లావణ్య కూడా చనిపోయింది!
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:39 AM
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఓ తల్లి ఇద్దరు పిల్లలను తోసి తానూ దూకిన ఘటనలో కూతురు లావణ్య (18) కూడా మరణించింది. ఆమె మృతదేహాన్ని శుక్రవారం వెలికి తీశారు.
ఇబ్రహీంపట్నం ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
రెండోరోజు మృతదేహాన్ని వెలికితీసిన డీఆర్‌ఎఫ్ బృందం
కూతురు పెళ్లి విషయంలోనే గొడవపడిన భార్యాభర్తలు
ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసి తానూ దూకిన తల్లి
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 6: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఓ తల్లి ఇద్దరు పిల్లలను తోసి తానూ దూకిన ఘటనలో కూతురు లావణ్య (18) కూడా మరణించింది. ఆమె మృతదేహాన్ని శుక్రవారం వెలికి తీశారు. ఈ ఘటనలో గురువారం తల్లీ కుమారుడి మృతదేహాలు లభ్యమవగా.. కూతురు ఒరుసు లావణ్య మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం లభ్యమైంది. డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని వెలికితీశారు. గురువారం రాత్రి తల్లి మంగ, కుమారుడు శరత్‌ల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. లావణ్య మృతదేహం కోసం గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రయత్నించినా లభ్యం కాలేదు. తిరిగి శుక్రవారం ఉదయం డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టి వెలికితీసింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాతపడడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృత్యువు నుంచి తప్పించుకున్న విఘ్నేష్
మంగ చిన్న కుమారుడు విఘ్నేష్ (5) మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. తల్లి మంగ కూతురు లావణ్య, కుమారులు శరత్, విఘ్నే్‌షలను వెంట తీసుకుని ఇబ్రహీంపట్నం చెరువు వ్దకు వచ్చి పెద్ద తూము దగ్గర మెట్ల వెంట నీటి ఒడ్డుకు చేరుకున్నారు. అందరం స్నానం చేసి వెళ్లిపోదామని పిల్లలను ఒప్పించిన మంగ.. నీటి అంచున ఉన్న లావణ్య, శరత్, విఘ్నే్‌షలను ముందుగా నీటిలో తోసింది. అయితే, చిన్న కుమారుడు విఘ్నే్‌షను కూడా నీటిలో తోసినప్పటికీ అతడు చెరువు మెట్ల సాయంతో నెమ్మదిగా దరికి చేరుకున్నాడు. కాగా, అప్పటికే మంగ కూడా నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అసలే రాత్రి 7.30 ప్రాంత ంలో వాతావరణం మబ్బులు కమ్ముకుని జల్లు లు కురుస్తున్న సమయంలో తెలిసీ తెలియని వ యసులో ఉన్న విఘ్నేష్ ఏడుస్తూ మెల్లగా మెట్లు ఎక్కుతుండగా అటువైపు దారివెంట వెళ్తున్నవారు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు, మున్సిపల్, ఫైర్ సిబ్బంది సహాయంతో అదే రాత్రి మంగ, శరత్‌ల మృతదేహాలను వెలికితీశారు.
కూతురి పెళ్లి విషయంలో గొడవ పడ్డారా?
కాగా, లావణ్య పెళ్లి విషయంలో భార్యా భర్తలు మంగ, కుమార్‌లు బుధవారం రాత్రి గొడవపడ్డారని బంధువులు చెబుతున్నారు. మంగ, కుమార్ ఇద్దరిదీ రెండో వివాహమే. కుమార్ మొదటి భార్యకు ముగ్గురు ఆడపిల్లలు కాగా.. మగ సంతానం కోసం మంగను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు శరత్, విఘ్నే్‌షలు ఉన్నారు. అప్పటికే మంగకు మరొకరితో వివాహమై కూతురు లావణ్యతో పాటు కుమారుడున్నాడు. మొదటి భర్తతో దూరంగా ఉన్న మంగ.. కుమార్‌కు దగ్గరైంది. అయితే, మొదటి భర్త సంతానమైన లావణ్య పెళ్లి విషయంలో మంగ, కుమార్‌లు గొడవ పడ్డారని.. దాంతో కుమార్ మంగను తీవ్రంగా కొట్టినట్లు బంధువులు చెబుతున్నారు. మనస్తాపానికి గురైన మంగ పిల్లలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.