Share News

Scam: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట 1.29 కోట్ల వసూళ్లు

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:40 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్ధులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు టోకరా వేసి రూ.1.29 కోట్ల మేర కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Scam: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట 1.29 కోట్ల వసూళ్లు

  • డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు టోకరా.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్ధులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు టోకరా వేసి రూ.1.29 కోట్ల మేర కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠా నాయకుడు అనుగు సురేందర్‌ రెడ్డి (34)తోపాటు మెరీనా రోస్‌ (52) బొలుగుల అంజయ్య (34), బండ వెంకటేష్‌ (55), కర్తావత్‌ గోపాల్‌ నాయక్‌ (48), అనుగు హర్షిణి రెడ్డి (33) అనే ఆరుగురు నిందితులను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, కీసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వేం నరేందర్‌ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా సభ్యులు సుమారు 107 మందిని మోసం చేసి రూ.1.29 కోట్లు వసూళ్లు చేసినట్టు గుర్తించారు. నిందితుల వద్ద డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నకిలీ ఆలాట్‌మెంట్‌ లెటర్లు, కీసర ఆర్డీవో స్టాంపులు, 8 మొబైల్‌ ఫోన్లు, రూ. 1.97 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సుధీర్‌బాబు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు.


కుషాయిగూడకి చెందిన అనుగు సురేందర్‌ రెడ్డి ఇంటర్మీడియట్‌ ఫెయిలై.. కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో క్యాటరింగ్‌ చేసేవాడు. అయితే, తాను మధ్యాహ్న భోజన కాంట్రాక్టర్‌ని చెప్పుకుంటూ పలువురు అధికారులను కలిసేవాడు. అధికారులు అతడి మాటలు నమ్మడంతో మోసాలకు పథక రచన చేశాడు. ఇందుకోసం మెరీనా రోస్‌, అంజయ్య, బండ వెంకటేష్‌, గోపాల్‌ నాయక్‌, అనుగు హర్షిణి రెడ్డితో ఓ ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. పథకం ప్రకారం సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఫోన్లు చేసి తాను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని అంటూ మాట్లాడేవాడు. తాను పంపించిన వారికి కాంట్రాక్టు అధ్యాపకులుగా ఉద్యోగాలివ్వాలని ఆదేశించేవాడు. అతని మాటలు నమ్మిన ప్రిన్సిపాళ్లు ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆయా పాఠశాలల్లో చేరిన ముఠా సభ్యులు తమకు వేం నరేందర్‌ రెడ్డితో మంచి పరిచయాలున్నాయని, కావాల్సిన చోటుకి బదిలీలు చేయిస్తామని ఇతర ఉద్యోగులను నమ్మించి డబ్బు వసూలు చేశారు. ఇలా సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలకు చెందిన ఏడుగురు ఉద్యోగుల నుంచి రూ.7లక్షల వసూలు చేశారు.


  • ‘డబుల్‌’ లబ్ధిదారులకు టోపీ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డితో తమకు పరిచయం ఉందని అడిగినంత డబ్బు ఇస్తే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఈ ముఠా సభ్యులు కీసర, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన దాదాపు వంద మందికి టోకరా వేశారు. వారి నుంచి అందినకాడికి డబ్బు తీసుకుని నకిలీ అలాటెమెంట్‌ లెటర్లు ఇచ్చేవారు. కొందరి వద్ద అత్యధికంగా రూ.3.50 లక్షల దాకా వసూలు చేసేవారు. డబ్బు కట్టిన వారికి నమ్మకం కలిగించేందుకు ముఠాకు చెందిన హర్షిణి రెడ్డి కీసర ఆర్డీవోనంటూ లబ్ధిదారులకు ఫోన్లు చేసి మాట్లాడేది. ఇల్లు కోసం అడిగితే ఎన్నికల కోడ్‌ అని ఏవో కుంటిసాకులు చెప్పి కాలయాపన చేసేది.


అలాగే, ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మరో ఇద్దరి నుంచి డబ్బు వసూలు చేశారు. అయితే, తమని నమ్మిని వారికి అనుమానం కలుగకుండా తన దూరపు చుట్టం ఖాతా అని చెప్పి మెరీనా రోజ్‌ పేరిట ఉన్న బ్యాంక్‌ ఖాతాలో డబ్బు జమ చేయించేవాడు. తన ఖాతాలో జమైన డబ్బులో కొంత మొత్తాన్ని కమీషన్‌గా ఉంచుకుని మెరీనా మిగిలిన డబ్బును సురేందర్‌కు ఇచ్చేది. ఇక, తమకు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వ చ్చాయంటూ అంజయ్య, వెంకటేష్‌, గోపాల్‌ నాయక్‌ ప్రచారం చేసుకుని అమాయకులని నమ్మించి వసూళ్లుకు పాల్పడేవారు. కాగా, మోసాలు చేసిన సంపాదించిన డబ్బును సురేందర్‌ రెడ్డి విలాసాలు చేసేవాడని, రూ.కోటి వరకు బెట్టింగ్‌కు ఖర్చు చేశాడని పోలీసులు గుర్తించారు.

Updated Date - Aug 24 , 2024 | 03:40 AM