Rammohan Reddy: సీఎం అల్లుడికి భూమి కేటాయించినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
ABN , Publish Date - Nov 14 , 2024 | 04:05 AM
కొడంగల్ ఫార్మా విలేజ్లో సీఎం రేవంత్రెడ్డి అల్లుడి కంపెనీకి భూమిని కేటాయించినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్కు.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. లేని పక్షంలో కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు.
కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సవాల్
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొడంగల్ ఫార్మా విలేజ్లో సీఎం రేవంత్రెడ్డి అల్లుడి కంపెనీకి భూమిని కేటాయించినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్కు.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. లేని పక్షంలో కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. సీఎం రేంత్రెడ్డి తన అల్లుడి కంపెనీ కోసమే కొడంగల్లో ఫార్మా విలేజ్కు భూమిని సేకరిస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపణలపైన రామ్మోహన్రెడ్డి ఈ మేరకు స్పందించారు.
కొడంగల్ ఫార్మా విలేజ్లో భూమి కోసం ఇప్పటి వరకు ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. అక్కడ కాలుష్యరహిత ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వెనుకబడిన కొడంగల్, పరిగి లాంటి నియోజకవర్గాల్లో పరిశ్రమలు రావాల్సిన అవసరం లేదా? అన్ని పరిశ్రమలూ సిరిసిల్ల, సిద్దిపేటలకే రావాలా? అంటూ నిలదీశారు. సీఎల్సీ మీడియా హాల్లో బుధవారం ఈ మేరకు మాట్లాడారు.