మద్యం సీసా కోసం హత్య
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:20 AM
జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు కేవలం మద్యం సీసాల కోసం ఓ యువకుడిని హత్య చేశారు.
ఆగస్టు 30న పెద్దేముల్ మండలంలో ఘటన
ఘటనా స్థలంలో దొరికిన పర్స్ ఆధారంగా కేసు ఛేదన
వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు రూరల్, సెప్టెంబర్ 6: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు కేవలం మద్యం సీసాల కోసం ఓ యువకుడిని హత్య చేశారు. బెల్టుతో గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని సుద్ధగుంతలో పడేశారు. ఘటనా స్థలంలో దొరికన పర్స్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. శుక్రవారం కరన్‌కోట్ పోలీసు స్టేషన్‌లోని సీఐ కార్యాలయంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బండమీదిపల్లి రమేశ్(32) ఆగస్టు 31న గోపాల్పూర్ శివారులోని ఓ సుద్ధగుంతలో పడి మృతి చెందాడు. అతడి తల్లి నాగమ్మ తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహించారు. సంఘటన స్థలంలో ఓ పర్సు దొరికింది. ఈ పర్సులో బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు సంబంధించిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలు లభ్యమయ్యాయి. శ్రీకాంత్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బండమీదిపల్లి నరేశ్‌తో కలిసి రమేశ్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు.
పంపకంలో తేడా రావడంతో హత్య
శ్రీకాంత్, నరేశ్ ఇద్దరూ కలిసి ఆగస్టు 30న తాండూరుకు బైక్‌పై వచ్చారు. బైక్‌పై అటు ఇటు తిరుగుతూ ఉన్న క్రమంలో రుద్రారం గ్రామానికి చెందిన రమేశ్ కనిపించాడు. ముగ్గురూ కలిసి పెద్దేముల్‌కు వచ్చి మద్యం సేవించారు. మద్యానికి డబ్బులు లేకపోవడంతో పెద్దేముల్ మండల కేంద్రంలో ఉన్న కల్లు దుకాణంలో 13 సీసాల క్వార్టర్లు దొంగతనం చేశారు. దొంగతనం చేసిన తర్వాత మద్యం సీసాల పంపకం విషయంలో రమేశ్, శ్రీకాంత్, నరేశ్‌లు గొడవపడ్డారు. రమేశ్ తనకు ఎక్కువ మద్యం సీసాలు కావాలని గొడవ పడ్డారు. దీంతో రమేశ్‌ను చంపాలని కుట్ర చేశారు. రుద్రారం గ్రామానికి వెళ్లే క్రమంలో రమేశ్‌ను కిందపడేసి మీద కూర్చున్నారు. ఆ సమయంలో నరేశ్ తన వద్ద ఉన్న బెల్టుతో రమేశ్ గొంతుకు వేసి అటు శ్రీకాంత్, ఇటు నరేశ్ బలంగా లాగారు. దీంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని గోపాల్పూర్ శివారులోని సుద్ద గుంతలో పడేశారు. తర్వాత రుద్రారంలో రాత్రి పడుకుని ఉదయం సల్బత్తాపూర్ వెళ్లారు. ఘటన స్థలంలో శ్రీకాంత్ పర్సు ఆధారంగా కేసును ఛేదించి నిందితులు శ్రీకాంత్, నరేశ్‌లను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఆయనతో పాటు రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ గిరి, కానిస్టేబుళ్లు ఉన్నారు.
కారు అద్దాలు ధ్వంసం చేసిన కేసులోనూ..
అయితే రుద్రారం గ్రామానిక చెందిన నరేశ్ హైదరాబాద్ శివారులోని పటన్‌చెరులో ఉంటున్నాడు. తనకు ఏదైనా పని కల్పించాలని సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ను కోరాడు. పని దొరకడంతో నరేశ్, శ్రీకాంత్ ఇద్దరూ ఆగస్టు 29వ తేదీన సల్బత్తాపూర్ గ్రామానికి వచ్చి అక్కడ ఓ కారు అద్దాలు పగలగొట్టి అందులో కెమెరాలు దొంగతనం చేశారు. ప్రస్తుతం ఈ కేసు బంటారం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.