Share News

పెట్రోల్‌ బాటిల్‌తో రైతు నిరసన

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:52 AM

తన భూమిలోని కడీలు ధ్వంసం చేశారని ఓ రైతు పెట్రోల్‌ బాటిల్‌తో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించాడు.

పెట్రోల్‌ బాటిల్‌తో రైతు నిరసన
రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన తెలుపుతున్న రైతు అంజయ్య

రామన్నపేట, జూలై 26: తన భూమిలోని కడీలు ధ్వంసం చేశారని ఓ రైతు పెట్రోల్‌ బాటిల్‌తో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన బోయిని అంజయ్యకు 3.30ఎకరాల భూమి ఉంది. అంజయ్య దివ్యాంగుడు కాగా కుటుంబసభ్యుల సహకారంతో వ్యవసాయం చేస్తున్నాడు. ఇదే భూమిని సరిహద్దు రైతులు ఆక్రమిస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అంజయ్య ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు భూమిని సర్వే చేయగా, ఆ హద్దురాళ్ల ప్రకారం తన పొలం చుట్టూ కడీలను పాతించాడు. తన భూమిలోని కడీలను సమీప భూముల్లోని రైతులు విరగ్గొట్టి ఇబ్బందులు పెడుతున్నారని అంజయ్య ఆరోపించాడు. దివ్యాంగుడినైన తన భూమిని ఇతరులు ఆక్రమించాలని చూస్తున్నారని, ఈ విషయంపై తహసీల్దార్‌కు పలుమార్లు వినతిపత్రం ఇచ్చానని తెలిపాడు. స్పందించకపోవడంతో శుక్రవారం పెట్రోల్‌ బాటిల్‌తో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని తెలిపాడు. అంజయ్య కుటుంబ సభ్యుల ఆందోళనకు స్థానిక రైతులు, గ్రామస్థులు అండగా నిలిచారు. ఎస్‌ఐ పి.మల్లయ్య తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని అంజయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రైతు భూమిలో కడీలు విరగ్గొట్టి వారిపై వెంటనే కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చి, రైతుకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు. అనంతరం తహసీల్దార్‌ లాల్‌ బహద్దూర్‌ మాట్లాడుతూ సోమవారం లోగా రైతు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 12:53 AM