదుర్కోంటున్న పరిస్థితి ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ముజాహిద్‌ దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె షాహిన్‌ బేగం ఉన్నారు. వీరందరికీ పెళ్లి అయి సంతానం కూడా ఉన్నారు.


వీరంతా కలిసి మొత్తం 16 మంది శంకర్‌నగర్‌లోని తమ ఇంట్లో నివాసముండేవారు. షాహిన్‌ బేగం పేరు మీద ఉన్న ఆ ఇంట్లో ఎనిమిది గదులు ఉండడంతో నాలుగు కుటుంబాలు ఇన్నాళ్లూ కలిసిమెలిసి ఉన్నాయి. అయితే, మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో భాగంగా ముజాహిత్‌ కుటుంబం ఇంటిని కోల్పోయింది. ఇందుకు బదులుగా ఉప్పల్‌ ప్రతాప్‌ సింగారం దగ్గర ప్రభుత్వం వారికి ఓ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇచ్చింది. ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉన్నప్పటికీ.. సదరు ఇల్లు షాహిన్‌ బేగం పేరిట ఉండడంతో ఆమె పేరిటే ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఆ రెండు పడకల ఇల్లు ముజాహిద్‌ కుటుంబానికి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ఇన్నాళ్లూ కలిసి ఉన్న ఆ ఉమ్మడి కుటుంబం విడిపోవాల్సిన పరిస్థితి. శంకర్‌నగర్‌ ప్రాంతంలోని మరికొందరు నిర్వాసితులది కూడా ఇదే దుస్థితి.


  • డబుల్‌ బెడ్‌రూమ్‌ చాలడం లేదు

ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మా కుటుంబానికి సరిపోవడం లేదు. ఒకే ఇంట్లో 16 మంది ఉండేవాళ్లం. ప్రభుత్వం ఇచ్చిన ఇలు మాకు చాలడం లేదు. దీంతో మేము విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు రిజిస్ట్రేషన్‌ ఒకరి పేరు మీద ఉండడంతో ఒకే ఇల్లు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.

- ముజాహిద్‌, శంకర్‌నగర్‌ నిర్వాసితుడు

Updated Date - Oct 03 , 2024 | 04:04 AM