Share News

త్యాగానికి ఫలితం ఏదీ?

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:48 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 23లక్షల ఎకరాలకు కృష్ణా జలాల ద్వారా సాగు నీటిని అందించి బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు 69 ఏళ్ల క్రితం చేసిన భగీరథ ప్రయత్నం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం తో సాకారమైంది.

త్యాగానికి ఫలితం ఏదీ?

నేటికీ పునరావాస గ్రామాల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలు

దశాబ్దాలుగా ఇదే పరిస్థితి

డీ-ఫాం పట్టాలు ఇచ్చినా హక్కులు దక్కని వైనం

ప్రభుత్వ పథకాలు పొందలేని దుస్థితి

తిరుమలగిరి(సాగర్‌): ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 23లక్షల ఎకరాలకు కృష్ణా జలాల ద్వారా సాగు నీటిని అందించి బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు 69 ఏళ్ల క్రితం చేసిన భగీరథ ప్రయత్నం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం తో సాకారమైంది. ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో కృష్ణా నది వెనుక జలాల్లో ముంపునకు గురైన సుమారు 26 గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిది. మునిగిపోతున్న సారవంతమైన భూములు, కన్నతల్లిలాంటి సొంత ఊరును, ఇంటిని వదిలి కట్టుబట్టలతో మూగ జీవాలను వెంటబెట్టుకొని అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ ప్రాంతాల్లో, కనీస సౌకర్యాలు లేని గుట్టలపై ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. అయితే నేటికీ ఈ పునరావాస గ్రామాలు, తండాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ప్రధానంగా అప్పట్లో కేటాయించిన అటవీ భూములకు సంబంధించిన డీ-ఫారెస్ట్‌ భూములపై హక్కులను నేటికీ పొందలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమలగిరి(సాగర్‌) మండలాన్ని రెవెన్యూ పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి శనివారం వస్తుండటంతో భూ సమస్యలపై స్పష్టత ఇస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునపేటతండా

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ కాలంలో బతుకుదెరువుకు కూలి చేసుకుంటున్న వందలాది మం ది గిరిజన రైతులకు అప్పటి కమ్యూనిస్టు నేత పరంధామయ్య చేసిన పోరాట ఫలితంగా మనుబోతుతండా (ప్రస్తుత నాగార్జునపేటతండా) వద్ద జీవనోపాధికి సర్వే నెం.12లో 400 ఎకరాల ఫారెస్ట్‌ భూమిని డీ-ఫారె్‌స్టగా మార్చి జీవో నెం.2204 ప్రకారం సుమారు 137మంది గిరిజనులకు ప్రభుత్వం పట్టాలు అందజేసింది. అప్పట్లో రైతులు సేద్యం చేసుకుంటున్న భూముల విస్తీర్ణం ప్రకారం సర్వే చేసి పట్టాలు ఇచ్చారేగాని వారు ఏ సర్వే నెంబర్లలో సేద్యం చేస్తున్నారనే అంశాన్ని గుర్తించకుండా, హద్దులను నిర్ణయించకుండా డీ-ఫాం పట్టాలు జారీ చేశారు. 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణిని అమలు చేసే క్రమంలో ఫారెస్ట్‌, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సంయుక్తంగా సర్వే నిర్వహించగా, సగం మంది రైతులు సర్వే నెం.12లో, మిగిలిన రైతులు సర్వే నెం.32లో కాస్తులో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఫారెస్ట్‌, రెవెన్యూ సరిహద్దు వివాదం ఎనిమిదేళ్లగా సాగుతూనే ఉంది. 1970లో సర్వే నెం.12లో డీ-ఫాం పట్టాలను తండా రైతులకు ఇచ్చామని, కాని కొందరు రైతులు సర్వే నెం.32లో సేద్యం చేస్తుండడంతో వారికి హక్కులు ఇవ్వలేమని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు. స్థానిక రైతులు మాత్రం పునరావాసం కింద సర్వే నెం.12లోనే ప్రభుత్వం భూములు ఇచ్చిందని, అప్పట్లో సంబంధిత అధికారులు హద్దులను నిర్ధారించకపోవడంతో జరిగిన తప్పిదానికి తమ కు డీ-ఫాం పట్టాలతో కూడిన పూర్తి హక్కులు రాకుంటే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెం.32లో సేద్యం చేస్తున్న తమకు పూర్తిస్థాయి హక్కులను కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పాస్‌పుస్తకాలు లేకపోవడంతో అన్నీ కోల్పోతున్నాం : ముడావత్‌ కమిలి, నాగార్జునపేటతండా

