Share News

పాలమూరుకు రూ.2,000 కోట్లు

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:14 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ, సంక్షేమ బాట పట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

పాలమూరుకు రూ.2,000 కోట్లు

రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపు

కోట్‌పల్లి ప్రాజెక్టుకు రూ. 10కోట్లు

బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట

అనంతగిరికి పర్యాటక సొబగులు

సాగు భూములకే రైతు భరోసా

రైతు కూలీలకు రూ.12,000

శివార్లలో శాటిలైట్‌ టౌన్‌షి్‌పలు

పెన్షన్ల పెంపు ప్రస్తావనే లేదు

ఎయిర్‌పోర్టు వరకే మెట్రో

ఫార్మాసిటీ ఊసే లేదు

రాష్ట్ర శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి జిల్లా రైతాంగానికి ఊరట కలిగించేలా ఉంది. ఎక్కువగా వ్యవసాయ రంగాలకు నిధులు కేటాయించడం ఉమ్మడి జిల్లా రైతులకు కలిసి రానుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోట్‌పల్లి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగింది. ఇటీవల కాలంలో కోట్‌పల్లి ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. ఇక శివారు ప్రాంతాల్లో శాటిలైట్‌ టౌన్‌షి్‌పలు ఏర్పాటు చేయనుండడం కలిసి వచ్చే అంశం. సొంతింటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో ఇల్లులేని పేదలకు ఒక గూడు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. దీంతో వేలాదిమంది సొంతింటి వారు కానున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/వికారాబాద్‌) : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ, సంక్షేమ బాట పట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పలు స్కీమ్‌లకు నిధులు కేటాయించినప్పటికీ కొన్ని స్కీమ్‌ల ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలు, రైతులతో పాటు వివిధ వర్గాల వారికి సంక్షేమ పథకాల కింద భారీగా నిధులు కేటాయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15వేలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ఎన్నికల్లో రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని, వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడి సహాయం అందిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని గతంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే వ్యవసాయం లేని రైతు కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ. 1,200 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది కుటుంబాలకు మేలు జరగనుంది. వరి సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుందని ప్రకటించారు. ఇక ఉమ్మడి జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పినప్పటికీ ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ. 2వేల కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరికొన్నేళ్లు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో ఉమ్మడి జిల్లాలో కొంతమేర పనులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేదు. తాజా బడ్జెట్‌లో పెన్షన్ల పెంపుపై ప్రస్తావన లేదు. గత ఎన్నికల్లో పేద వర్గాలకు అందించే పెన్షన్లు రూ. 4వేలకు మించి పెంచుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎక్కడా ఫార్మాసిటీ ఊసే లేదు. గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఒకేచోట ఫార్మాసిటీ ఏర్పాటుకు బదులు ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

పర్యావరణ పర్యాటకంగా అనంతగిరి

తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలను పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పర్యావరణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఏడు అటవీ ప్రాంతాలను ఎంపిక చేయగా, దాంట్లో అనంతగిరి సర్క్యూట్‌ ఒకటి. పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరేలా పర్యావరణ పర్యాటకాన్ని అభివృద్ధి పరచనున్నారు. కొండలు, గుట్టలు, చెట్లు, జలపాతాలు, వన్యజీవులు, జలాశయాలకు నష్టం జరగకుండా అటవీ సంపదను పరిరక్షించుకుంటూ మరింత విస్తృత పరిచేలా చర్యలు తీసుకోనున్నారు. అటవీ పరిరక్షణ, అభివృద్ధికి దోహదపడే విధంగా పర్యావరణ పర్యాటక రంగాన్ని విస్తృత పరచనున్నారు. ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతుల్లో ఉత్తమ విధానంతో ఎకో టూరిజం పాలసీని రూపొందించి అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు. అనంతగిరిని పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిస్తే స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి.

సొంతింటి కలకు రూ.5లక్షలు

పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి రూ.5లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణాల కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షల చొప్పున అందజేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. అలాగే పూర్తయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులకు పంపిణీ చేస్తామన్నారు. అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

శంషాబాద్‌ వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు

శంషాబాద్‌ వరకు మెట్రోలైన్‌ విస్తరణ చేపట్టనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఓల్డ్‌ సిటీని అనుసంధానిస్తూ శంషాబాద్‌ వరకు మెట్రో పనుల విస్తరణకు రూ.100కోట్లు కేటాయించారు. అలాగే నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ లైన్‌ కూడా అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన మేరకు మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు, ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే గతంలో సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు మెట్రోను కందుకూరు వరకు విస్తరిస్తామని ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్‌లో ఈ విషయం ప్రస్తావనే లేదు. ఇక హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు కలిపి విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

శివార్లలో శాటిలైట్‌ టౌన్‌షి్‌పలు

నగర శివార్లలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా శాటిలైట్‌ టౌన్‌షి్‌పలు నిర్మిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. తక్కువ ధరలకే పేద, మధ్య తరగతి వర్గాల వారికి అనుకూలమైన నివాస గృహాలు నగరం చుట్టూ నిర్మిస్తామని తెలిపారు. అలాగే రీజినల్‌ రింగు రోడ్డుకు రూ. 1,525 కోట్లు కేటాయించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌కు రూ. 1,500కోట్లు, ఔటర్‌ రింగురోడ్డుకు రూ. 200 కోట్లు కేటాయించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ పనులకు నిధులు కేటాయించడంతో శివార్లలో మూసీ సుందరీకరణ పనులు ఊపందుకోనున్నాయి.

