Share News

‘గాలి’ లెక్కలుండవ్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:45 AM

ఉమ్మడి జిల్లాలో తొమ్మిది గాలి నాణ్యతా పర్యవేక్షణ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అనుమతిచ్చింది. ఏర్పాటు వ్యయంలో 50శాతం సీపీసీబీ, మిగతా 50శాతం తెలంగాణ కాలుష్య నియంత్ర ణా మండలి భరించనున్నాయి.

‘గాలి’ లెక్కలుండవ్‌

నాణ్యతా ప్రమాణాలు ఇక పక్కా

ఉమ్మడి జిల్లాకు తొమ్మిది పర్యవేక్షణా కేంద్రాల మంజూరు

భువనగిరి టౌన్‌, జూలై 26: ఉమ్మడి జిల్లాలో తొమ్మిది గాలి నాణ్యతా పర్యవేక్షణ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అనుమతిచ్చింది. ఏర్పాటు వ్యయంలో 50శాతం సీపీసీబీ, మిగతా 50శాతం తెలంగాణ కాలుష్య నియంత్ర ణా మండలి భరించనున్నాయి. ఈపాటికే ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో గాలి నాణ్యతా పర్యవేక్షణా స్టేషన్ల ఏర్పాట్ల పనులు ప్రారంభమయ్యాయి. అయితే గతంలోనే మూడు పర్యవేక్షణా కేంద్రాలుండగా నూతనంగా ఏర్పాటుచేసే కేంద్రాలతో కలిపి ఉమ్మడి జిల్లాలో గాలి నాణ్యతా పర్యవేక్షణా స్టేషన్లు 12కు చేరనున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో కలుషిత గాలి నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు అవకాశాలు సుగమంకానున్నాయి. కాగా వాయునాణ్యత సూచి (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌- ఏక్యూఐ) 0-50 వరకు ఉంటే స్వచ్ఛమైన, ఎలాంటి ఇబ్బందులు లేని గాలిగా పరిగణిస్తారు. కానీ సిమెంట్‌, ర సాయన పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులు, రైస్‌ మిల్లులు తదితర కాలుష్య కారక కారణాలతో ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ సగటు 90 నుంచి 130,కొన్ని సందర్భాల్లో 180వరకు ఉంటుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

లెక్కింపు ఇలా..

గాలి నాణ్యతా పర్యవేక్షణ స్టేషన్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో వీస్తున్న గాలి నాణ్యతను లెక్కిస్తారు. ఎప్పటికప్పుడు ఆయా స్టేషన్లలో గాలి నాణ్యత నమోదవుతూ పీసీబీ సెంటర్‌ సర్వర్‌కు చేరుతుంది. వాతావరణంలోని ఉద్గారాలను నాణ్యతా కేంద్రం లెక్కిస్తుంది. ఎస్‌వో-2, సూక్ష్మ ధూళి కణాలు ఉండే పీఎం 10, అతి సూక్ష్మ ధూళి కణాలుండే పీఎం 2.5 లెక్కించ నున్నారు. ప్రతీ నాలుగు గంటలకు ఎస్‌వో-2, ప్రతీ ఎనిమిది గంటలకు, పీఎం 10, 2.5 ఉద్గారాల నమూనాలను పీసీబీ సేకరిస్తుంది. అలాగే ఎక్కడ ఏ రకమైన ఉద్గారాలు పరిమితికి మించి ఉన్నాయి, ఏ సమయంలో ఎక్కువ కాలుష్యం వెలువడుతున్నది తదితర వివరాలు నమోదు కానున్నాయి. నాణ్యతా స్టేషన్లలో నమోదయ్యే వివరాల ఆధారంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకునే వీలుంటుంది. అయితే మనం పీల్చేగాలిలో మితిమీరి ఉంటున్న ఉద్గారాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, చర్మ, నేత్ర సమస్యలు తదితర వ్యాధులకు కారణమవుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పాతవి మూడు.. కొత్తగా తొమ్మిది

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండలో రెండు, చౌటుప్పల్‌లో ఒకటి మొత్తంగా మూడు గాలి నాణ్యతా పరిక్షా కేంద్రాలు ఈపాటికే ఉన్నాయి. తా జాగా మరో తొమ్మిది మంజూరయ్యాయి. వీటిలో యాదాద్రి భువనగిరి జిల్లా లో భువనగిరి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌పై ఏర్పాటు చేయనుండగా యాదగిరిగుట్టపై ఏర్పాటు చేసేందుకు ఎన్‌వోసీ కోసం పీసీబీ అధికారులు ఆలయ ఈవో కు లేఖ రాశారు. నల్లగొండ జిల్లాలో కలెక్టరేట్‌పైన, మిర్యాలగూడ ఫైర్‌స్టేషన్‌, పోలీ్‌సస్టేసన్‌, అగ్రికల్చర్‌ సొసైటీ కార్యాలయాలపై ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్‌, టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌పైన, చివ్వెంల పోలీస్టేషన్‌పై ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:45 AM