పదేళ్లుగా మా భూములకు పాస్‌పుస్తకాలు లేవు. దీంతో వ్యవసాయ రుణాలు, రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా, ఇలా అన్నింటినీ కోల్పోతున్నాం. పూర్వం సర్వే నెం.12లో డీ-ఫాం పట్టా భూములను ఇచ్చారు. కానీ, ఇప్పుడు అధికారులు సగం భూములు సర్వే నెం.12లో, సగం సర్వే నెం.32 ఫారె్‌స్టలో ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికీ ఐదుసార్లు సర్వే చేశారు. ఏం తేల్చట్లేదు. సమస్యను పరిష్కరించట్లేదు.

గట్టు మీదితండా

సాగర్‌ ప్రాజెక్టు ముంపునకు గురైన గుమ్మడంతండా వాసులను నేతాపురం శివారులోని ప్రస్తుత గట్టుమీదితండాకు తరలించారు. కానీ గట్టు ఎక్కడానికి సరైన రహదారి లేక, తాగునీటి కోసం గుట్ట కిందికి కిలోమీటరు దూరం నడవాల్సి రావడం, సేద్యం చేసుకునేందుకు భూములు అనుకూలంగా లేకపోవడంతో కొందరు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. ఇక్కడే ఉన్న రైతులు వారికి కేటాయించిన భూములను సర్వే చేయించుకొని రెవెన్యూ రికార్డులో నమోదు చేయించుకున్నారు. అయితే వలసల నుంచి తిరిగి వచ్చిన మిగిలిన రైతుల భూములు సర్వే నిర్వహించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన డీ-ఫాం పట్టాలను మాత్రమే రైతులు దాచుకున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో తండాలోని గుడిసెలన్నీ పూర్తిగా దగ్ధం కాగా, వారు దాచుకున్న డీ-ఫాం పట్టాలు కాలిపోయాయి. దీంతో వారి వద్ద ఆధారాలు లేక రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదుకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 1,330 ఎకరాలకు 290 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. మిగిలిన రైతుల వివరాలు రికార్డుల్లో లేకపోవడంతో భూములను సేద్యం చేస్తున్న రైతులకు ఫారెస్ట్‌ అధికారులు తరుచూ ఆటంకాలు కలిగిస్తున్నారు. ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది.

కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక్కడికి వచ్చాం : రమావత్‌ బాబ్లా, గట్టుమీదితండా

సాగర్‌నీళ్లు మమ్మల్ని ముంచినా ఇక్కడి నుంచి పోయేది లేదం టూ మొరాయించాం. ఉన్న ఊరు, భూములను, ఆస్తులను వదిలిపెట్టలేక తల్లడిల్లాం. డ్యాం కట్టడంతో నీళ్లు మా గ్రామానికి వస్తుండడం తో గట్టుపైకి చేరి మునుగుతున్న మా ఊరిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం. గత్యంత రం లేక ప్రభుత్వం చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే నేటికీ మేం కష్టపడి సేద్యం చేసుకున్న భూములకు పట్టాలు పొందలేకపోతున్నాం.

