Maoist: మావోయిస్టు అగ్రనేత సుజాతక్క అరెస్టు?
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:20 AM
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం మిస్టరీగా మారింది. సుజాతక్కను రెండు రోజుల క్రితం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
43 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న వైనం
వైద్యం కోసం బయటకు, అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐబీ
నోరు విప్పని పోలీసులు, ప్రకటన చెయ్యని మావోయిస్టులు
గట్టు, చర్ల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం మిస్టరీగా మారింది. సుజాతక్కను రెండు రోజుల క్రితం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 43 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న సుజాతక్క అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారని అంటున్నారు. దీనిపై అటు పోలీసులు ఇటు మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన పటేల్ తిమ్మారెడ్డి, వెంకమ్మల రెండో సంతానమైన పద్మ అలియాస్ కల్పన, సుజాత, మైనా.. చదువుకునే రోజుల్లోనే మావోయిస్టు భావజాలంతో పనిచేస్తున్న పటేల్ సుధాకర్‌రెడ్డి ప్రభావంతో అడవిబాట పట్టారు.
తెల్కపల్లి దళంలో సభ్యురాలిగా చేరి.. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యురాలిగా సౌత్ బస్తర్ కేంద్రంగా పని చేస్తున్నారు. మావోయిస్టులు ఆమెను పెద్ద దిక్కుగా భావిస్తారు. నేటికీ ఆమె అడుగు జాడల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సుజాత ఉద్యమంలో ఉన్నప్పుడే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావును 1987లో వివాహం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ జార్‌గ్రామ్‌లోని బురిషోల్‌లో 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మరణించారు. అప్పట్నించి పోలీసులు సుజాత కోసం గాలిస్తున్నారు. ఆమెపై ప్రభుత్వం రూ.కోటి రివార్డు కూడా ప్రకటించింది. సుజాత వయస్సు ప్రస్తుత 67 ఏళ్లు కాగా కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉండగా, ఆమెకు వైద్యం చేయించేందుకు దండకారణ్యం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా భద్రాద్రి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనారోగ్యంతో ఆమే లొంగిపోయారని ప్రచారం కూడా జరుగుతోంది. ఆమె లొంగుబాటుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఐగా పని చేస్తున్న ఓ పోలీసు అధికారి కీలకపాత్ర పోషించారని అంటున్నారు. పోలీసులు లేదా మావోయిస్టులు స్పందిస్తే కానీ సుజాతక్క అంశంపై స్పష్టత రాదు.