సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:52 AM
భూమి, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందు, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చరిత్రను బీజేపీ వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం అగ్నికణంగా మారిందని అన్నారు.
సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి
నల్లగొండ రూరల్, సెప్టెంబరు 6: భూమి, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందు, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చరిత్రను బీజేపీ వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం అగ్నికణంగా మారిందని అన్నారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ అమరత్వం, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మాగ్ధుమ్ మోహినుద్దీన్ పిలుపుతో ప్రజలంతా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. దొరలు, భూస్వాముల లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదన్నారు. నాడు నైజాంకు తొత్తులుగా ఉన్నవాళ్లే నేడు బీజేపీ ముసుగులో మతంరంగు పులిమితే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. సెప్టెంబరు 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, ఈ నెల 11 నుంచి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 11న చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపం వద్ద వారోత్సవాలు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో కబ్జాకు గురైన చెరువు, కుంటలను హైడ్రా పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, అక్రమ నిర్మాణాలను కూలగొడుతోందని దీన్ని సీపీఐ స్వాగతిస్తోందన్నారు. హైడ్రాను జిల్లాలో కూడా చేపట్టాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, ఉజ్జిని యాదగిరి రావు, లోడింగి శ్రవణ్‌కుమార్, పబ్బు వీరాస్వామి, బొడ్డుపల్లి వెంకటరమణ, గురిజ రామచంద్రం, బోల్గురి నరసింహ, బంటు వెంకన్న, తిర్పారి వెంకటేశ్వర్లు, ఆర్.అంజాచారి, తదితరులు పాల్గొన్నారు.