గోడుమడక

సాగర్‌ జలాల్లో ముంపుకు గురైన గ్రామస్థులకు అప్పటి ప్రభుత్వం ప్రస్తుత గోడుమడక వద్ద పునరావాసం కల్పించింది. సేద్యానికి అనువుగా లేని ఫారె్‌స్టలో సర్వే నెం.14, 39లో డీ-ఫారెస్ట్‌ పట్టాలను బాధితులకు అందజేసింది. అయితే 2008 నుంచి రెవెన్యూ రికార్డుల్లో డీ-ఫారెస్ట్‌ భూములకు (పట్టా భూములు) బదులుగా లావుణి పట్టా (ప్రభుత్వ భూమి)గా నమోదు చేశారు. దీంతో వారు తమ అవసరాల నిమిత్తం భూమిని విక్రయించాలన్నా, వారసత్వ బదిలీ చేసుకోవాలన్నా వీలుకాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పలు పునరావాస గ్రామాల్లో డీ-ఫారెస్ట్‌ భూముల క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్‌ ద్వారా జరుగుతున్నా, ఇక్కడ మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. సాగర్‌ ముంపులో ఎంతో విలువైన పట్టా భూములు కోల్పోయామని, కానీ పేరుకు డీ-ఫాం పట్టాలు ఇచ్చినా వాటిపై పూర్తి హక్కులు పొందలేకపోతున్నామని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పునరావాసంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం : పందిరి మారయ్య, గోడుమడక

సాగర్‌ జలాల ముంపుతో అర్ధాంతరంగా మా గ్రామస్థులను ప్రభుత్వం ఇక్కడికి పునరావాస కేంద్రాలకు తరలించింది. అప్పట్లో ఇక్కడ సరైన రోడ్లు లేక, తాగేందుకు నీళ్లు లేక, ఉండడానికి సరైన ఇల్లు లేక, సేద్యం చేసుకునేందుకు అనువైన భూములు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం. అప్పట్లో మా సొంత గ్రామంలో సారవంతమైన పట్టా భూములను కోల్పోయాం. ఇక్కడికి వచ్చాక డీ-ఫాం పట్టాలు ఇచ్చినా రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. దీంతో మా భూములకు విలువ లేకుండాపోయింది.

చెన్నాయిపాలెం

సాగర్‌ ముంపునకు గురికావడంతో కొందరు గిరిజన రైతులకు చెన్నాయిపాలెంలో పునరావాసం కల్పించారు. వారికి 1970లో సర్వే నెం.39లో డీ-ఫారెస్ట్‌ పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి సంబంధిత రైతులు ఆ భూములను సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే 2008 నుంచి ప్రభుత్వం జారీ చేసిన డీ-ఫారెస్ట్‌ భూములను రెవెన్యూ అధికారులు లావుణి పట్టా, ఫారెస్ట్‌ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. దీంతో ఫారెస్ట్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవసాయానికి ఆటంకం కలిగిస్తున్నారని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సుంకిశాలతండా

సాగర్‌ ముంపు గ్రామమైన పూర్వ సుంకిశాల తండాకు చెందిన గిరిజనులను 1970లో ఎల్లాపురం గ్రామ సమీపంలోని గుట్టలపై పునరావాసం కల్పించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన గిరిజనులకు గుట్టపైనే సర్వే నెం.255లో డీ-ఫారెస్ట్‌ పట్టాలను జారీ చేశారు. తదనంతరం కుటుంబాలు పెరిగే కొద్ది స్థానిక గిరిజనులు జీవనోపాధి కోసం పోడు వ్యవసాయం చేశారు. దీంతో 2005-06లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో 111 మందికి ఆర్‌ఓఎ్‌ఫఆర్‌ పట్టాలు జారీ అయ్యాయి. తదనంతరం బీఆర్‌ఎస్‌ హయాంలో 2022లో తాత్కాలిక అటవీ హక్కు పత్రాలను 70 మందికి అందచేశారు. అయితే వారు సేద్యం చేసుకుంటున్న భూములకు ఆన్‌లైన్‌లో 1-బీ, పహాణీలు రాకపోవడంతో సంబంధిత రైతులకు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు, రుణమాఫీ పొందలేకపోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పలు ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. సేద్యం చేసుకుంటున్న క్రమంలో ఫారెస్ట్‌ అధికారులు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. తండా నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, జానారెడ్డి మంత్రిగా ఉన్న హయాంలో కొంపల్లి నుంచి గట్టుమీదితండా వరకు రోడ్డును ఏర్పాటు చేశారని, ప్రస్తుతం అది గుంతలమయంగా మారి ఇబ్బందులకు గురవుతున్నామని గిరిజన వాసులు వాపోతున్నారు. పునరావాస గ్రామమైన సుంకిశాలను దత్తత తీసుకుంటున్నట్లు అప్పటి మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రకటించినా, ఆశించిన అభివృద్ధి, సమస్యలకు పరిష్కారం దొరకలేదని స్థానికులు పేర్కొంటున్నారు.

