Share News

లక్ష్యం నెరవేరేనా?

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:43 AM

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘వనమహోత్సవం’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడంలేదు. జిల్లాలో తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం భారీ వర్షాలు కురవగా, ఈసారి వరణుడు ముఖం చాటేశాడు.

లక్ష్యం నెరవేరేనా?

నిలిచిన వనమహోత్సవం

జిల్లాలో వర్షాభావ పరిస్థితి

55.65 శాతం మేరకు నాటిన పలు శాఖలు

లక్ష్యం 17.45 లక్షలు...నాటింది కేవలం 7.42లక్షలు

జిల్లాలో సగటు న 218.7 మి. మీ.ల వర్షపాతం

ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వెనుకడుగు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘వనమహోత్సవం’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడంలేదు. జిల్లాలో తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం భారీ వర్షాలు కురవగా, ఈసారి వరణుడు ముఖం చాటేశాడు. రాత్రివేళల్లో ఆకాశమంతా మేఘావృతమై, భా రీ వర్షం కురిసేలా కన్పిస్తూ.. చిరుజల్లులకు పరిమితమవుతోంది. భారీగా వర్షాలు కురవగానే వనమహోత్సవంలో జిల్లావ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటేందుకు జిల్లాయంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అయితే వర్షాలు లేకపోవడంతో మొక్కలు నాటాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడింది.

ఈ సంవత్సరం వానాకాలంలో జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో సగటున 218.7మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 217.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత నాలుగైదు రోజులుగా చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని చౌటుప్పల్‌, గుండాల మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షంపాతం నమోదుకాగా, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో మొక్కలు నాటేందుకు పలు శాఖలు సాహసం చేయడంలేదు. వర్షాలు పుష్కలంగా కురిస్తేనే నాటాలని నిర్ణయించుకున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో మొక్కలు నాటిన పక్షంలో... వాటిని సంరక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

నర్సరీల్లోనే మొక్కలు

వనమహోత్సవం కింద నాటాల్సిన మొక్కలను నర్సరీల్లోనే అందుబాటులో ఉంచారు. భారీ వర్షాలు కురవగానే సంబంధిత శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద ప్రధానంగా నీడనిచ్చే చెట్లతోపాటు పండ్లు, పూల చెట్లను పెంచేందుకు జిల్లాయంత్రాంగం తగిన కార్యాచరణ ప్రణాళిను రూపొందించింది. టేకు, కానుగ, నేరేడు, ఈత, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, బొప్పాయి, సీతాఫల్‌ పండ్ల మొక్కలను, చెరువు కట్టలపై ఈత, కర్జూర, తుమ్మచెట్లను నాటేందుకు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇళ్లల్లో పెంచుకునేందుకు పలు రకాల పూల మొక్కలను కూడా పంపిణీ చేయనున్నారు. వీటిలో గులాబీ, గన్నేరు, చామంతి, మల్లెపూలు, తదితరర మొక్కలను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రదేశాలతోపాటు ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగసంస్థల్లో, ప్రైవేట్‌ సంస్థల్లో, రోడ్డుకు ఇరువైపులా, ప్రతీ ఇంటివద్ద మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు.

హరితహారంలో ఇప్పటివరకు నాటిన మొక్కలు 7.42లక్షలు

జిల్లాలో 2024లో 17.45లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యా న్ని నిర్దేశించింది. జిల్లాలో ఇప్పటివరకు 7.42లక్షల మొక్కలను మాత్ర మే నాటారు. డీఆర్డీవో 5.89లక్షల మొక్కలు, ఉద్యానవన శాఖ 27వేలు, ఆబ్కారీ శాఖ 3వేలు, వ్యవసాయ శాఖ 7వేలు, అటవీశాఖ 81వేలు, మునిసిపాలిటీల్లో 44వేలు, పంచాయతీరాజ్‌ ఈఈ శాఖ 8వేలు, రోడ్లు, భవనాల శాఖ 3వేలు, పరిశ్రమల శాఖ 11మొక్కలను నాటింది.

ఈ ఏడాది లక్ష్యం 17.45లక్షలు

జిల్లాలో మొత్తం 421 గ్రామపంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలున్నాయి. ఈ సంవత్సరం 17.45 లక్షల మొక్కలను నాటేందుకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలో మొత్తం 451 నర్సరీలను ఏర్పాటుచేశారు. వీటిలో గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినవి 418 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ 9 లక్షల మొక్కలు, అటవీశాఖ లక్ష, వ్యవసాయ శాఖ 25 వేలు, ఉద్యానవన శాఖ 50 వేలు, పంచాయతీ శాఖ 2 లక్షలు, సాగునీటి శాఖ 25 వేలు, రోడ్లు, భవనాల శాఖ 25వేలు, పంచాయతీరాజ్‌ శాఖ 45 వేలు, ఆబ్కారీ శాఖ 40 వేలు, పరిశ్రమల శాఖ 25 వేలు, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, మోత్కురు, పోచంపల్లి మునిసిపాలిటీల్లో 3.17 లక్షల మొక్కలను నాటేందుకు జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది.

వర్షాభావ పరిస్థితులతోనే ఆలస్యం : పద్మజారాణి, డీఎ్‌ఫవో, భువనగిరి

జిల్లాలో వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో వనమహోత్సవం కింద మొక్కలు నాటడం ఆలస్యమైంది. భారీ వర్షాలు కురవగానే మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం మొక్కలను గ్రామాల్లో నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. 2024 సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన 17.45 లక్షల మేరకు నాటాల్సిన మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొత్తం 418 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. వీటితోపాటు ఆటవీ శాఖ 18, మునిసిపల్‌ శాఖ 15 నర్సరీలు ఏర్పాటుచేసింది. వర్షాలు కురవగానే మొక్కలను పంపిణీ చేయనున్నాం. ఇప్పటికే అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి.

Updated Date - Jul 27 , 2024 | 12:43 AM