Share News

Doctors: ‘గ్రామీణ’ వైద్యులకు భారీగా వేతన పెంపు!

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:31 AM

గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారీ దవాఖానాల్లో పనిచేసే వైద్యులకు వేతనాలు భారీగా పెరగనున్నాయి.

Doctors: ‘గ్రామీణ’ వైద్యులకు భారీగా వేతన పెంపు!

  • 100-125 శాతం దాకా పెంచే యోచన

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారీ దవాఖానాల్లో పనిచేసే వైద్యులకు వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు సర్కారు సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌, వరంగల్‌ వంటి నగరాలకే పరిమితమవుతున్న వైద్యులను గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు పంపించి.. మెరుగైన వైద్య సేవలందించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే రెట్టింపు వేతనం (వంద శాతం ఇన్సెంటివ్‌), గిరిజన ప్రాంతాల్లో అయితే 125 శాతం ఇవ్వనున్నట్లు సమాచారం.


వైద్య కళాశాలలు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తూ స్పెషాలిటీ సేవలు అందించే వైద్యులందరికీ ఈ ప్రోత్సాహక పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్‌, ములుగు, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని మెడికల్‌ కాలేజీల్లో పనిచేసేందుకు డాక్టర్లు దొరకడం లేదు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు మంత్రి రాజనర్సింహ పలుమార్లు డాక్టర్లతో సమావేశమై, వారి అభిప్రాయాలు సేకరించారు.


ఏపీ, ఒడిసా సహా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయించారు. ఒడిసాలో వైద్యులకు మూల వేతనంపై 25 నుంచి 150 శాతం వరకు ప్రోత్సాహకం కింద ఇస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఇలా ప్రోత్సాహకాలివ్వాలంటే ఏటా రూ.200 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను మంత్రి ఆమోదించి, ఆర్థిక శాఖకు పంపించారు.

Updated Date - Sep 05 , 2024 | 04:31 AM