రైతుల ఆశలకు గండ్లు
ABN , Publish Date - Sep 09 , 2024 | 12:37 AM
సాగర్ ఎడమకాల్వ ఎంబీ కెనాల్ (ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) ఆయకట్టు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కెనాల్‌కు మూడు చోట్ల గండ్లు పడగా, నేటికీ మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. దీంతో 1.25లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఎడమకాల్వ గండ్ల మరమ్మతులకు నిధులు మంజూరు
నేటికీ ప్రారంభంకాని పనులు
హుజూర్‌నగర్, నడిగూడెం: సాగర్ ఎడమకాల్వ ఎంబీ కెనాల్ (ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) ఆయకట్టు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కెనాల్‌కు మూడు చోట్ల గండ్లు పడగా, నేటికీ మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. దీంతో 1.25లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అదేవిధంగా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద ఎడమ కాల్వకు రెండు చోట్ల గండ్లు పడగా, ఈ పనులు సైతం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్ ఎడమకాల్వ మొదటిజోన్‌లో ఉన్న ఎంబీ.కెనాల్‌కు మూడుచోట్ల గండ్లు పడ్డాయి. ఒకటి హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెం పరిధిలోని 14వ కిలోమీటర్ వద్ద గండిపడగా, పట్టణ పరిధిలోని రామస్వామి గట్టుకు సమీపంలో 18వ కిలోమీటర్ వద్ద కట్ట కోతకు గురికాగా, 22వ కిలోమీటర్ వద్ద రెండుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో లక్ష ఎకరాల పైగా నీరు అందించే ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. వానాకాలం నీటి విడుదలకు ముందురోజే సుమారు 16కిలోమీటర్ల దూరం రూ.18కోట్లతో ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ పనులు నిర్వహించిన 22వ కిలోమీటర్ వద్ద రెండుచోట్ల గండ్లు పడ్డాయి. ఆధునికీకరణకు నోచుకోని 14వ కిలోమీటర్ వద్ద పెద్ద గండి పడింది. కాల్వకు కుడివైపు గండిపడడంతో వరద ఒక్కసారిగా మర్రిగూడెం ఫీడర్ ఛానల్ నుంచి బూరుగడ్డ నల్లచెరువుకు చేరుకొని చెరువుకట్ట తెగింది. దీంతో బూరుగడ్డ, గోపాలపురం, కర్కకాయలగూడెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. పట్టణంలోని సింగారం రోడ్డులోని బట్టవారికంట చెరువు కట్ట, గోపాలపురం మోదుగుకుంట చెరువుకట్ట తెగింది. దద్దనాల చెరువు కారణంగా ఇక్కడి కాలనీలోని 300 ఇళ్లలోకి నీరు చేరింది. శివాలయం వీధిలోని చెరువు నుంచి వరద రావడంతో ఆ కాలనీలో 100 ఇల్లు నీట మునిగాయి. మట్టపల్లి బైపాస్ రోడ్డులో వందల ఎకరాలు వరదనీటిలో మునిగాయి. లింగగిరి పెద్ద చెరువు దిగువ భాగంలో పంటలు కొట్టుకుపోయాయి. వీటితో పాటు బూరుగడ్డ నుంచి ప్రవహించే వేమూలూరి వాగుకు ఇరువైపులా సుమారు 600 ఎకరాలు నీటమునిగాయి. వాగుకు రైతు లు ఏర్పాటు చేసుకున్న 90 మోటర్లకు పైగా తడిసి ముద్దయ్యాయి. సీతరాంపురం, అమరవరం, కరక్కాయలగూడెం, లక్కవరం, హుజూర్‌నగర్‌లో సుమారు 350 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
భారీ నష్టం
హుజూర్‌నగర్ మునిసిపాలిటీ, మండలంలోని 11గ్రామాల పరిధి లో సుమారు 13వేలఎకరాలకుపైగా నష్టం వాటిల్లింది. అధికారులు సుమారు 8వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేసింది. హుజూర్‌నగర్ డివిజన్‌లో వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం హుజూర్‌నగర్ మండలంలో 1,330 ఎకరాల్లో, గరిడేపల్లి 1,160, మఠంపల్లి 1,405, మేళ్లచెరువు 2,100, పాలకవీడు 200, చింతలపాలెం మండలంలో 1,160 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వేపలసింగారం రోడ్డులోని బట్టవారికుంట తెగడంతో 500 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. బూరుగడ్డ పెద్దచెరువు, నల్లచెరువుతో పాటు కరక్కాయలగూడెం లింగకుంట పరిధిలో 1,000 ఎకరాలకు పైగా నష్టం జరిగింది. 14వ కిలోమీటర్ వద్ద గండిపడిన ప్రదేశంలో ఒక్క హుజూర్‌నగర్ ప్రాంతంలో 1,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హుజూర్‌నగర్ ప్రాంతంలో ముక్య్తాల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 1,800 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది.
ప్రారంభంకాని మరమ్మతు పనులు
నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమకాల్వ 132, 133 కిలోమీటర్ వద్ద ఈ నెల 8న రెండు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల పరిధిలో కాగితరామచంద్రాపురం, నాయకన్‌గూడెం, మాధారం, మందనర్సయ్యగూడెం గ్రామాల్లో సుమారు 1,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భారీ వరదలకు పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఈ పొలాలు బాగుపడాలంటే కనీసం రెండు, మూడు పంటలు కోల్పోక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడమకాల్వకు గండ్లకు మరమ్మతు చేసేందుకు అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.10కోట్లు వేలు మంజూరు చేస్తూ ఈ నెల 5న పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎన్నెస్పీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, పనుల ప్రారంభానికి వర్షాలు అడ్డంకిగా మారాయి. దీనికి తోడు కాల్వ కట్టలపై వాహనాలు వచ్చే పరిస్థితి లేదు. మరమ్మతులు చేసేందుకు భారీ వాహనాల్లో సామగ్రి తరలించాల్సి ఉంది. అయితే భారీ వాహనాలు వచ్చేందుకు కాల్వ కట్టలు అనుకూలంగా లేవని ఎన్నెస్పీ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, పనులు ఆలస్యమైతే సాగు చేసిన పంటలు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారం పది రోజుల్లో పనులు పూర్తయి ఎడమ కాల్వకు నీరు విడుదల చేస్తే పంటలు చేతికందుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఎడమ కాల్వకు రెండు చోట్ల గండ్ల కారణంగా ఆయకట్టు పరిధిలో 42 ఎత్తిపోతల కింద ఉన్న 90వేల ఎకరాలు, మేజర్, మైనర్ కాల్వల కింద ఉన్న పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడింది.
ఎకరానికి రూ.30వేలు పరిహారం ఇవ్వాలి : పల్లె వెంకట్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి
వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేలు పరిహారంగా ప్రభుత్వం చెల్లించాలి. ఇసుక మేటలు వేసిన పొలాలను గుర్తించి ఎకరానికి రూ.50వేలు ఇవ్వాలి. వరదలతో రైతాంగానికి పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. అధికారులు సమగ్ర సర్వే చేసి పరిహారం వెంటనే అందించాలి.