Share News

ప్రతిపాదనల్లోనే ఏసీపీ కార్యాలయం

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:36 PM

ఆమనగల్లు పట్టణంలో ఏసీపీ కార్యాలయం ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏసీపీ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.

 ప్రతిపాదనల్లోనే ఏసీపీ కార్యాలయం

-డీజీపీ హామీ ఇచ్చినా అమలు కాని వైనం

-ఎమ్మెల్యే కసిరెడ్డి, ఎంపీ మల్లు రవిపై ఒత్తిడి

ఆమనగల్లు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి ): ఆమనగల్లు పట్టణంలో ఏసీపీ కార్యాలయం ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏసీపీ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కడ్తాల మండల కేంద్రంలో నూతన పోలీసు స్టేషన్‌ భవనం ప్రారంభం సందర్భంగా అప్పటి హోంమంత్రి మహమూద్‌ అలీ, అప్పటి డీజీపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ రెండు మూడు రోజుల్లో కార్యాలయం ప్రారంభిస్తామని తెలిపారు. కొద్దిరోజులకే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం, డీజీపీ మారడంతో కార్యాలయ ఏర్పాటు మరుగున పడింది. ఆమనగల్లు, తలకొండపల్లి , కడ్తాల, మాడ్గుల మండలాలను కలిపి ఆమనగల్లులో ఏసీపీ కార్యాలయం ఏర్పాటుకు పోలీసులు ప్రతిపాదించారు. ప్రస్తుతం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, రాచకొండ కమిషనరేట్‌ పరిఽధిలో మాడ్గుల పోలీసు స్టేషన్లు కొనసాగుతున్నాయి. మాడ్గుల పోలీసు స్టేషన్‌ను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి మార్చి నాలుగు పోలీసు స్టేషన్లతో కలిపి ఏసీపీ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదించారు.

పెరుగుతున్న ఒత్తిడి

కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నాలుగు మండలాలకు గాను ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి పోలీసు స్టేషన్లు షాద్‌నగర్‌ ఏసీపీ పరిధిలో, మాడ్గుల ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేసుల సందర్భాలలో కమిషనరేట్లు వేర్వేరుగా ఉండడంతో ప్రజాప్రతినిధులకు కూడాఇబ్బందిగా మారింది. ఈనేపథ్యంలో నాలుగు పోలీసు స్టేషన్లను ఒకే కమీషనరేట్‌ పరిధిలోకి తీసుకువచ్చి ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పోలీసు శాఖ పరంగా ఆదిశగా గత ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లు రవిలపై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల పలువురు నాయకులు వారిని కలిసి ఏసీపీ కార్యాలయం ఏర్పాటు గూర్చి వినతి పత్రం అందజేశారు. అయినా స్పందన లేదు. ఈర పాంతం సమీపంలోని ముచ్చర్ల వద్ద పోర్త్‌ సిటీ ఏర్పాటు నేపథ్యంలో ఆమనగల్లులో ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేయించాలని సీఎ రేవంత్‌ రెడ్డిని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:36 PM