Share News

Rangareddy: రిజిస్ట్రేషన్ల రాబడిలో రంగారెడ్డి టాప్‌!

ABN , Publish Date - May 30 , 2024 | 03:34 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.

Rangareddy: రిజిస్ట్రేషన్ల రాబడిలో రంగారెడ్డి టాప్‌!

  • తర్వాత మల్కాజిగిరి, హైదరాబాద్‌, సంగారెడ్డి

  • ఈ నాలుగు జిల్లాల నుంచే రూ.9,157 కోట్లు

  • మిగిలిన 29 జిల్లాల నుంచి రూ.2,118 కోట్లే!

  • చివరి స్థానంలో భూపాలపల్లి, ఆసిఫాబాద్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది. నూతన సబ్‌ రిజిస్టా్ట్రర్‌ కార్యాలయల నిర్మాణాల్లో ఈ జిల్లాలకే తొలి ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల కిందట నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్ర స్థానంలో నిలవగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాలతో ప్రభుత్వానికి మొత్తం రూ.11,275 కోట్లు సమకూరాయి.


ఇందులో రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, సంగారెడ్డి జిల్లాల నుంచే అత్యధికంగా రూ.9,157 కోట్లు రాగా.. మిగిలిన 29 జిల్లాల నుంచి రూ.2,118 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తం రాబడిలో ఈ నాలుగు జిల్లాల నుంచే దాదాపు 80 శాతానికి పైగా ఉంది. రాజధాని చుట్టూ స్థిరాస్తి వ్యాపారం జోరు మీద ఉండగా.. దూరంగా ఉన్న జిల్లాల్లో మాత్రం నామ మాత్రంగా సాగుతోంది. రెండు జిల్లాల్లో ఏడాది పొడవునా వచ్చిన ఆదాయం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. మరో 11 జిల్లాల్లో రూ.50 కోట్ల ఆదాయం కూడా దాటలేదు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కేవలం రూ.6 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 9 కోట్ల ఆదాయం వచ్చింది.


ఆదాయంలో టాప్‌ 10 జిల్లాలు

రంగారెడ్డి జిల్లాలో రూ.4,338 కోట్లు, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 2,447 కోట్లు, హైదరాబాద్‌లో 1,408 కోట్లు, సంగారెడ్డిలో 964 కోట్లు, హనుమకొండలో 283 కోట్లు, యాదాద్రి భువనగిరిలో 193 కోట్లు, ఖమ్మంలో 170 కోట్లు, నిజామాబాద్‌లో 142 కోట్లు, కరీంనగర్‌లో 137 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.112 కోట్ల రాబడి వచ్చింది.


తక్కువ ఆదాయం వచ్చిన 10 జిల్లాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రూ.6 కోట్లు, జయశంకర్‌ భూపాలపల్లి 9 కోట్లు, ములుగు 11 కోట్లు, నారాయణపేట 23 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం 28 కోట్లు, జోగులాంబ గద్వాల 32 కోట్లు, వరంగల్‌ 32 కోట్లు, నిర్మల్‌, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి రూ.38 కోట్లు చొప్పున, వనపర్తి నుంచి రూ.39 కోట్లు వచ్చాయి.

Updated Date - May 30 , 2024 | 03:34 AM