కాందిశీకుల భూములకు హక్కులు దక్కేనా?

స్వాతంత్య్రం అనంతరం మండల పరిధిలోని కృష్ణపట్టెలో ఉన్న రైతులు ఎన్నో ఏళ్లుగా కాందిశీకుల భూములను సేద్యం చేస్తున్నారు. చింతలపాలెం రెవెన్యూ శివారులోని సర్వే నెం.16, 28, 52, 60, 70, 204, తిమ్మాయిపాలెం రెవెన్యూ శివారులోని సర్వే నెం.24, 38లో కలిపి మొత్తం 2,871.14 ఎకరాల విస్తీర్ణంలో ఈ భూములు ఉన్నాయి. ఈ భూములు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని హోం మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉండడంతో కాస్తులో ఉండి సేద్యం చేస్తున్నా, రైతులకు గత ప్రభుత్వా లు హక్కులను కల్పించలేకపోయాయి. కృష్ణానదికి ఆనుకోని బండరాళ్లతో బీడుగా ఉన్న భూముల ను గిరిజనులు, స్థానికులు స్వశక్తితో సేద్యంలోకి తెచ్చుకున్నారు. అయితే కాస్తు కబ్జాలో ఉన్న రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా తాత్కాలిక హక్కులు కల్పించారు. దీంతో సంబంధిత రైతులకు బ్యాంకు ద్వారా వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు అం దాయి. అయితే కాలక్రమేణా కాందిశీకులు భూములు కలిగిన సర్వే నెంబర్లలో వాస్తవ విస్తీర్ణం కంటే రికార్డుల్లో ఎక్కువగా నమోదు కావడంతో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేసే సమయంలో ఆర్‌ఎ్‌సఆర్‌ను మించి ఉన్న సర్వే నెంబర్లను గుర్తించి పార్ట్‌-బీలో చేర్చారు. దీంతో రైతులు తమకు హక్కులు కల్పించాల్సిందిగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులను, నాయకులను, ఉన్నతాధికారులను కలిసి వినవ్నవించినా, భూ సర్వే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2004లో కాందిశీకుల భూములకు హక్కులను కల్పించేందుకు ప్రత్యేకంగా తెచ్చిన జీవో ఆధారంగా తమకు శాశ్వ త హక్కులు కల్పించాలని సంబంధిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలాన్ని రెవెన్యూ పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన క్రమంలో తమకు న్యాయం రైతులు కోరుతున్నారు.

నేడు జిల్లాలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి పర్యటన

నల్లగొండ, అక్టోబరు 4: రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి జిల్లాలో శనివారం పర్యటించనున్నారని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 11గంటలకు తిరుమలగిరి(సాగర్‌) మండలం నెల్లికల్‌ గ్రామం చేరుకుంటారని తెలిపారు. అక్కడ ధరణికి సబంధించిన రైతులు, సంబంధిత అధికారులతో ముఖాముఖి స మావేశమవుతారని పేర్కొన్నారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30గంటలకు నాగర్జునసాగర్‌ వద్ద ఉన్న విజయవిహార్‌ అతిథి గృహానికి చేరుకొని సంబంధితశాఖల అధికారులతో ధరణి పైలట్‌ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తారని, 3.30గంటలకు తిరిగి హైదరాబాద్‌ వెళ్తారని తెలిపారు.

Updated Date - Oct 05 , 2024 | 12:48 AM