Share News

Nalgonda: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పల్నాడు వైసీపీ నాయకుల మకాం!

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:04 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.

Nalgonda: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పల్నాడు వైసీపీ నాయకుల మకాం!

  • అరెస్టు భయంతో బంధువుల ఇళ్లకు...

  • మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, మఠంపల్లి లాడ్జిల్లో తలదాచుకున్న మరికొందరు

నల్లగొండ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో గొడవలు, ఘర్షణలు జరగడం, గ్రామాల్లో పరస్పర దాడుల నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్‌ అమల్లో ఉంది. పలువురు నాయకులు, కార్యకర్తలపై బైండోవర్‌ కేసులు, రౌడీషీట్లు కూడా ఉన్నాయి. దీంతో తాము అక్కడే ఉంటే పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పాటు, ప్రత్యర్థులు దాడిచేసే అవకాశం ఉండటంతో కృష్ణానది దాటి తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఉంటున్నారు. అలాగే మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌, దేవరకొండ, మఠంపల్లి ప్రాంతాల్లోని లాడ్జిల్లో తలదాచుకుంటున్నారు.


ప్రధానంగా మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని పిన్నెల్లి, బ్రాహ్మణపల్లి, మాచవరం, తంగేడ, దాచేపల్లి, రెంటచింతల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, మాచర్ల టౌన్‌, పెదగార్లపాడు, కేశాన్‌పల్లి, మాదినపాడు, దైద, పుల్లారెడ్డిగూడెం తదితర గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లో రెండు రోజుల నుంచి మకాం వేశారు. తర్వాత మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, మఠంపల్లిలోని లాడ్జిలకు చేరారు. పల్నాడులో పరిస్థితి సద్దుమణిగాక సొంత ఊళ్లకు తిరిగి వెళ్లాలని, లేకపోతే హైదరాబాద్‌ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమీప బంధువులు కావడంతో వారికి ఆశ్రయం ఇవ్వకతప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘర్షణల్లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని హాలియాతో పాటు దేవరకొండ నియోజకవర్గంలోని కంబాలపల్లి తదితర గ్రామాలకు చెందిన కొందరి ప్రమేయం ఉందన్న సమాచారంతో ఏపీ పోలీసులు ఈ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. ఈ ప్రాంతం నుంచి వెళ్లి మాచర్ల పట్టణం, పరిసర గ్రామాల్లో స్థిరపడ్డవారు ఎవరైనా గొడవల్లో పాల్గొని ఉండవచ్చని, వారికి ఇక్కడ బంధుత్వాలే తప్ప ఈ ప్రాంతంతో ఇతర సంబంధాలేమీ లేవని స్థానిక నాయకులు, పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 05:04 AM