Madhusudhanachari: మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోంది
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:02 AM
రాష్ట్రంలో ఏ మాత్రం మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోందని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
కేసులకు భయపడం: సిరికొండ మధుసూదనాచారి
మహబూబ్‌నగర్ నుంచే మరో ఉద్యమం: శ్రీనివాస్‌గౌడ్
పోలీసు విధులకు ఆటంకం కలిగించారని 19 మందిపై కేసు
మహబూబ్‌నగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏ మాత్రం మానవత్వం లేని ప్రభుత్వం నడుస్తోందని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తను కొట్టడాన్ని ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపితే శ్రీనివా్‌సగౌడ్‌తోసహా మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు.
మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నుంచే మరో ఉద్యమం ప్రారంభం కాబోతుందన్నారు. సోషల్ మీడియా కార్యకర్తను ఎందుకు కొట్టారని అడిగేందుకు వెళ్తే.. తమపైనా అక్రమంగా కేసు నమోదు చేశారని విమర్శించారు. కాగా, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తపై అక్రమ కేసు బనాయించి.. కొట్టారంటూ గత బుధవారం శ్రీనివా్‌సగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అదే రోజు 19 మంది బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.