కోట్‌పల్లి ప్రాజెక్టుకు నిధుల వరద

వికారాబాద్‌ జిల్లాలో ఏకైక మధ్య తరహా ప్రాజెక్టు కోట్‌పల్లికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించింది. చాలా సంవత్సరాలుగా కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోవడం లేదు. కాలువలు, తూములు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల కాలంలో కోట్‌పల్లి ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతు పనుల కోసం రూ.25 లక్షల నుంచి రూ. 50లక్షల వరకు కేటాయింపులు చేసేవారు. అయితే ఈసారి కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ తదితర పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.10 కోట్లు, భవన నిర్మాణాల కోసం మరో రూ.28 లక్షలు కేటాయించింది. కోట్‌పల్లి ప్రాజెక్టును ఆధునీకరించి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు ఇటీవల రూ.110 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అంతే కాకుండా ఇరిగేషన్‌ డివిజన్‌, సబ్‌ డివిజన్‌ కార్యాలయాల నిర్మాణానికి రూ.1.54 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనల నివేదికను ప్రభుత్వానికి పంపించిన విధితమే. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కోట్‌పల్లి ప్రాజెక్టుకు రూ.10 కోట్లు, భవన నిర్మాణాలకు రూ.28 లక్షలు కేటాయించింది.

రంగారెడ్డి జిల్లాకు అన్యాయం : బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రంగారెడ్డి

రాష్ర్టానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చి పెట్టే రంగారెడ్డి జిల్లాకు బడ్జెట్‌ కేటాయుయింపులో అన్యాయం జరిగింది. సీఎం సొంత నియోజకవర్గానికి భారీగా నిధులు కుమ్మరించుకుని పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాపై శీతకన్ను పెట్టారు. కూరగాయలజోన్‌ గురించి స్వయంగా సీఎం ప్రకటించినా ఫలితం లేదు. మొత్తంగా రంగారెడ్డి జిల్లాకు ప్రయోజనం శూన్యం

పేదలకు ఆమోదయోగ్యం : పాలమాకుల జంగయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి, రంగారెడ్డి

రాష్ట్ర బడ్జెట్‌ పేద ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మౌలిక సదుపాయల కల్పనకు అనుగుణంగా ఉంది. ఎయిర్‌పోర్టుకు మెట్రో వేసేందుకు రూ.వంద కోట్లు, మూసీ అభివృద్ది కోసం రూ.1,500 కోట్లు కేటాయించడం శుభ పరిణామం.

ప్రజారంజక బడ్జెట్‌ : చల్లా నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రంగారెడ్డి

ఇది పేదల బడ్జెట్‌. వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది. విద్య, వైద్యం, విద్యుత్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి నిధులు కేటాయింపు జరిగింది. ఐటీ, నీటి పారుదల వంటి వాటికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.

విద్యారంగానికి అంతంత మాత్రమే : ఏవీ సుధాకర్‌, ఎస్టీయూటీస్‌ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొఠారి కమిషన్‌ నివేదిక ప్రకారం విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి. కానీ.. కేవలం 7.31శాతమే కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌ 6.57 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా విద్యారంగానికి సరిపోయే నిధులు పెంచలేదు.

పెన్షన్ల పెంపు ప్రస్తావనే లేదు: లంబ మంజుల, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌

పెన్షన్లపై పెంపు చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్‌లో దాని ప్రస్తావనే తేలేదు. తెల్లరేషన్‌కార్డు ఉన్న మహిళలకు 2,500 రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్‌లో దాని గురించి ప్రస్తావించలేదు. కాంగ్రెస్‌ సర్కార్‌ మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మహిళల అభివృద్ధికి నిధులు పెంచాలి.

విద్యకు కేటాయింపులు పెంచాలి : పి.మాణిక్‌రెడ్డి, ప్రధాన సంపాదకుడు, వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ

గత సంవత్సరం రూ.2,90,000 కోట్ల బడ్జెట్‌లో విద్యకు రూ.19,093 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.21,292 కోట్లు కేటాయించారు. రూ.2,200 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15శాతంలో సగానికి మించలేదు. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి ఈ కేటాయింపులు సరిపోవు. విద్యకు కేటాయింపులు పెంచాలి.

Updated Date - Jul 26 , 2024 | 12:14 AM