Share News

Hyaderabad: ఓటమి భయంతోనే..

ABN , Publish Date - May 30 , 2024 | 02:52 AM

బీఆర్‌ఎస్‌ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్‌ కుమార్‌ నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సర్వేలో.. బీఆర్‌ఎస్‌ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది.

Hyaderabad: ఓటమి భయంతోనే..

  • బీఆర్‌ఎస్‌కు 50 సీట్లు కూడా రావని సర్వేలో వెల్లడి

  • అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు

  • టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలోనే ఎస్‌ఐబీ చీఫ్‌ మకాం

  • ఈసీ విధుల నుంచి తప్పించినా.. ఎస్‌ఐబీ చీఫ్‌కు,

  • టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి.. నిరంతరం టచ్‌లో ఉన్నాను

  • 2 నెలల్లో అదే పోస్ట్‌లోకి వస్తానని అందరికీ చెప్పా

  • పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్‌ రావు

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్‌ కుమార్‌ నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సర్వేలో.. బీఆర్‌ఎస్‌ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది. ఆ సర్వే వివరాల్ని ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ ముందు ఉంచాను. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక మూలాలు, వారికి ఆర్థిక సహాయం అందించే వారు, డబ్బు రవాణా చేసేందుకు అవకాశం ఉన్న వారిపై దృష్టి సారించాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసేవారిపై.. మరీ ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ప్రాంతాల్లో ఉన్న వారిపై నిఘా పెంచాం. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం మొత్తం ప్రభాకర్‌రావు వాట్సా్‌పలో పంచుకునేవారు. ఎస్‌ఐబీ, ప్రణీత్‌ బృందం ఇచ్చే సమాచారం విషయంలో రహస్యం పాటించాలని ప్రభాకర్‌ రావు ఎప్పటికప్పుడు మాతో చెప్పేవారు.’’ అని రాధాకిషన్‌ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.


టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలోనే..

అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా నిర్వహించాల్సిన సెటిల్మెంట్లపై చర్చించేందుకు ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు తరచూ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి వస్తుండేవారని.. ఎక్కువ సమయం టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలోనే గడిపేవారని రాధాకిషన్‌ రావు వెల్లడించారు. ప్రణీత్‌ రావు అండ్‌ టీం ప్రత్యేక నిఘాతో సేకరించిన వివరాల్ని ప్రభాకర్‌ రావు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో తమతో పంచుకునేవారని కూడా దర్యాప్తు అధికారులకు రాధాకిషన్‌ రావు వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత.. అక్టోబరు 20న ఎన్నికల కమిషన్‌ రాధాకిషన్‌ రావును టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతల నుంచి తప్పించింది. అయినా తాను ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావుతో, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరిపేవాడినని రాధాకిషన్‌ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తమ బృందం నిర్వహిస్తున్న పనులపైన ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూనే ఉండేవాణ్నని తెలిపారు. మరో రెండు నెలల్లో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా బాధ్యతలు చేపడతానని సిబ్బందికి చెప్పేవాడినని వెల్లడించారు. కానీ తాము ఇంత చేసినా.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని.. ఈ విషయం ప్రభాకర్‌ రావు, ప్రణీత్‌ రావుకు ముందే తెలుసని రాధాకిషన్‌ రావు వివరించారు.


ఎన్నికల ఫలితాల తర్వాత భుజంగరావు, శ్రవణ్‌ కుమార్‌, తనతోపాటు మరికొంత మంది కూర్చుని.. అప్పటి వరకూ నిబంధనలకు విరుద్ధంగా తాము చేపట్టిన పనులకు సంబంధించిన ఆధారాల్ని ఎలా చెరిపేయాలో చర్చించుకున్నామని రాధాకిషన్‌ రావు వెల్లడించారు. వరంగల్‌ జిల్లాకు చెందిన రాధాకిషన్‌ 1989లో ఎస్‌ఐగా పోలీస్‌ శాఖలో చేరారు. ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్‌ హోదాలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, సైబరాబాద్‌ పరిఽధిలోని అనేక పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహించారు. నల్లగొండ జిల్లా అడిషనల్‌ ఎస్పీగా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చీఫ్‌ మినిస్టర్‌ సెక్యూరిటీ గ్రూప్‌(సీఎంఎ్‌సజీ)కు అడిషనల్‌ ఎస్పీగా రాధాకిషన్‌ రావును నియమించారు. ఆ సమయంలోనే రాధాకిషన్‌రావుకు కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహిత్యం ఏర్పడింది. 2017లో ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయనకు.. ప్రభుత్వం హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌పై పట్టు సాధించడంలో టాస్క్‌ఫోర్స్‌ను కేసీఆర్‌ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఇదే విషయాన్ని రాధాకిషన్‌ రావు పోలీ్‌సలకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.


కోర్టు పచ్చ జెండా..

చంచల్‌గూడ జైల్లో విచారణ ఖైదీగా రిమాండ్‌లో ఉన్న రాధాకిషన్‌ రావు.. ఇంటి భోజనం చేయడానికి త అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించగా.. రోజుకు ఒక పూట ఇంటి నుంచి భోజనం అందించేందుకు న్యాయస్థానం అనుమతించింది. అయితే రిమాండ్‌లో ఉన్న ఖైదీకి బయటి నుంచి భోజనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభ్యంతరం చెబుతూ జైళ్ల శాఖ కోర్టును ఆశ్రయించింది. కాగా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులోనే అరెస్టయి, జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్‌ పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని పంజగుట్ట పోలీసులను ఆదేశించిన కోర్టు.. విచారణను కోర్టు 3కు వాయిదా వేసింది.

Updated Date - May 30 , 2024 | 02:52 AM